శనివారం, 17 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

IIT: ఐఐటిలకు పరీక్ష!

1 గంట క్రితం

iit
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026, 01:45 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

• ప్రభుత్వ నిధుల కోతే లక్ష్యం!

• అధికారాల బదలాయింపు పేరుతో అసలుకు ఎసరు

• ప్రైవేటుకు పెద్దపీట

• ప్రజల ప్రయోజనాలకు చెల్లుచీటి

సాధారణంగా విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి. కానీ, ఈసారి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటిలకు పరీక్ష తప్పడం లేదు. అది కూడా మామూలు పరీక్ష కాదు. దేశంలో ఐఐటిల భవిష్యత్తును తేల్చివేసే పెను పరీక్ష! ఈ పరీక్షలో ఫెయిలైతే సంస్థ ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. పాసైతే ప్రభుత్వ నిధులు ఆగిపోతాయి! అంతిమంగా తుది ఫలితం మాత్రం ఒక్కటే! అర్థం కాలేదా? కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల సారాంశం ఇదే!

కేంద్ర విద్యాశాఖ 2026 సెప్టెంబర్ 17న ఐఐటీలకు ఆర్థిక పటిష్ట పరీక్ష (ఫైనాన్సియల్ రొబుస్ట్‌‌నెస్‌ ‌టెస్ట్‌-‌ఎఫ్‌ఆర్‌‌టి) పేరిట మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే సంస్థల బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌కు కొన్ని ప్రత్యేక అధికారాలు లభిస్తాయి. బోధన, బోధనేతర రంగాల్లో కొన్ని ఉద్యోగాలను ప్రభుత్వ అనుమతి లేకుండా ఆ సంస్థలే నియమించుకునే అధికారం లభిస్తుంది. అవసరమైతే కొత్త ఉద్యోగాలను సృష్టించుకోవడానికి, వాటిని కొనసాగించుకోవడానికి, అవసరమైన మార్పులు చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. నిర్ధేశించిన ప్రమాణాలు అందుకోలేక, పరీక్షలో విఫలమయ్యే సంస్థలు ఎప్పటిమాదిరే కేంద్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యాల కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. అది ఎలాగూ లభించదు కాబట్టి అవసరమైన సిబ్బంది నియమాకం సకాలంలో జరగక వాటి ఉనికి ప్రశ్నార్ధకంగా మారుతుంది. అయితే, ఉత్తీర్ణత సాధించిన సంస్థల పరిస్థితి కూడా దాదాపుగా అదే మాదిరి ఉంటుంది.

పరీక్షలో పాస్‌ కావడమంటే...?

కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ ఎఫ్‌ఆర్‌‌టిలో ఉత్తీర్ణత సాధించడమంటే ప్రత్యేక అధికారాలు పొందడం అని చెబుతున్నప్పటికీ వాస్తవం భిన్నం! నిజానికి అర్హత సాధించిన సంస్థలకు ప్రభుత్వ నిధులు రావడం తగ్గిపోతాయి. నిధుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించి అమలు చేయాల్సి వస్తుంది. ఆ ప్రత్యామ్నాయ మార్గాలేమిటో ఉత్తర్వులలో ప్రభుత్వం స్పష్టం చేయలేదు. కానీ, ‘సొంత ఆదాయ వనరులను పెంచుకోవాలి’ అని మాత్రం సూచించింది. దీని అర్ధం విద్యార్థుల మీద మరింత భారం వేయడం కావచ్చు , లేదా పరిశోధనలు, ప్రాజెక్టు లు, పత్రాలు అంటూ ప్రైవేటు రంగంపై మరింతగా ఆధారపడటం కావచ్చు! నిజానికి అలా ప్రైవేటు ఆదాయాన్ని పెంచుకునే సంస్థలే ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తాయి. ప్రభుత్వ గ్రాంట్లతో పోలిస్తే ప్రభుత్వేతర మార్గాల ద్వారా సంస్థలు ఎంత ఎక్కువ మొత్తంలో నిధులు సమకూర్చు కుంటున్నాయన్నది ఈ పరీక్షలో కీలక ప్రమాణం. అర్హత సాధించిన సంస్థలకు ప్రత్యేక అధికారాలు లభిస్తాయని ఉత్తర్వులలో పేర్కొన్నారు. అర్హత సాధించని సంస్థలు ఆ అధికారాలను వినియోగించలేవు. అర్హత సాధిస్తే ‘ప్రైవేటు సంస్థల నుండి నిధులు వస్తున్నాయి కదా...’ అంటూ ప్రభుత్వ నిధులను నిలిపివేసే ప్రమాదం ఉంది!

మూడు విభాగాలు... మూడు అర్హతలు

ఈ ఎఫ్‌ఆర్‌‌టి కోసం కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఐఐటిలను ఎ, బి, సి విభాగాలుగా విభజించింది. అలాగే ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి ఒక్కో విభాగానికి ఒక్కో అర్హతను నిర్దారించింది. 25 సంవత్సరాలకు పైగా ఉన్న ఐఐటిలను ఏ కేటగిరిలో చేర్చింది. ఈ విభాగంలో ఉన్న విద్యాసంస్థలు ఎఫ్‌ఆర్‌‌టిలో ఉత్తీర్ణత సాధించాంటే మొత్తం ప్రభుత్వ గ్రాంట్లలో కనీసం 95 శాతానికి సమానంగా ప్రభుత్వేతర నిధులను సమకూర్చుకోవాల్సి ఉంటుంది! ఆ స్థాయిలో నిధులు సాధించడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బి, సి విభాగాల్లో ఉన్న సంస్థలకు కూడా ఇలాగే ప్రత్యేక అర్హతలు నిర్ధారించింది. ఈ అర్హత ప్రమాణాలను సాధించారా లేదా అన్నది వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాల కాగ్‌ ఆడిట్ చేసిన ఖాతాల ఆధారంగా నిర్ణయిస్తారు.

