ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ధర్నా చేస్తాం

22 గంటల క్రితం

p[orte
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026, 12:29 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు​

న్యూఢిల్లీ : దేశ రాజధానిలోని ఢిల్లీ హైకోర్టు సమీపంలో రహదారి భద్రతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అధికారులు తగిన చర్యలు చేపట్టకపోతే హైకోర్టు ప్రధాన ద్వారం వద్ద స్వయంగా ధర్నా చేస్తామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఢిల్లీ హైకోర్టు సమీపంలోని మధుర రోడ్డు కూడలి వద్ద రహదారి భద్రత, సరైన ట్రాఫిక్ నిర్వహణ లేకపోవడం, పాదచారుల భద్రతా పరమైన సమస్యలపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం దీనిపై విచారణ జరిపింది. ఒక కమిటీ ఈ సమస్యను పరిశీలిస్తున్నదని, ఉన్నతాధికారులతో తాను చర్చించానని కేంద్ర ప్రభుత్వం తరుఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఎఎస్‌‌జి) సుప్రీంకోర్టుకు తెలిపారు. ఉన్నత స్థాయి కమిటీ అవసరమేమిటని కోర్టు ప్రశ్నించింది. సమస్యను కచ్చితంగా గుర్తించి, పరిష్కారాన్ని కనుగొనేందుకు ‘అమికస్ క్యూరీ’ (కోర్టుకు సహాయం చేసే వ్యక్తి)ని భాగస్వామిగా చేయాలని సూచించింది. అధికారులు కమిటీ చర్చలకే పరిమితం కాకుండా, తదుపరి విచారణకు ముందే అవసరమైన క్షేత్రస్థాయి పనులను పూర్తి చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది.

మరోవైపు గడువులోగా అధికారులు స్పష్టమైన పరిష్కారాన్ని అమలు చేయడంలో విఫలమైతే, ఎఎస్‌జీతో పాటు ప్రధాన కార్యదర్శి కూడా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. నవంబర్ 25లోపు తగిన చర్యలు చేపట్టకపోతే, తామే స్వయంగా హైకోర్టు ప్రధాన ద్వారం వద్ద ‘ధర్నా’ చేస్తామని పేర్కొంది. ‘ఒకవేళ మీరు ఈ పని పూర్తి చేయకపోతే, మేమిద్దరం (సుప్రీంకోర్టు ధర్మాసనంలోని న్యాయమూర్తులు) ఢిల్లీ హైకోర్టు ప్రధాన ద్వారం వద్ద కూర్చుంటాం. పని పూర్తయ్యే వరకు అక్కడి నుంచి మేం కదలబోము, ఇంటికి కూడా వెళ్లం. ఇది ఖాయం. మిమ్మల్ని కూడా ఇంటికి వెళ్లనివ్వం’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఢిల్లీలో ప్రస్తుతం వివిధ అంశాలపై అనేక నిరసనలు జరుగుతున్న తరుణంలో, సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్య ప్రాధాన్యత సంతరించుకున్నది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్