చెన్నై: ప్రభుత్వాలపై ప్రజలుచేసే విమర్శల గురించి మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యమంత్రులను విమర్శించే హక్కు పౌరులకు ఉంటుందని పేర్కొంది. అదే సమయంలో ప్రజలకు ఉన్న అలాంటి హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, పోలీసులకు ఉంటుందని వ్యాఖ్యానించింది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను కించపరిచారనే ఆరోపణలతో డిఎంకె కౌన్సిలర్ సుధపై కేసు నమోదైంది. ఈ కేసులో బెయిల్ కోసం సుధ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ ఎన్ రమేశ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్యంలో పాలకులను ప్రశ్నించడం, విమర్శించడం, వ్యతిరేకతను తెలియజేయడం పౌరుల ప్రాథమిక హక్కు అని పేర్కొంది. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాన్ని ప్రశంసించడంతోపాటు విమర్శించే స్వేచ్ఛ కూడా ప్రజలకు ఉంటుందని స్పష్టంచేసింది. పాలన మారవచ్చు, ముఖ్యమంత్రులు మారవచ్చు, కానీ చట్టం ముందు అందరూ సమానమే అనే సూత్రం ఎప్పటికీ మారదని చెప్పింది. ఓ రాజకీయ నాయకుడి ప్రసంగం పాలకులను అవమానించేలా ఉన్నంత మాత్రాన అది నేరం కాదని, ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రితో సహా ప్రజా జీవితంలో ఉన్న నేతలందరికీ ఉంటుందని తెలిపింది. పాలకులు విమర్శలకు అతీతులు కారని కోర్టు పేర్కొంది. చట్టాన్ని అమలుచేసే అధికారులుగా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించింది.
ముఖ్యమంత్రులను విమర్శించే హక్కు పౌరులకు ఉంది: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
9 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 04, 2026, 01:52 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)