- మతతత్వ శక్తుల పన్నాగాలను ఓడించాలి
- ఎం.ఎ. బేబీ
చెన్నై: తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించే అంశంలో సుప్రీంకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వు సమాఖ్య సూత్రాలకు పూర్తిగా విరుద్ధమని సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ అన్నారు. ఈ ఉత్తర్వు తమిళనాడులోని సామాజిక సామరస్య పునాదులను దెబ్బతీస్తుందని ఆయన శనివారం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పేర్కొన్నారు. తమిళనాడు మత ఛాందసవాదానికి, విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా నిలిచిందన్నారు. ఇటువంటి ఆదర్శవంతమైన సంప్రదాయాన్ని దెబ్బతీసేందుకు సంఘ్ పరివార్ శక్తులకు ఈ ఉత్తర్వు బలం చేకూరుస్తోందని, ఇది దురదృష్టకరమన్నారు. సికందర్ దర్గా సమీపంలోని మరో ప్రదేశంలో దీపం వెలిగించడానికి అనుమతిస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తన మునుపటి మధ్యంతర ఉత్తర్వులో స్టే విధించిందని బేబీ గుర్తుచేశారు. అయినా ఈ ఏడాదికి ఒక్కసారికి మాత్రమే పరిమితమైనదాన్ని మరలా అనుమతించడం విచిత్రంగా ఉందన్నారు.
తమిళనాడు ప్రభుత్వం వెంటనే రివ్యూ పిటిషన్ దాఖలు చేసి, దీపాన్ని సంప్రదాయ ప్రదేశంలోనే వెలిగించిందని తెలిపారు. అయితే, మతసామరస్యాన్ని కాపాడుకోవడం కోసం, వివిధ కారణాల వల్ల కోర్టు ఉత్తర్వును అమలు చేయలేకపోయామని జిల్లా కలెక్టర్ ధర్మాసనానికి విన్నవించారని పేర్కొన్నారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఈ అంశాన్ని ధిక్కరణ కేసుగా స్వీకరించి, రాజ్యాంగానికి విరుద్ధమైన ప్రమాదకర ఉత్తర్వు ఇచ్చిందని బేబీ అన్నారు. అయితే, ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనలు) చట్టం, 1991ను సుప్రీం పరిగణనలోకి తీసుకోకపోవడం షాక్‌కు గురిచేసిందన్నారు. ఈనెల 20 నాటి మధ్యంతర ఉత్తర్వుపై దాఖలైన రివ్యూ పిటిషన్‌ను విచారణకు స్వీకరించపోవడం సరికాదన్నారు. కేసులోని కీలక అంశంపై, సరిదిద్దలేని నష్టం కలిగించే రీతిలో ఉత్తర్వులు ఇచ్చారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఉత్తర్వు న్యాయశాస్త్ర సూత్రాలనే ప్రశ్నార్థకం చేస్తోందన్నారు.
మురుగన్ ఆలయ ధర్మకర్తల మండలిని సుప్రీంకోర్టు రద్దు చేసి, విశ్రాంత న్యాయమూర్తులతో కమిటీ వేసిందని, కొండపై నియంత్రణను కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు అప్పగించిందని బేబీ పేర్కొన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను పూర్తిగా లాగేసుకుని, ప్రేక్షకపాత్రకు పరిమితం చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను హరించడం తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని తెలిపారు. దర్గాకు 50 మీటర్ల దూరంలో కొండపై ఎవరైనా దీపాలు వెలిగించవచ్చని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇది ప్రజల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టడంలో నిమగ్నమైన మతతత్వ సంస్థలు తమకు అనుకూలంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. మత సామరస్య విలువలను కాపాడటానికి విజయ్ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుందని, అది అభినందనీయమని బేబీ అన్నారు. మతతత్వ శక్తుల పన్నాగాలను ఓడించడానికి అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావడం అవసరమని బేబీ పిలుపునిచ్చారు. సంకుచిత రాజకీయ లాభాల కోసం మత విశ్వాసాన్ని వాడుకునే ప్రయత్నాలను తిరస్కరించాలని, మత భేదాలకు అతీతమైన సమిష్టి స్ఫూర్తిని చాటాలని తమిళనాడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.








కామెంట్లు (0)