- ఎన్నికల సంఘంపై జోక్యం చేసుకోండి
- రాష్ట్రపతికి జాన్ బ్రిటాస్ లేఖ
న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం (ఇసిఐ), ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియకు సంబంధించి తలెత్తుతున్న ఆందోళనకరమైన పరిణామాలపై తక్షణ రాజ్యాంగబద్ధ జోక్యం కోరుతూ రాజ్యసభ ఎంపి, సిపిఎం నేత జాన్ బ్రిటాస్ రాష్ట్రపతికి లేఖ రాశారు. ఈ విషయాన్ని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. గత పది నెలల కాలంలో ముగ్గురు ఎన్నికల కమిషనర్లలో ఇద్దరు కమిషనర్లు, తమ ఆమోదం లేకుండా తీసుకున్న నిర్ణయాలపై కనీసం 14 సార్లు అభ్యంతరాలు నమోదు చేసినట్టు జాన్ బ్రిటాస్ తన లేఖలో పేర్కొన్నారు.
13 కోట్ల పేర్లు తొలగింపు, 33 లక్షల మందికి నోటీసులు
దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పటివరకు 13 కోట్లకు పైగా పేర్లను ముసాయిదా ఓటర్ల జాబితాల నుంచి తొలగించినట్టు నివేదికలు చెబుతున్నాయని జాన్ బ్రిటాస్ తెలిపారు. ఢిల్లీలో 33 లక్షలకు పైగా ఓటర్లకు నోటీసులు జారీ చేసినట్టు కూడా ఆయన లేఖలో ప్రస్తావించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) తొలగింపునకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ప్రక్రియ ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగాలని జాన్ బ్రిటాస్ తన లేఖలో కోరారు. అలాగే, ఎస్‌ఐఆర్ ప్రక్రియ చట్టవిరుద్ధంగా జరిగినట్టు తేలిన ప్రతిచోటా దానిని రద్దు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.








కామెంట్‌లు (0)