వాటి ప్రాతిపదికనే సంక్షేమ చెల్లింపులు !
కేంద్ర పంచాయితీ రాజ్ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ వెల్లడి
గ్యాంగ్‌టక్ : ఇకపై పంచాయితీరాజ్ మంత్రిత్వ శాఖ పరిధిలోని సంక్షేమ పథకాల చెల్లింపులకు ఓటర్ గుర్తింపు కార్డులు వాటితో పాటూ బయోమెట్రిక్ ప్రామాణీకరణ ప్రాతిపదిక కానుంది. మంగళవారం ఇక్కడ ఒక కార్యక్రమానికి హాజరైన కేంద్ర పంచాయితీ రాజ్ మంత్రి, జెడియు నేత రాజీవ్ రంజన్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం పునరుద్ఘాటించారు. ఢిల్లీలో గత శుక్రవారం తమ మంత్రిత్వ శాఖ నిర్వహించిన ‘పీపుల్స్ ప్లాన్ కేంపైన్ (పిపిసి) 2026-27’ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రస్తుతం లబ్దిదారుల చెల్లింపులకు ఆధార్ ప్రాతిపదికగా వుంది. కానీ ఇకపై ఇది ప్రాధమిక గుర్తింపుగా పరిగణించబడదు.’’ అని ఆయన పేర్కొన్నారు.
ఆధార్ కార్డు ప్రతి వీధి మూలలోనూ అందుబాటులో వుంటోందని, దానివల్ల మోసపూరితమైన లబ్దిదారులు వుండే అవకాశం తలెత్తుతోందన్నారు. ఎవరైనా కావాలంటే ఆధార్ కార్డును ఐదు నిముషాల్లో పొందగలుగుతున్నారని అన్నారు. అందువల్ల ఇకపై లబ్దిదారులు తమ ఓటర్ గుర్తింపు కార్డుతోపాటూ బయోమెట్రిక్ కూడా వేయాల్సి వుంటుందన్నారు. వాటి ద్వారా మాత్రమే గుర్తింపును నిర్ధారించి ప్రభుత్వ ప్రయోజనాలు అందుతాయని స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదిత మార్పు వల్ల అర్హులైన లబ్దిదారులు మాత్రమే సంక్షేమ పథకాల ప్రయోజనాల పొందగలరని అన్నారు.








కామెంట్‌లు (0)