మంగళవారం, 27 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎమ్మెల్యేల రాజీనామా, ఉప ఎన్నికల్లో పోటీపై కేంద్రం, ఇసిఐకి సుప్రీం నోటీసులు

22 గంటల క్రితం

sc
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026, 04:30 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, రాజకీయ పార్టీలు మారి, ప్రజాధనానికి నష్టం కలిగించేలా ఉప ఎన్నికల్లో పోటీ చేయడం వంటివి చేయరాదంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం, భారత ఎన్నిక సంఘం(ఇసిఐ)కి నోటీసులిచ్చింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం కేంద్రానికి నోటీసులిచ్చింది. ఇసిఐ, తమిళనాడు ప్రధాన ఎన్నికల అధికారి, రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి, ఆరుగురు మాజీ అన్నాడిఎంకె ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చింది. ఎస్‌. జయకుమార్, మరకథం కుమారవేల్, పి. సత్యభామ, ఇ. సుబ్బయ్య, ఎం.ఆర్. విజయభాస్కర్, సి. విజయభాస్కర్‌లకు ధర్మాసనం నోటీసులిచ్చింది. ఎమ్మెల్యేల తరపున న్యాయవాది రామ్ శంకర్ 'కేవియట్' దాఖలు చేశారు. న్యాయవాది కె. సుతన్‌ తరపున న్యాయవాది మెర్లిన్‌ రాచెల్‌ జె. ఈపిటిషన్‌ దాఖలు చేశారు.

ఎస్‌.జయకుమార్‌ సహా పలువురు అన్నాడిఎంకె ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, పాలక టివికెలో చేరడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది కె.సుతన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సెప్టెంబర్‌ 24న మద్రాస్‌ హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఎమ్మెల్యే సీటు గెలుచుకున్న వ్యక్తికి కాదని, ఆయనను గెలిపించిన ప్రజలదని పిటిషన్‌లో సుతన్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ పాలనలో పౌరుడికి ఉన్న ఏకైక హక్కు ఓటు అని, ఇది ఐదేళ్ల కాలానికి అతనికి అధికారం కల్పిస్తుందని తెలిపారు. ఒక ప్రజా ప్రతినిధి ఎటువంటి బలమైన కారణం లేకుండా, కేవలం పార్టీ మారడం కోసం కొన్ని వారాల వ్యవధిలోనే ఆ ఓటును వదిలేస్తే, అతను కేవలం తన పదవిని మాత్రమే వదిలిపెట్టినట్లు కాదని, ప్రజాస్వామ్యానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసినట్లేనని వెల్లడించారు. ఎమ్మెల్యేలు తమ ఇష్టానుసారం ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయడానికి, దీంతో కలిగే నష్టానికి తిరిగి “ప్రజలే మూల్యం చెల్లించుకునేలా” చేయడానికి రాజ్యాంగం అనుమతిస్తుందా అని పిటిషన్‌లో ప్రశ్నించారు.

ప్రజలు వారిని రాజీనామా చేయాలని కోరుకోలేదని, సదరు ఎమ్మెల్యే మరణిస్తే తప్పనిసరి అని పేర్కొన్నారు. వారు రాజీనామా చేయాలని ఏ చట్టమూ ఒత్తిడి తీసుకురాలేదని అన్నారు. ఉప ఎన్నికల ద్వారా ఫిరాయింపును కప్పిపుచ్చడమే దాని ఏకైక ఉద్దేశ్యమని అన్నారు. ఇందుకు అయిన ఖర్చులోని ప్రతి రూపాయి కూడా ప్రజా ధనం నుండి వస్తుందని, పైగా ఓటర్లు ఒకే సీటు కోసం రెండుసార్లు చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. ఇందుకు కారణమైన ఎమ్మెల్యే ఎటువంటి ఖర్చు భరించడని, ఎటువంటి పర్యవసానాలు ఎదుర్కోడని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నష్టం కేవలం ప్రజాధనానికి మాత్రమే పరిమితం కాలేదని, బడ్జెట్ సమావేశాల సమయంలో, తాము ఎన్నుకున్న ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఆరు నియోజకవర్గాల ప్రజల గొంతు నొక్కబడుతుందని వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్