: కేరళ హైకోర్టు
తిరువనంతపురం: ఒక మహిళ భర్తతో కలిసి ఉమ్మడిగా ఆస్థిని కొనుగోలు చేసినా.. ఈ కొనుగోలుకు తన తండ్రి నుంచి వచ్చిన సొమ్మును వినియోగిస్తే.. ఆ ఆస్తికి ఈ మహిళే ఏకైక యజమాని అని కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది. జస్టిస్ సతీష్ నినన్, జస్టిస్ పి. కృష్ణ కుమార్ లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు తీర్పు వెల్లడించింది. భర్తతో కలిసి కొనుగోలు చేసిన బంగారు ఆభరణాలు, నివాస స్థలంపై తన హక్కును కోరుతూ ఒక మహిళ వేసిన పిటిషన్పై హైకోర్టు ఈ తీర్పు వెల్లడించింది. బంగారు ఆభరణాలు, భర్తకు ఇచ్చినట్లు చెబుతున్న నగదు, భరణం కోసం మహిళ చేసిన వాదనలను హైకోర్టు తిరస్కరించింది. అయితే, నివాస స్థలంను పిటిషనర్ కోసమే కొనుగోలు చేసినట్లు నిర్థారించిన హైకోర్టు ఆ ఆస్తిపై మహిళకు పూర్తి యాజమాన్య హక్కు ఉంటుందని కోర్టు పేర్కొంది. ఈ ఆస్తిని తన సొంత నిధులతో కొనుగోలు చేశానని భర్త వాదించినా, దీన్ని ధృవీకరించడానికి ఎలాంటి ఆధారాలను సమర్పించలేకపోయాడు. అలాగే ఈ ఆస్తికి సంబంధించిన నిజమైన యాజమాన్య పత్రం (టైటిల్ డీడ్) మహిళ వద్దే ఉందని భర్త అంగీకరించడాన్ని కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ వివాదంలో ఈ ఇద్దరూ ముందుగా మలప్పురం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. బంగారం, నగదు విషయంలో మహిళ విజ్ఞప్తిని తిరస్కరించిన ఫ్యామిలీ కోర్టు నివాస ఆస్తిలో ఆమె వాటాకు గాను రూ.15 లక్షలు చెల్లించాలని భర్తను ఆదేశించింది. అయితే దీన్ని అంగీకరించని మహిళ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు మహిళకు పూర్తి యాజమాన్య హక్కును కల్పించింది. మూడు నెలల్లోగా ఆ ఇంటిని ఖాళీ చేయాలని ఆమె భర్తను ఆదేశించింది.







కామెంట్లు (0)