- రెండు వారాల్లోగా నీట్ సంస్కరణలపై నివేదిక సమర్పించాలని టాస్క్‌ఫోర్స్‌కు ఆదేశం
న్యూఢిల్లీ : నీట్ సంస్కరణల పురోగతిని పరిశీలించడానికి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) పనితీరును అంచనా వేయడానికి ఆ సంస్థ కార్యాలయాన్ని తనిఖీ చేస్తామని సుప్రీంకోర్టు శుక్రవారం వెల్లడించింది. అలాగే నీట్ సంస్కరణలపై సాధించిన పురోగతిని వివరిస్తూ రెండు వారాల్లోగా ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని నందన్ నిలేకని నేతృత్వంలోని ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్‌ను ఆదేశించింది. ఈ అఫిడవిట్‌ను ఎన్‌టిఎ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని కూడా స్పష్టం చేసింది. నీట్ పేపర్ లీక్‌ల నేపథ్యంలో ఎన్‌టిఎలో నిర్మాణాత్మక సంస్కరణలు కోరుతూ ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్, యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్ దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ అరధేల నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారించింది. కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.
నందన్ నీలేకని నేతృత్వంలోని కొత్త ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్, డాక్టర్ కె. రాధాకృష్ణన్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి నిపుణుల కమిటీతో ఇప్పటికే సంప్రదింపు జరిపిందని ధర్మాసనంకు తెలిపారు. దీనికి ఎన్‌టిఎను సంస్థాగతం చేయడం, సిఫార్సులను అమలు చేయడం చాలా ముఖ్యమని న్యాయమూర్తి జస్టిస్ నరసింహ స్పష్టం చేశారు. అలాగే, తన విధులను నిర్వహించడానికి ఎన్‌టిఎకి ఇప్పుడు ఒక స్థలం ఉందా అని జస్టిస్ నరసింహ ప్రశ్నించగా, ఎన్‌టిఎ శాశ్వత కార్యాలయం మింటో రోడ్‌లో ఉందని మెహతా సమధానం ఇచ్చారు. దీనికి న్యాయమూర్తి నరసింహ స్పందిస్తూ " వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుందో... లేదో, మానవ వనరులు మొదలైనవి పరిశీలించడానికి, నేను, నా సోదరుడు ఒక రోజు అక్కడికి వస్తాము. కార్యాలయం శాశ్వతంగా ఉండాలి, కనీసం సగం మంది సిబ్బంది అయినా ఆ సమయంలో ఉండాలి, అలాగే, ఎవ్వరూ కూడా డిప్యూటేషన్‌పై ఉండకూడదు. శాశ్వత సిబ్బంది ఉండాలి" అని జస్టిస్ నరసింహ మౌఖికంగా తెలిపారు.








కామెంట్‌లు (0)