- ఇండియా బ్లాక్ నేతలను కోరిన నేషనల్ కాన్ఫరెన్స్
శ్రీనగర్/న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా ఉద్యమానికి మద్దతివ్వాలని ఇండియా బ్లాక్ నేతలను నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి) కోరింది. రాష్ట్ర హోదాకై నేషనల్ కాన్ఫరెన్స్ నేతృత్వంలో ఈ నెల 20 వ తేదీన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా జంతర్‌మంతర్ వద్ద నిరసన కార్యక్రమాన్ని తలపెట్టింది. ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొని సంఘీభావం తెలపాలని వారిని ఎన్‌సి కోరింది. కాశ్మీర్ నాయకుడు ఫరూఖ్ అబ్దుల్లా కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఎంఎ బేబీ, ఎంకె స్టాలిన్, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, లాలూ ప్రసాద్, శరద్ పవార్ వంటి ప్రముఖ నాయకులకు మద్దతు కోరుతూ లేఖలు రాశారు. పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ, జమ్మూ కాశ్మీర్ బిజెపి అధ్యక్షుడు సత్ శర్మ, ఇతర ప్రాంతీయ పార్టీల మద్దతును కూడా ఎన్‌సి కోరింది. బిజెపి అధ్యక్షుడు సునీల్ శర్మ ఆదే రోజున ఎన్‌సి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగాల సమస్యపై జమ్మూ కాశ్మీర్ అంతటా ఆందోళనను నిర్వహిస్తామంటూ ప్రకటించారు. “ ఎన్‌సి ప్రభుత్వం రాష్ట్ర హోదా సమస్యపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. అధికార పార్టీ ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రయత్నిస్తోంది,” అని శర్మ పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా జమ్మూ కాశ్మీర్ ప్రజల కోసం ఐక్యమవ్వాలని ఎన్‌సి శాసన సభ్యుడు తన్వీర్ సాదిక్ కోరారు.








కామెంట్‌లు (0)