పెద్ద సంఖ్యలో ఓటర్ల తొలగింపును ఆపాలి
ప్రముఖ న్యాయవాది, రాజ్యసభ సభ్యులు కపిల్ సిబల్ డిమాండ్
న్యూఢిల్లీ : బిజెపిని ఎన్నికల్లో గెలిపించేందుకే ఎస్‌ఐఆర్ అని ప్రముఖ న్యాయవాది, రాజ్యసభ ఎంపి కపిల్ సిబల్ బుధవారం వ్యాఖ్యానించారు. అందుకోసమే ఎన్నికల కమిషన్ ఈ ప్రక్రియను చేపడుతోందన్నారు. ఎస్‌ఐఆర్ పేరుతో పెద్ద మొత్తంలో ఓటర్లను తొలగించడాన్ని సుప్రీం ఆపాలని కోరారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. జార్ఖండ్‌లోని గొడ్డా జిల్లాలో బిజెపి ఏజెంట్లు కొంతమంది ఓటర్లను తొలగించాలని కోరుతున్నారని, వీరిలో చాలామంది మైనారిటీ కమ్యూనిటీకి చెందినవారేనని జాతీయ పత్రికలో వచ్చిన ఒక వార్తా కథనాన్ని ప్రస్తావిస్తూ సిబల్ పై వ్యాఖ్యలు చేశారు. అయితే బిజెపి ఏజెంట్లు చేసిన ప్రయత్నాలను అక్కడ బూత్ లెవల్ ఆఫీసర్లు అడ్డుకున్నారని, వారందరూ జెఎంఎం-కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులని ఆ కథనం పేర్కొంది. అనంతరం సిబల్ పత్రికా సమావేశంలో మాట్లాడుతూ, జార్ఖండ్‌లో ఫారమ్ 7 అని పిలిచే ఫారాలను బిజెపి కార్యకర్తలు పెద్ద మొత్తంలో దాఖలు చేస్తున్నారన్నారు. ‘‘మీరు పెద్ద సంఖ్యలో ఫారాలు దాఖలు చేయవచ్చు, ఎన్ని దొరికితే అన్ని అంటే 45 లేదా వంద లేదా 400 ఫారాలైన దాఖలు చేయవచ్చు. ఒక పేరును తొలగించాలని కోరుతూ మీరు వీటిని దాఖలు చేయవచ్చు. అందుకు మీరేమీ కారణం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ అది తప్పని తేలినా, అదేమీ పెద్ద విషయం కాదు’’ అని సిబల్ పేర్కొన్నారు. జాతీయ వార్తాపత్రికలో వచ్చిన వార్తా కథనాన్ని చదివి, దానిపై దర్యాప్తు జరిపితే ముస్లింలకు చెందిన పేర్లనే వారు లక్ష్యంగా చేసుకున్నారని అన్నారు. ఆ బాధితులను ఇంటర్వ్యూ చేస్తే వారంతా కొన్నేళ్ళుగా ఇక్కడే వుంటున్నారు, వారి కుటుంబాలు కూడా అక్కడే వున్నాయి. ఈ రకంగా పరిస్థితులు వుంటే ఇక ఎన్నికలు నిర్వహించి లాభమేంటని ఆయన ప్రశ్నించారు.








కామెంట్‌లు (0)