సిపిఎం పొలిట్‌బ్యూరో
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి)ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలు భారత ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయమైన నిర్వాచన్ సదన్ గేటు వరకు చేరుకునేందుకు ప్రయత్నించిన వామపక్ష కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సిపిఎం పొలిట్‌బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది.
శాంతియుత నిరసనపై బలప్రయోగం..
ప్రదర్శనను అడ్డుకుని ఢిల్లీ పోలీసులు వారిని ఈడ్చుకెళ్లి క్రూరంగా బలప్రయోగం చేశారని సిపిఎం పేర్కొంది. మహిళా నిరసనకారులను పురుష పోలీసు అధికారులు అసభ్యంగా తాకుతూ, ఈడ్చుకెళ్లారని తెలిపింది. నిరసనకారులపై జరిగిన ఈ దౌర్జన్యాన్ని సిపిఎం ఖండించింది. తమ డిమాండ్లన్నీ నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని ప్రకటించింది. ఈ నిరసన వామపక్ష పార్టీలు ఇచ్చిన వారం రోజుల దేశవ్యాప్త పిలుపులో భాగమని పొలిట్‌బ్యూరో తెలిపింది. అలాగే, సిఇసిని పదవి నుంచి తొలగించాలని, ఎస్ఐఆర్ (ప్రత్యేక సమగ్ర సవరణ) ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని, ఎస్ఐఆర్ ప్రక్రియలో అన్యాయంగా తొలగించిన అర్హులైన ఓటర్లందరినీ తిరిగి జాబితాలో చేర్చాలని, సిఇసి, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకంపై 2023లో తెచ్చిన చట్టాన్ని రద్దు చేయాలని, ఎన్నికల కమిషనర్ల నియామకంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి.
ఈ నిరసనకు సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ, సీనియర్ నేతలు బృందా కరత్, సుభాషిణి అలీ, పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, ఆర్. అరుణ్‌కుమార్, ఎంపిలు వి. శివదాసన్, ఎ.ఎ. రహీం నాయకత్వం వహించారు. వీరితో పాటు సిపిఐ ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి దినేశ్ వార్షిణి, సిపిఐ(ఎంఎల్) కేంద్ర కమిటీ సభ్యురాలు సుచేత దే, ఆర్ఎస్‌పి జాతీయ సెక్రటేరియట్ సభ్యుడు రాజీవ్ డిమ్రి, ఫార్వర్డ్ బ్లాక్ ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి ధర్మేంద్ర వర్మ, సిజిపిఐ నేత బిర్జు నాయక్ ఈ ఆందోళనలో పాల్గొన్నారని సిపిఎం పొలిట్‌బ్యూరో తెలిపింది.








కామెంట్‌లు (0)