పోలీసులే వాటిపై ఆధారపడుతుంటే ఎలా కొట్టిపారేస్తారు
సుప్రీంలో మహిళా జర్నలిస్టుల ప్రశ్న
న్యూఢిల్లీ : వార్తలను సేకరించి, ఇచ్చే స్వేచ్ఛ ప్రభుత్వ గుర్తింపుపై, గుర్తింపు పొందిన మీడియా సంస్థల్లో చేసే ఉద్యోగంపై లేదా యాజమాన్యం జారీచేసిన గుర్తింపు కార్డును కలిగివుండడంపై ఆధారపడి వుండదని మహిళా జర్నలిస్టు గ్రూపు అయిన నెట్‌వర్క్ ఆఫ్ వుమెన్ ఇన్ మీడియా, ఇండియా (ఎన్‌డబ్ల్యుఎంఐ) సుప్రీం కోర్టులో ఢిల్లీ పోలీసులకు బదులిచ్చింది. గుర్తింపు పొందిన మీడియా సంస్థలకు చెందిన అక్రిడేటెడ్ రిపోర్టర్లకు, రీల్స్ చేసేవారికి మధ్య తేడా వుంటుందని పోలీసులు పేర్కొన్నారు. రీల్స్ చేసేవారిని వర్కింగ్ జర్నలిస్టులుగా పరిగణించలేమని అన్నారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు ఈ నెల 16న అఫిడవిట్ దాఖలు చేశారు. ఒక వ్యక్తి కెమెరా, మైక్‌ను కలిగి వుంటే జర్నలిస్టుగా పేర్కొనలేమని అన్నారు. సిఇసి వ్యతిరేక నిరసన ప్రదేశాల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల విధులకు ఆటంకం కలిగించరాదంటూ సుప్రీం ఇచ్చిన ఆదేశాలతో వచ్చిన రక్షణ రీల్ మేకర్స్‌కు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్లకు వర్తించదని పోలీసులు పేర్కొన్నారు. ఈ అంశంపై మహిళా జర్నలిస్టులు స్పందించారు. పోలీసులే రీల్స్‌పై ఆధారపడుతున్నపుడు రీల్ మేకర్స్‌ను ఎలా కొట్టిపారేస్తారని ప్రశ్నించారు. సిఇసి జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ అక్టోబరులో నిరసనల వార్తలను కవర్ చేసిన విలేకర్లను మూకుమ్మడిగా తొలగించడం లేదా నిర్బంధించడాన్ని సవాలు చేస్తూ మహిళా జర్నలిస్ట్ గ్రూపు పిటిషన్ దాఖలు చేసింది. షార్ట్ వీడియో తరహాలో విస్తృతంగా వైరల్ అయిన రీల్స్‌ను ప్రధాన వార్తా సంస్థలే కాకుండా ఢిల్లీ పోలీసులు, ఆకాశవాణి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలు కూడా వాడుకుంటున్నపుడు రీల్స్ పట్ల వివక్ష చూపడాన్ని వారు ప్రశ్నించారు. ఒకపక్క రీల్ మేకర్స్‌ను పోలీసులు విమర్శిస్తున్నారు కానీ నిరసన ప్రదేశాల్లో వున్న వ్యక్తుల దుష్ప్రవర్తన గురించి చెప్పాలంటే ఆ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌నే వారు ఆశ్రయిస్తున్నారని మహిళా మీడియా నిపుణులు పేర్కొన్నారు. 2024-25 కేంద్ర ప్రభుత్వ డేటా ప్రకారం ప్రింట్, ఆడియో విజువల్ మీడియావ్యాప్తంగా వాణిజ్య ప్రకటనలకు రూ.525.9కోట్లు ఖర్చు కాగా, వాటిలో 77.2శాతం అంటే 406.12కోట్లు కేవలం ఆడియో-విజువల్ వాణిజ్య ప్రకటనలకే ఖర్చయింది. ‘‘స్వతంత్ర జర్నలిస్టులు, ఫ్రీలాన్సర్లు, డిజిటల్‌వేదికల ద్వారా పనిచేసే జర్నలిస్టులు వీరంతా సమకాలీన పత్రికా ప్రపంచంలో చట్టబద్ధమైన భాగమే, బహిరంగ ప్రదేశాలనుండి చట్టబద్ధమైన రీతిలో వార్తలను సేకరించడానికి వారికి గల అర్హతలు, హక్కులను ప్రభుత్వ గుర్తింపుపై ఆధారపడేలా చేయరాదు.’’ అని ఎన్‌డబ్ల్యుఎంపై తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది ఆరతి రాజన్ పేర్కొన్నారు. సుప్రీం కోర్టులో ఢిల్లీ పోలీసులు దాఖలుచేసిన రీజాయిండర్‌పై ఆమె తన వాదనలు వినిపించారు.








కామెంట్‌లు (0)