- అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం
లక్నో : ఉత్తరప్రదేశ్ పోలీసులు పౌరుల ప్రాథమిక హక్కులు, పౌర స్వేచ్ఛల పట్ల ఏమాత్రం గౌరవం చూపడం లేదని అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీస్ స్టేషన్ సిసిటివి దృశ్యాలు సమర్పించాలని ఆదేశిస్తే సాకులు చెబుతున్నారంటూ, ఇటువంటి పరిస్థితి సిగ్గుచేటు అని తీవ్రంగా వ్యాఖ్యానించింది. బిజ్నోర్ జిల్లాలో ఓ వ్యక్తిని అక్రమంగా పోలీసు కస్టడీలో ఉంచారని దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ అతుల్ శ్రీధరన్, జస్టిస్ అచల్ సచ్‌దేవ్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. ‘ఉత్తరప్రదేశ్‌లో పౌర స్వేచ్ఛకు సంబంధించిన పరిస్థితి సిగ్గుచేటని చెప్పక తప్పదు. పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడం యుపి పోలీసులకు రొటీన్‌గా మారినట్లు కనిపిస్తోంది’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అత్యాచార బాధితురాలైన ఓ యువతి ఈ పిటిషన్ దాఖలు చేశారు. బిజ్నోర్ పోలీసులు తన తండ్రిని రెండు రోజుల పాటు అక్రమంగా నిర్బంధించి, మూడో రోజున దోపిడీ (ఎక్స్టార్షన్) కేసులో అరెస్టు చూపారని ఆమె తెలిపారు. గత నెల 5న ఓ కేసు విషయమై నాగల్ పోలీస్ స్టేషన్‌కు రావాలని తన తండ్రికి పిలుపు వచ్చిందని, అక్కడికి చేరుకుని కారులో కూర్చొని ఉండగా సివిల్ దుస్తుల్లోని పోలీసులు ఆయన్ను బయటకు లాగి వాహనంలో తీసుకెళ్లారని పిటిషనర్ తెలిపారు. తండ్రితో వచ్చిన బంధువు మొబైల్లో ఈ ఘటనను చిత్రీకరించే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారని పేర్కొన్నారు. అనంతరం ఆ బంధువు పోలీసు హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకోలేదన్నారు. రెండు రోజుల తర్వాత, అంటే సెప్టెంబర్ 7న ఆయన అరెస్టును పోలీస్ స్టేషన్ చూపిందని తెలిపారు. అయితే, నిజానిజాలు తేల్చేందుకు, సెప్టెంబర్ 5 మధ్యాహ్నం నుంచి సెప్టెంబర్ 7 ఉదయం వరకు పోలీస్ స్టేషన్‌లోని సిసిటివి కెమెరాల దృశ్యాలను సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. అయితే, ఆరోజు ఉరుములతో కూడిన వర్షం కారణంగా సిసిటివి పని చేయలేదంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు. దీనిపై ధర్మాసనం, "కోర్టు సిసిటివి ఫుటేజ్‌ను కోరిన ప్రతి కేసులోనూ, చాలావరకు ఒకే నివేదిక వస్తోంది. ఏదో ఒక కారణంతో దృశ్యాలు అందుబాటులో లేవని చెబుతున్నారు. అక్రమ నిర్బంధం కేసులో సిసిటివి పనిచేయలేదన్న సాకు పోలీసులకు వర్తించదు. ఈ వాదనే, నిర్బంధంలో ఉన్న వ్యక్తిని అక్రమంగా ఉంచారని, నిజాన్ని మరుగున పెట్టేందుకు దురుద్దేశంతో దృశ్యాలను ఉద్దేశపూర్వకంగా ఇవ్వడం లేదని నిర్ధారించేందుకు కోర్టుకు సరిపోతుంది’’ అని వ్యాఖ్యానించింది. పిటిషనర్ తండ్రి అరెస్టు అక్రమ నిర్బంధం ఆధారంగా జరిగినందున, వేరే ఏ కేసులోనూ అవసరం లేకపోతే ఆయన్ను వెంటనే విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. పిటిషనర్లు కోరిన మేరకు ఖర్చుల కింద రూ.20 వేలు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏడు రోజుల్లో చెల్లించకపోతే పిటిషన్‌ను తిరిగి కొనసాగించే స్వేచ్ఛ పిటిషనర్లకు ఉందని స్పష్టం చేసింది.








కామెంట్లు (0)