* ‘నన్ను నేరస్థుడిలా చూశారు’ ప్రొఫెసర్ ఆవేదన
* అర్ధరాత్రి అరెస్టులు పోలీసు రాజ్యానికి సంకేతం : సిపిఎం
చెన్నై:
తన ఫోటోతో ఉన్న ఒక నకిలీ సోషల్ మీడియా ఖాతా నుండి అభ్యంతరకర పోస్ట్ వచ్చిందన్న కారణంతో చెన్నై పోలీసులు తనను నేరస్థుడిలా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ స్టడీస్ (MIDS) అసోసియేట్ ప్రొఫెసర్ ఎ. కలైయరసన్ తీవ్ర ఆరోపణలు చేశారు. పల్లవరం టీవీకే (TVK) ఎమ్మెల్యే జె. కామాక్షిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే నెపంతో పోలీసులు తనను వేధించారని పేర్కొంటూ ఆయన తమిళనాడు డిజిపికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళితే... బుధవారం (అక్టోబర్ 28) తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో మఫ్టీలో ఉన్న ముగ్గురు పోలీసులు అడియార్‌లోని ప్రొఫెసర్ కలైయరసన్ నివాసానికి వెళ్లి, ఎలాంటి ఎఫ్‌ఐఆర్ గానీ, నోటీసులు గానీ చూపించకుండా ఆయన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, పమ్మల్‌లోని టి4 శంకర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు రావాలని ఒత్తిడి చేశారు. కనీసం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చేందుకు, దుస్తులు మార్చుకునేందుకు కూడా నిరాకరించి, ఒక ప్రైవేట్ అద్దె కారులో ఆయనను తీసుకెళ్లారు.
ఈ క్రమంలో పల్లవరం సమీపంలో కారును నిలిపివేసి, దాదాపు 45 నిమిషాల పాటు పోలీసులు చాలా ఫోన్ కాల్స్ మాట్లాడారని, ఆ తర్వాత మళ్లీ వెనక్కి తీసుకొచ్చారని ప్రొఫెసర్ వివరించారు. తిరుగు ప్రయాణంలో `@youvijayamani` అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి చేసిన కామెంట్ స్క్రీన్‌షాట్‌ను పోలీసులు చూపించారు. ఆ ఖాతాకి తన ఫోటో డిస్‌ప్లే పిక్చర్‌గా ఉందని, హార్వర్డ్ విశ్వవిద్యాలయ వెబ్‌సైట్ నుండి ఆ ఫోటోను దొంగిలించి నకిలీ ఖాతా తెరిచి ఉంటారని ఆయన పోలీసులకు స్పష్టం చేశారు. తనకు ఇన్‌స్టాగ్రామ్ ఖాతానే లేదని ప్రొఫెసర్ తేల్చి చెప్పారు. అనంతరం ఉదయం 7:45 గంటలకు ఆయనను ఇంటి వద్ద దించి, సదరు ఖాతాతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని రాతపూర్వక స్టేట్‌మెంట్ తీసుకున్నారు.
"ఒక అకడమిషియన్‌గా, బాధితుడిగా ఉన్న తనకు వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా పోలీసులు నేరస్థుడిలా బలవంతంగా తీసుకెళ్లడం తీవ్రంగా కలచివేసింది" అని కలైయరసన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల తమిళనాడులో ద్రవ్యోల్బణం, నిత్యావసర ధరల పెరుగుదలపై ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన కొద్ది రోజులకే ఈ ఘటన జరగడం గమనార్హం. ఆయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించిన ‘ది ద్రవిడియన్ మోడల్’ పుస్తకానికి సహ రచయితగా కూడా ఆయన వ్యవహరించారు.
కాగా, ఈ ఘటనపై సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పి. షణ్ముగం తీవ్రంగా స్పందించారు. అర్ధరాత్రి, తెల్లవారుజామున అరెస్టులు చేయడం పోలీసు రాజ్యానికి సంకేతమా అని ప్రశ్నించారు. ఏవైనా ఫిర్యాదులు ఉంటే చట్టప్రకారం నోటీసులు ఇచ్చి విచారించాలి కానీ, ఒక ప్రొఫెసర్‌ను ఈ రీతిలో తీసుకెళ్లడం ఆమోదయోగ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే, ఈ ఆరోపణలను శంకర్ నగర్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ ఖండించారు. సదరు నకిలీ ఖాతాలో ప్రొఫెసర్ ఫోటో, పేరు ఉండటంతో కేవలం విచారణ నిమిత్తమే ఆయనను పిలిచామని, ఆయనకు ఇందులో ప్రమేయం లేదని తేలడంతో గౌరవప్రదంగా తిరిగి ఇంటి వద్ద దింపేశామని చెప్పారు.








కామెంట్‌లు (0)