చెన్నై : తమిళనాడులోని తేని జిల్లా జైలు నుండి తప్పించుకున్న వారిలో 15మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. మరో ఇద్దరు ఖైదీలు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని అన్నారు. తేని జిల్లా అండిపట్టి సమీపంలోని తెక్కంపట్టి సబ్ జైలు నుండి సోమవారం రాత్రి 17మంది ఖైదీలు సినీ ఫక్కీలో పరారైన సంగతి తెలిసిందే. బుధవారం మరో ఇద్దరు ఖైదీలను అదుపులోకి తీసుకున్నారని, వారిని పొన్ముత్తు, రెజిన్‌గా గుర్తించామని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (సౌత్ జోన్) విజయేంద్ర బిడారి తెలిపారు. మిగిలిన ఇద్దరిని కూడా త్వరలో అదుపులోకి తీసుకుంటామని అన్నారు. ఇప్పటివరకు అరెస్ట్ చేసిన ఖైదీలందరినీ విచారిస్తున్నామని అన్నారు. తిరిగి అరెస్టు చేసిన వారిలో కొందరిని కొండ ప్రాంతానికి తీసుకెళ్లి, జైలు నుండి తప్పించుకున్న తర్వాత వారు ఆశ్రయం పొందిన ప్రదేశాన్ని రికార్డు చేసినట్లు మరో అధికారి తెలిపారు. మొత్తం 17 మంది నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు కందనూర్ పోలీసులు వెల్లడించారు. నిందితులను రిమాండ్ నిమిత్తం జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నామని అన్నారు.
ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (సౌత్ జోన్) విజయేంద్ర బిడారి నేతృత్వంలో ఉన్నతాధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తం 17 బృందాలను ఏర్పాటు చేయగా, తేని, దిండిగల్ జిల్లాల సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌పి)లకు ఈ ఆపరేషన్ బాధ్యతలను అప్పగించారు. కొన్ని గంటల్లోనే పోలీసులు నిందితుల్లో ఒకరిని పట్టుకోగలిగారు. ఆ తర్వాత మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, మంగళవారం సాయంత్రం మూడు హై-డెఫినిషన్ డ్రోన్ల సహాయంతో అటవీ ప్రాంతంలో ఉన్న మరో ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగలిగారు.







కామెంట్‌లు (0)