- కేంద్ర భద్రతా బలగాలు, ఢిల్లీ పోలీసుల ఆంక్షలను అధిగమించి విద్యార్థి, యువజన సంఘాల తిరంగా మార్చ్
రజాశక్తి - న్యూఢిల్లీ బ్యూరో : కేంద్రంలోని మోడీ సర్కార్ విధించిన ఆంక్షలను తొక్కుకుంటూ గురువారం లెహ్రా దో తిరంగా మార్చ్ నిర్వహించారు. శుక్రవారం ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్, ఎఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ మార్చ్ జరిగింది. ఫిరోజ్‌షా రోడ్డున నుంచి ప్రారంభమైన ఈ మార్చ్‌లో విద్యార్థులు, యువత జాతీయ జెండాలు చేబూని నినాదాల హోరెత్తించారు. భారీ జాతీయ జెండాను ప్రదర్శిస్తూ మార్చ్ ముందుకు సాగింది. భారీగా పోలీసు బలగాలను మోహరించి, భయాందోళనకరమైన వాతావరణాన్ని మోడీ ప్రభుత్వం సృష్టించింది. 'తిరంగా ర్యాలీ' కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్కుకు చేరుకోకుండా అడ్డుకోవడానికి అధికార యంత్రాంగం అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. చివరికి సెంట్రల్ పార్కును కూడా బిజెపి ప్రభుత్వం మూసివేసింది. వీటన్నింటినీ అధిగమించి, మార్చ్ కన్నాట్ ప్లేస్ ఇన్నర్ సర్కిల్ వద్దకు శాంతియుతంగా చేరకుంది. అక్కడ జాతీయ జెండాను ఎగురవేసి, జాతీయ గీతం ఆలపించడతో మార్చ్ ముగిసింది. ‘‘మేము అనుకున్నది సాధించాము. వేలాది మంది పోలీసు సిబ్బంది ఉన్నప్పటికీ, వారు మమ్మల్ని కన్నాట్ ప్లేస్‌లోకి ప్రవేశించకుండా అడ్డుకోలేకపోయారు’ అని ఎస్ఎఫ్ఐ పేర్కొంది. ఈ కార్యక్రమంలో సిపిఎం ఎంపిలు జాన్ బ్రిట్టాస్, వి.శివదాసన్, ఎఎ రహీం, సిపిఐ ఎంపి సంతోష్ కుమార్, ఎస్ఎఫ్ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆదర్శ్ ఎం.సాజి, సృజన్ భట్టాచార్య, ఎస్ఎఫ్ఐ సహాయ కార్యదర్శి ఐషీఘోష్, డివైఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి హిమాఘ్నరాజ్ భట్టాచార్య, కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు జైక్ సి.థామస్, ఎఐవైఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రౌషన్ కుమార్ సిన్హా, సుఖ్జిందర్ మహేశ్వరి, ఎఐఎస్ఎఫ్ అధ్యక్షుడు విరాజ్ దేవాంగ్ తదితరులు పాల్గొన్నారు. ‘‘సెంట్రల్ పార్క్‌లో నిషేధాజ్ఞలను ధిక్కరిస్తూ, వామపక్ష సంఘాలుకు చెందిన వందలాది మంది విద్యార్థులు, యువ కార్యకర్తలు సెంట్రల్ పార్క్‌ను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఇది మాది- ఎవరి ప్రైవేట్ ఆస్తి కాదు. మేము జాతీయ గీతం ఆలపించి, జాతీయ జెండాను సగర్వంగా ఎగురవేశాము. ఏది ఏమైనప్పటికీ, మేము మళ్ళీ ఇక్కడికి వస్తాము’’ అని జాన్ బ్రిట్టాస్ అన్నారు.
కన్నాట్ ప్లేస్ ఇన్నర్ సర్కిల్లో కెవైఎస్, దిశా, పిఎస్ఎ, కలెక్టివ్ వంటి సంఘాలు కూడా మార్చ్ నిర్వహించాయి. కన్నాట్ ప్లేస్ ప్రాంతంలో 6,000 మంది పోలీసులు, 220 సిఎపిఎఫ్ కంపెనీలు మోహరించారు. సెంట్రల్ పార్క్‌కు వెళ్లే రహదారిని పోలీసు వాహనాలతో మూసివేశారు.
