శుక్రవారం, 10 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionముదురుతున్న 'అయోధ్య' కుంభకోణం

26 జూన్, 2026

rammandir
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 27, 2026, 12:41 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌‌రాయ్‌ రాజీనామా

- ఏడుగురు నిందితుల అరెస్టు

- సిట్‌‌పై అర్చకుల అసంతృప్తి

లక్నో : అయోధ్య బాలరాముడి ఆలయ విరాళాల కుంభకోణం బిజెపి పెద్దలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఈ కుంభకోణంలో కీలక వ్యక్తి, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​ ప్రధానకార్యదర్శి చంపత్ రాయ్ శుక్రవారం నాడు రాజీనామా చేశారు. ఇప్పటికే ఈ కేసులో చంపత్‌ రాయ్‌ డ్రైవర్‌ టిన్ను యాదవ్‌ అరెస్టయయ్యారు. దీంతో నైతిక బాధ్యత వహిస్తూ ట్రస్టు పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆయనతో పాటు ట్రస్టు సభ్యుడు అనిల్‌ మిశ్రా కూడా రాజీనామా చేశారు. మరోవైపు ఈ కుంభకోణానికి సంబంధించి ఎఫ్‌ఐఆర్‌‌లో పేర్కొన్న ఎనిమిది మంది నిందితులనూ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో నగదు లెక్కింపు సిబ్బంది, నగదు లెక్కింపు విభాగాధిపతి, ఆ ప్రక్రియను పర్యవేక్షించిన ఓ విశ్రాంత బ్యాంకర్‌, చంపత్ రాయ్ డ్రైవర్, ఆయన సన్నిహితుడు రమాశంకర్ యాదవ్ ఉన్నారు. "అవినాశ్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవ్‌కుశ్ మిశ్రా, మనీశ్ కుమార్ యాదవ్, కరుణేశ్ పాండే, రామశంకర్ మిశ్రా, సుభాశ్ శ్రీవాస్తవ, రామశంకర్ యాదవ్‌లపై ఎఫ్‌ఐఆర్‌లో నమోదైంది. వీరంతా ఆలయానికి వచ్చిన విరాళాలు, విలువైన వస్తువులను లెక్కించే ప్రక్రియలో పాలుపంచుకున్నారు. గురువారం రాత్రి ఈ ఎనిమిది మందిని అరెస్టు చేశాం. తదుపరి విచారణ కొనసాగుతోంది. నిందితులందర్నీ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం" అని పోలీస్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. భక్తులు సమర్పించిన నగదు కానుకలను ఆలయం బ్యాంకు ఖాతాల్లో జమ చేయడానికి ముందే పక్కదారి పట్టించారన్నది ప్రధాన అభియోగం. ​ మరోవైపు, రామాలయ విరాళాల కుంభకోణంపై సిట్ దర్యాప్తు అంత సంతృప్తిగా లేదని అయోధ్య ఆలయ పూజారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది మంది నమ్మకాన్ని వమ్ము చేసిన వారికి కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారాన్ని త్వరగా, పారదర్శకంగా ముగించాలని కోరుతున్నారు. సిట్ దర్యాప్తు తీరుపై ఆధ్యాత్మిక ప్రవచనకర్త కర్పత్రి మహారాజ్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు, అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు కావడానికి తామే కారణ మని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు అజయ్ రాయ్ పేర్కొన్నారు. తమ పార్టీ ఒత్తిడి వల్లే ఈ చట్టపరమైన చర్య ప్రారంభమైందని అన్నారు. అయోధ్య రామ మందిర నిధుల దుర్వినియోగానికి సంబంధించి రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా, ఇతర సభ్యులు గోపాల్ రావు, చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలపై చట్టపరమైన చర్యలు తీసు కోవాలని తాను డిమాండ్ చేశానని గుర్తు చేశారు.


బిజెపిది నకిలీ హిందుత్వ : అవిముక్తేశ్వరానంద

అయోధ్య విరాళాల కుంభకోణం నేపథ్యంలో యుపి ప్రభుత్వంపైనా, బిజెపిపైనా జ్యోతిర్మఠం పీఠాధిపతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి లో ఉన్నవాళ్లు నకిలీ హిందువులని, వారిది నకిలీ హిందుత్వ అని ఆయన విరుచుకుపడ్డారు. వేదాలను, శాస్త్రాలను వాళ్లు నమ్మరని పేర్కొన్నారు. ఈ కుంభకోణంలో అసలు దొంగలను వదిలేశారని, సిట్‌ అందుకే ఏర్పాటు చేశారని ఆయన అన్నారు. ‘ఈ కేసులో అసలు సూత్రధారులను వదిలేశారు. కింది స్థాయి ఉద్యోగుల పేర్లను మాత్రమే ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. రామ మందిరం విషయంలో మొదటి నుంచి ఏకపక్ష నిర్ణయాలే తీసుకుంటున్నారు. వేదాలు లేదా మత పెద్దల సలహాలు పాటించలేదు.. రాజకీయ నాయకులు ఎంపిక చేసిన వ్యక్తులతో ట్రస్ట్ నడుస్తోంది. సాధువులు, జ్ఞానులు, పండితులను దూరంగా పెట్టారు’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్