న్యూఢిల్లీ : ఢిల్లీ రవాణా కార్పొరేషన్ (డిటిసి) కు చెందిన కాంట్రాక్ట్ డ్రైవర్లు, కండక్టర్లు చేస్తున్న సమ్మె గురువారంతో మూడవ రోజుకు చేరింది. ఈ సమ్మె కారణంగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో బస్సు సర్వీసులకు ఆటంకం కలుగుతోంది. అనేక చోట్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వేతనాలు పెంచాలని, మెడికల్, బీమా, సామా జిక భద్రత వంటి ప్రయోజనాలు కల్పించాలని, మరింత మెరుగైన పని పరిస్థితులు వుండాలని, పర్మినెంట్ డిటిసి ఉద్యోగులతో సమానంగా తమను చూడాలని, మరింతగా ఉపాధి భద్రత వుండాలని వారు కోరుతున్నారు. కాగా తమ డిమాండ్లు పరిష్కారమయ్యేవరకు తమ ఆందోళ న కొనసాగిస్తామని వారు చెప్పారు. కాగా వారి ఆందోళనలు పరిశీలిస్తామని, ముందు సమ్మెను ఉపసంహరించాలంటూ ఢిల్లీ రవాణా శాఖ మంత్రి పంకజ్ సింగ్ బుధవారం ఉద్యోగులను కోరారు.
సిఐటియు సంఘీభావం
కాగా, సమ్మె చేస్తున్న సిబ్బందికి సిఐటియు ఢిల్లీ రాష్ట్ర కమిటీ సంఘీభావాన్ని ప్రకటించింది. అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారని, అది కూడా చాలా ఆలస్యంగా చెల్లిస్తున్నారని విమర్శించింది. పైగా మౌలికమైన ఉపాధి ప్రయోజనాలు కూడా వారికి నిరాకరిస్తున్నారని పేర్కొంది. డిటిసి కార్యకలాపాలను మరింతగా ప్రైవేటీకరిం చడాన్ని, ఔట్‌సోర్సింగ్‌కు ఇవ్వడాన్ని కూడా సిఐటియు తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రభుత్వ రవాణా రంగాన్ని బలహీనపరుస్తున్నారని విమర్శించింది.ఢిల్లీలో బస్సుల సంఖ్య, బస్సు ప్రయాణికుల సంఖ్య తగ్గడాన్ని ఈ సందర్భంగా ఉదహరించింది. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రవాణా రంగంపై దాడి తీవ్రత పెరిగిందని విమర్శించింది. ఎలాంటి నోటీసు లేకుండా డిఐఎంటిఎస్ ఆపరేషన్స్‌ను నిలిపివేసి, వర్కర్లను గాలికి వదిలేశారని పేర్కొంది. ప్రైవేటు డిపోల్లోని వర్కర్లకు నెలల తరబడి వేతనాలు ఇవ్వడం లేదని పేర్కొంది. తక్షణమే పెండింగ్‌లో వున్న వేతనాలు, బోనస్‌లు అన్నీ చెల్లించాలని సిఐటియు డిమాండ్ చేసింది. ప్రతి ఒక్క కాంట్రాక్టు కార్మికుడికి వైద్య సదుపాయాలు, బీమా సదుపాయం కల్పించాలి. సమాన పనికి సమాన వేతనం వుండాలని కోరింది. ప్రైవేటీకరణ, ఔట్‌సోర్సింగ్ కార్యకలాపాలకు స్వస్తి చెప్పాలని కోరింది. తక్షణమే సమ్మె చేస్తున్న సిబ్బందితో చర్చలు జరపాలని కోరింది.








కామెంట్‌లు (0)