- అధ్యక్షురాలిగా అనన్య రతూరి, కార్యదర్శిగా స్టాంజిన్ డెస్క్యాంగ్ పోటీ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశవ్యాప్తంగా యువత ఉద్యమాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (డియుఎస్‌యు) ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్ఎ సంయుక్త ప్యానెల్ బరిలోకి దిగనుంది. విద్యార్థి కేంద్రిత, ప్రజాస్వామ్య రాజకీయాలను ముందుకు తీసుకెళ్లడంతోపాటు డబ్బు, కండబలం ఆధారిత రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా విద్యార్థి నాయకత్వాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఉమ్మడి ప్యానెల్‌ను బరిలోకి దింపుతున్నట్లు రెండు సంఘాలు ప్రకటించాయి. ఈ మేరకు శుక్రవారం ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్ఎ ప్యానెల్ అభ్యర్థులను ప్రకటించాయి. ఎస్‌ఎఫ్‌ఐ తరపున కార్యదర్శి అభ్యర్థిగా స్టాంజిన్ డెస్క్యాంగ్, సంయుక్త కార్యదర్శి అభ్యర్థిగా బి. పరిజాత్, ఎఐఎఎస్ తరపున అధ్యక్ష అభ్యర్థిగా అనన్య రతూరి, ఉపాధ్యక్ష అభ్యర్థిగా అక్షత్ శిఖర్‌ను ప్రకటించాయి. ఉత్తరాఖండ్‌కు చెందిన అనన్య రతూరి ఢిల్లీ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సమస్యలపై చురుగ్గా ఉద్యమాలు నిర్వహించిన నాయకురాలిగా ఎఐఎఎస్ పేర్కొంది. అలహాబాద్‌కు చెందిన అక్షత్ శిఖర్ నీట్ యుజి-2026 పరీక్షకు సిద్ధమయ్యారని, పరీక్షకు సంబంధించిన పరిణామాల నేపథ్యంలో విద్యార్థుల ఆందోళనల్లో పాల్గొన్నారని ఎఐఎస్ఎ తెలిపింది. హిందూ కళాశాలలో మొదటి సంవత్సరం ఎంఎస్‌సి మ్యాథమెటిక్స్ చదువుతున్న లడాక్‌లోని లేహ్ విద్యార్థిని స్టాంజిన్ డెస్క్యాంగ్ ఎస్‌ఎఫ్‌ఐ తరపున కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్నారు. రామ్‌జాస్ డిగ్రీ కళాశాలలో విద్యార్థి సంఘం ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. వేధింపులు, బెదిరింపులు, అధికార దుర్వినియోగానికి తావులేని క్యాంపస్ కోసం పోరాడతామని ఆమె పేర్కొన్నారు. హన్స్‌రాజ్ కళాశాలలో మొదటి సంవత్సరం ఎంఎ ఇంగ్లీష్ చదువుతున్న బి. పరిజాత్ ఎస్‌ఎఫ్‌ఐ తరపున సంయుక్త కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్నారు. విద్యార్థుల విద్యా హక్కులు, సాంస్కృతిక హక్కుల పరిరక్షణకు కృషి చేస్తామని పరిజాత్ పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)