ఫీజులు, పరిశోధన నిధులు, విరాళాలపైనే దృష్టి

ప్రభుత్వేతర నిధుల పరిధిలో విద్యార్థుల ఫీజులు, నిరంతర విద్యా కార్యక్రమాలు, ఆన్‌లైన్ కోర్సుల ద్వారా వచ్చే ఆదాయం, పరిశోధన ప్రాజెక్టుల నిధులు, పరిశ్రమలకు సాంకేతిక సలహాలు అందించడం ద్వారా వచ్చే ఆదాయం ఉన్నాయి. పూర్వ విద్యార్థుల విరాళాలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు కూడా ఇందులోకి వస్తాయి. సంస్థల ఆధ్వర్యంలో పనిచేసే ట్రస్టులు, సెక్షన్–8 కంపెనీలు, సొసైటీల ద్వారా సమకూరే నిధులను సైతం నిబంధనల ప్రకారం పరిగణనలోకి తీసుకుంటారు. ఈ నిధులను సమకూర్చుకుంటేనే ‘ప్రత్యేక అధికారాలు’ లభిస్తాయి కాబట్టి ఐఐటిలు వాటికోసం ప్రైవేటు రంగంపై మరింతగా ఆధారపడాల్సి వస్తుంది. ఫీజులు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పరిశ్రమలతో పరిశోధనా భాగస్వామ్యాలు, కన్సల్టెన్సీ సేవలు కీలకం అవుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రజల ప్రయోజనాలు తుంగలోకి...!

ఐఐటిలలో ప్రస్తుతం ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా పరిశోధనలు సాగుతున్నాయి. ప్రభుత్వం నుండి నిధులు అందుతుండటమే దీనికి కారణం. ప్రభుత్వ నిధులు ఆగిపోయి, ప్రైవేటు రంగంపై ఆధారపడటం పెరిగితే దాని ప్రభావం పరిశోధనలపై కూడా పడుతుంది. నిధులు అందించే కార్పొరేట్‌ ‌సంస్థల ప్రయోజనాలు, వాటి లాభాల కోసం ఐఐటిలు పరిశోధనలు చేయాల్సి వస్తుంది. దానికి భిన్నంగా చేస్తే నిధులు ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే అనేక దేశాల్లో కార్పొరేట్‌ ‌రంగం పరిశోధనలను శాసిస్తోంది. మన దేశంలోనూ అదే పరిస్థితి రానుంది.

​లభించే అధికారాలివి...!

ఎఫ్‌ఆర్‌‌టిలో అర్హత సాధిస్తే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసుకోవడం, కొత్త పోస్టులను సృష్టించుకోవడం, నియామకాలు వంటివి ఐఐటిలే చేసుకోవచ్చు, అయితే, దీనిని పే లెవల్‌ - 14కు దిగువకే ప్రభుత్వం పరిమితం చేసింది. అంటే, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌ ‌వరకు నియమించుకునే అధికారాలు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. వీటికి కేంద్ర ప్రభుత్వ వ్యయ విభాగం అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అదే సమయంలో అధ్యాపకులు – విద్యార్థుల నిష్పత్తి 1:10గా, అధ్యాపకులు – బోధనేతర సిబ్బంది నిష్పత్తి 1:1.1గా ఉండాలని షరతులను కేంద్రం పెట్టింది. కాగితాలపై ఎలా ఉన్నప్పటికీ, ఆచరణలో కాంట్రాక్టు నియామకాలు పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉందని, ఉద్యోగ భద్రత గాలిలో దీపంగా మారుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

వైద్య కళాశాలల తరహాలో మారనున్నాయా?

వైద్య విద్యారంగంలో ప్రభుత్వ నిధులు, ఫీజులు, ప్రైవేటు పెట్టుబడులు, విద్యార్థులపై పడే ఆర్థిక భారం గురించి చాలాకాలంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఐఐటిలోనూ అదే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రైవేటు నిధులు సాధించడంలో విఫలమైతే ప్రభుత్వ ఐఐటిలు నామమాత్రంగా మారే ప్రమాదం ఉంది. అదే జరిగితే ప్రైవేటు రంగంలో భారీ పెట్టుబడులుతో వచ్చే విద్యాసంస్థల ఆడిందే ఆటై, విద్యార్థులకు, వారి తల్లితండ్రులకు పెనుభారంగా మారుతుంది.

​ప్రతి ఏటా పరీక్షే!

ఈ పరీక్షను ప్రతి సంవత్సరం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2026–27 అంచనా సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక, సంస్థాగత వివరాలను 2026 అక్టోబర్ 30లోపు సమర్పించాలని, నవంబర్ 30లోపు అంచనాను పూర్తి చేయాలని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. అర్హత సాధించిన సంస్థలు తదుపరి సంవత్సరాల్లోనూ నిర్దేశించిన ప్రమాణాలను కొనసాగించాల్సి ఉంటుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్