నిరసన శిబిరాన్ని కూల్చివేసిన పోలీసులు
తెల్లవారు జామున సడన్ ఎంట్రీ, విద్యార్ధులపై దాడులు
కోల్‌కతా : కోల్‌కతాలోని సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ (ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ) వద్ద శనివారం తాజాగా ఉద్రిక్తతలు చెలరేగాయి. తెల్లవారు జామున విద్యార్ధులు నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ప్రవేశించిన పోలీసులు అక్కడ నిరసన చేస్తున్న విద్యార్ధులు ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక శిబిరాన్ని కూల్చివేశారు. పోలీసులతో పాటూ బయటి వ్యక్తులు కూడా కేంపస్‌లోకి ప్రవేశించారని, తాత్కాలిక శిబిరాన్ని ధ్వంసం చేశారని, ఆందోళనకారులపై దాడులు చేశారని విద్యార్ధులు తెలిపారు. కాగా విద్యార్ధులు ఏర్పాటు చేసిన ఆ వేదికకు ఎలాంటి అనుమతి లేదని, అనధికార ఏర్పాటని, దానివల్ల భద్రతా ముప్పు వుందని కేంపస్ పాలనా యంత్రాంగం తెలిపింది. 60రోజులకు పైగా తమ ఆందోళన కొనసాగుతోందని తమ నిరసనలకు కేంద్ర స్థానంగా ఈ వేదిక వుందని విద్యార్ధులు చెప్పారు. ముఖాలకు ముసుగులు వేసుకున్న కొందరు వ్యక్తులు పోలీసులతో కలిసి వచ్చి ఈ విధ్వంసంలో చేతులు కలిపారని తెలిపారు. దాన్ని అడ్డుకున్న ఆందోళనకారులపై పోలీసులు చేయి చేసుకున్నారన్నారు. కాగా కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలోనే ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ పాలనా యంత్రాంగం పోలీసుల సాయాన్ని కోరిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ గ్రూపు అయిన అఖిల భారతీయ గ్రాహక్ పంచాయత్ నిర్వహించిన కేంపస్ కార్యక్రమానికి విద్యార్ధులు అభ్యంతరం వ్యక్తం చేయడంతోనే ఘర్షణలు తలెత్తాయి. దాంతో సెప్టెంబరు 27 నుండి విద్యార్ధుల ఆందోళన ఆరంభమైంది. తరగతులు నిలిచిపోయాయి. దీంతో డిసెంబరు వరకు తరగతులను రద్దు చేసినందున ఇళ్ళకు వెళ్ళిపోవాల్సిందిగా అడ్మినిస్ట్రేషన్ అధికారులు విద్యార్ధులను కోరారు.








కామెంట్‌లు (0)