- ఎస్‌సిఓ సివిలైజేషనల్ డైలాగ్ ఫోరమ్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : సాంస్కృతిక, నాగరికతా సహకారం వివిధ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుందని, 21వ శతాబ్దపు సాంకేతికత, సాంస్కృతిక అనుసంథానతకు కొత్త అవకాశాలను సృష్టించిందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. తొలి ఎస్‌సిఓ సివిలైజేషనల్ డైలాగ్ ఫోరమ్ (నాగరికతా సంభాషణల వేదిక)ను శుక్రవారం ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ మ్యూజియాల్లో, గ్రంథాలయాల్లో, పురావస్తుశాలల్లో వేలాది సంవత్సరాల అమూల్యమైన వారసత్వ సంపద పరిరక్షించబడిందని అన్నారు. ఆ సాంకేతికత ఈ వారసత్వాన్ని రాబోయే తరానికి అందచేయడంలో సహకరిస్తుందన్నారు. ‘‘ఇటీవల కాలంలో, భధ్రత, ఆర్థిక వ్యవస్థ, అనుసంథానత రంగాల్లో ఎస్‌సిఓ (షాంఘై సహకార సంస్థ) గణనీయంగా సహకారాన్ని పెంపొందించింది. అటువంటి పరిస్థితుల్లో, సాంస్కృతిక, నాగరికతా సహకారం వివిధ దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది. ఈ వేదిక నుండి కొత్త ఆలోచనలు ఆవిర్భవిస్తాయన్న విశ్వాసం నాకుంది. సాంస్కృతిక సహకారానికి కొత్త అవకాశాలు సృష్టించబడతాయి. మన ఉమ్మడి నాగరికతా అనుభవాలు ప్రపంచ దేశాలను ఏకం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.’’ అని ప్రధాని పేర్కొన్నారు. సామ్రాజ్యాలు కచ్చితంగా ప్రపంచ పటాలను మార్చేశాయి. కానీ, నాగరికతా చర్చలు, సంభాషణలు ప్రపంచ ఆలోచనలను, మార్చి వాటిని మరింత పరిపుష్టం చేశాయన్నారు. అందువల్ల ఎస్‌సిఓ నాగరికతా సదస్సు కేవలం ఉత్సవాలు జరుపుకునే వేదిక ఒక్కటే కాదు, ప్రపంచానికి దిశా నిర్దేశం చేయగలిగే వేదికగా కూడా మారుతుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా సాంస్కృతిక అనుసంథానతకు కొత్త అవకాశాలను 21వ శతాబ్దాపు సాంకేతికత సృష్టించిందన్నారు. సాంస్కృతిక మార్పిడులు, అంతర్జాతీయ సహకారం వంటి వాటిని డిజిటల్ వేదికలు ఇప్పుడు మరింత సులభతరం చేశాయన్నారు. ఈ కొత్త అవకాశాలన్నింటినీ ఎస్‌సిఓ దేశాలు పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని ప్రధాని పేర్కొన్నారు. శుక్రవారం నుండి మూడు రోజుల పాటు సాగే ఈ కార్యక్రమానికి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. చారిత్రక పురానా ఖిల్లాలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. పాకిస్తాన్‌తో సహా వివిధ ఎస్‌సిఓ సభ్య దేశాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు.








కామెంట్‌లు (0)