భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై చర్చలు..
ముంబై: అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో మంగళవారం (అక్టోబర్ 20) ముంబై చేరుకున్నారు. భారత్‌లో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఇక్కడికి వచ్చారు. భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంతోపాటు, ఇరు దేశాల మధ్య ప్రతిష్ఠంభనకు గురైన వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడంపై ఈ పర్యటనలో ప్రధానంగా చర్చలు జరగనున్నాయి.
ముంబైలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో రూబియో భేటీ కానున్నారు. ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, కీలక సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలు చర్చకు రానున్నాయి. పశ్చిమాసియాలో పరిస్థితులు, ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపైనా ఇరువురు చర్చించనున్నారు.
26/11 ముంబై ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించేందుకు రూబియో తాజ్ హోటల్‌లోని స్మారక స్థలాన్ని సందర్శించనున్నారు. అనంతరం అమెరికా స్వాతంత్య్ర 250వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. ముంబై పర్యటన అనంతరం గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు వెళ్లి రిలయన్స్ సంస్థకు చెందిన చమురు శుద్ధి కర్మాగారాన్ని సందర్శించనున్నారు.
భారతీయ వస్తువులపై అమెరికా విధించిన సుంకాలు, రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలకు అడ్డంకులుగా నిలిచాయి. అయితే, వాణిజ్య ఒప్పందం ఖరారు కావడానికి ఇరు దేశాలు దగ్గరగా ఉన్నాయని రూబియో ఇటీవల పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.







కామెంట్‌లు (0)