ఎన్నికల నిర్వహణపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్
న్యూఢిల్లీ: జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు చేపట్టిన నిరాహార దీక్ష 14వ రోజుకు చేరింది. విద్యార్థి సంఘం ఎన్నికలను వెంటనే నిర్వహించాలని, సెక్యూరిటీ చీఫ్‌ను విధుల నుంచి తొలగించాలని, ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై తీసుకున్న చర్యలను ఉపసంహరించుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. కొంతకాలంగా జరగని విద్యార్థి సంఘం ఎన్నికల నిర్వహణే తమ ప్రధాన డిమాండ్ అని విద్యార్థులు తెలిపారు. యూనివర్సిటీలోని కొందరు ఉన్నతస్థాయి సిబ్బంది తమతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థి నేత ఫైజాన్ విమర్శించారు. సెక్యూరిటీ చీఫ్ విద్యార్థులపై అసభ్య పదజాలం ఉపయోగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే విధుల నుంచి తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. శనివారం విద్యార్థులకు, యూనివర్సిటీ నిర్వాహకులకు మధ్య ఘర్షణ తలెత్తింది. క్యాంపస్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో తరగతులను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని పాలకవర్గం ఆదేశించింది. లైబ్రరీని కూడా మూసివేసింది. విద్యార్థుల డిమాండ్‌లను పరిశీలించేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నామని యూనివర్శిటీ యాజమాన్యం తెలిపింది. అయితే, యాజమాన్యం స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకూ ఆందోళన విరమించే ప్రసక్తి లేదని విద్యార్థులు స్పష్టం చేశారు.








కామెంట్‌లు (0)