సిజెపి నేత అభిజిత్ దీప్కే నిర్బంధం
శుక్రవారం ఆందోళనలతో ఢిల్లీలో వాతావరణం వేడెక్కింది. కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) జాతీయ కన్వీనర్ అభిజిత్ దీప్కేను ఢిల్లీ పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. 20 మందికిపైగా పోలీసు సిబ్బంది ఎన్‌సిపి అధికార ప్రతినిధి అనీష్ గవాండే నివాసానికి వెళ్లి అక్కడ అభిజీత్ దీప్కేకు లెహ్రా దో తిరంగా మార్చ్‌లో పాల్గొవద్దని నోటీసు ఇచ్చారు. ర్యాలీకి వెళ్తే అరెస్టు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. అనంతరం పోలీసులు అక్కడినుంచి వెళ్లిపోయారు. అయితే, ఆయన ఇంటి సమీపంలో పోలీసులు ఆంక్షలు అమలు చేశారు. సాయంత్రం అనీష్ గవాండే నివాసం నుంచి అభిజిత్ దీప్కే బయటకు రాగానే ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను రహస్య ప్రదేశానికి తీసుకెళ్లారని సిజెపి విమర్శించింది. అతనితో తమకు సంబంధాలు తెగిపోయాయని, న్యాయవాదులతో కూడా మాట్లాడనివ్వడం లేదని పేర్కొంది. అభిజిత్ దీప్కే అరెస్టును పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ తీవ్రంగా ఖండించారు.
రాష్ట్రపతి భవన్ సమీపంలో ఆప్ తిరంగా మార్చ్
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాష్ట్రపతి భవన్ సమీపంలోని నార్త్ అవెన్యూలో తిరంగా మార్చ్ నిర్వహించింది. ఢిల్లీ ఆప్ అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్ నేతృత్వంలో జరిగిన ఈ యాత్రలో పోలీసుల పహారా నడుమ పార్టీ కార్యకర్తలు జాతీయ జెండాను పట్టుకుని ముందుకు సాగారు. పౌరులు జాతీయ జెండాను ఎక్కడ ఎగురవేయాలో ప్రభుత్వం, పోలీసులు నిర్దేశించలేరని భరద్వాజ్ అన్నారు. మరోవైపు ఆప్ సెంట్రల్ ఢిల్లీలోని తమ పార్టీ ప్రధాన కార్యాలయం నుండి కన్నాట్ ప్లేస్‌కు తిరంగా మార్చ్ నిర్వహించారు. వారిని మార్గమధ్యలోనే భద్రతా దళాలు అడ్డుకున్నాయి.
ముంబయిలో ‘‘లెహ్రా దో తిరంగా’’ మార్చ్
ముంబయిలో సిజెపి ఆధ్వర్యంలో ‘‘లెహ్రా దో తిరంగా’’ మార్చ్ జరిగింది. ఆజాద్ మైదాన్‌లో జరిగిన ఈ మార్చ్‌లో సామాజిక కార్యకర్త అంజలి దమానియా మాట్లాడుతూ దేశ రాజధానిలోని నిరసనకారుల పట్ల పోలీసులు క్రూరంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఎంఎన్ఎస్ నేత సందీప్ దేశ్‌పాండే మాట్లాడుతూ ద్రవ్యోల్బణం, పెరుగుతున్న నిరుద్యోగం వంటి తీవ్రమైన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. న్యూఢిల్లీలో మండిహౌస్ నుండి కన్నాట్ ప్లేస్‌కు ఎఐఎస్ఎ మార్చ్ సాగింది. ఎఐఎస్ఎ అఖిల భారత అధ్యక్షురాలు నేహా బోరాతో పాటు ఇతర నిరసన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.







కామెంట్లు (0)