శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తీవ్రమౌతున్న నీటి కొరత

14 నవంబర్, 2026

crisis
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 11:22 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

​​ప్రజాశక్తి - న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా నీటి కొరత తీవ్రమౌతోంది. ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు వేగంగా తగ్గుతున్నాయి. దక్షిణ భారతదేశంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రధాన జలాశయాల్లో వాటి మొత్తం సామర్థ్యంలో 40 శాతం కంటే తక్కువ నీరు మాత్రమే మిగిలింది. కేంద్ర జల సంఘం (సిడబ్ల్యూసి ) నవంబర్‌ 12న విడుదల చేసిన నివేదిక ప్రకారం దక్షిణ భారతంలోని 50 ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు సాధారణ స్థాయి కంటే 46.89 శాతం తక్కువగా నమోదయ్యాయి. రాష్ట్రంలో రెండు భారీ తుపాన్‌‌ల తరువాత కూడా ఈ పరిస్థితి నెలకొనడం గమనార్హం. ఎల్‌‌నినో కారణంగా ఈ పరిస్థితి నెలకొందని భావిస్తున్నారు.

ఇదీ దేశ వ్యాప్త స్థితి

దేశవ్యాప్తంగా 178 ప్రధాన జలాశయాల్లో నవంబర్‌ 12 నాటికి 116.854 బిలియన్‌ ఘనపు మీటర్ల (బిసిఎం ) నీరు నిల్వ ఉంది. ఈ జలాశయాల మొత్తం వినియోగయోగ్య నిల్వ సామర్థ్యం 184.762 బిసిఎంలు కాగా, ప్రస్తుతం 63.25 శాతం నీరు మాత్రమే ఉంది. నవంబర్‌ 5న ఈ జలాశయాల్లో 121.926 బిసిఎం నీరు ఉండగా, కేవలం వారం రోజుల్లోనే 5.07 బిసిఎంల నిల్వలు తగ్గిపోయాయి.గత ఏడాది ఇదే కాలంలో జలాశయాల్లో 166.101 బిసిఎంల నీరు ఉండేది. దీంతో పోలిస్తే ప్రస్తుత నిల్వలు 29.65 శాతం తక్కువగా ఉన్నాయి. సాధారణంగా ఈ కాలంలో ఉండాల్సిన 145.811 బిసిఎంల నిల్వల కంటే 19.86 శాతం తక్కువ నీరు ఉంది. గత ఏడాదితో పోలిస్తే 49.247 బిసిఎంల సాధారణ నిల్వలతో పోలిస్తే 28.957 బిసిఎంల లోటు నమోదైంది.

దక్షిణాదిలో ఇలా...

దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే దక్షిణ భారతదేశంలో నీటి నిల్వల కొరత తీవ్రంగా ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది. ఈ ప్రాంతంలోని 50 ప్రధాన జలాశయాల మొత్తం సామర్థ్యం 55.879 బిసిఎంలు కాగా, ప్రస్తుతం 22.206 బిసిఎంల నీరు మాత్రమే నిల్వ ఉంది. అంటే మొత్తం సామర్థ్యంలో 39.74 శాతం నీరు మాత్రమే మిగిలింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ జలాశయాల్లో 49.440 బిసిఎంల నీరు ఉండగా, సాధారణ నిల్వ స్థాయి 41.814 బీసీఎంగా ఉంది. రాష్ట్రాలవారీగా పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు ప్రధాన జలాశయాల్లో 3.432 బిసిఎంల నీరు మాత్రమే ఉంది. ఇది వాటి మొత్తం సామర్థ్యంలో 27.54 శాతం. తెలంగాణలోని ఎనిమిది జలాశయాల్లో 3.269 బిసిఎంల నీరు, అంటే 33.49 శాతం నిల్వ ఉంది. తమిళనాడులోని తొమ్మిది జలాశయాల్లో 1.720 బిసిఎంల నీరు మాత్రమే ఉండగా, ఇది మొత్తం సామర్థ్యంలో 36.28 శాతానికి సమానం. కర్ణాటకలోని 19 జలాశయాల్లో 11.228 బిసిఎంల నీరు, అంటే 44.89 శాతం నిల్వ ఉంది. కేరళలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. అక్కడి ఏడు జలాశయాల్లో 2.557 బిసిఎంల నీరు ఉండగా, ఇది మొత్తం సామర్థ్యంలో 65.55 శాతం.

ఉత్తర భారతంలోనూ తగ్గిన నిల్వలు

హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లోని 11 ప్రధాన జలాశయాల్లో మొత్తం 19.836 బిసిఎంల సామర్థ్యానికి గాను 10.948 బిసిఎంల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఇది 55.19 శాతానికి సమానం. ఈ ప్రాంతంలో నీటి నిల్వలు సాధారణ స్థాయి కంటే 24.82 శాతం తక్కువగా ఉన్నాయి.హిమాచల్‌ప్రదేశ్‌లోని మూడు జలాశయాల్లో 6.921 బిసిఎంల నీరు, పంజాబ్‌లోని జలాశయంలో 1.040 బిసిఎంల నీరు నిల్వ ఉంది. రాజస్థాన్‌లోని ఏడు జలాశయాల్లో 2.987 బిసిఎంల నీరు మాత్రమే ఉంది. పంజాబ్‌లో సాధారణ స్థాయి కంటే 27.12 శాతం తక్కువగా నీటి నిల్వలు నమోదయ్యాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనూ గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నిల్వలు తగ్గాయి.

మహారాష్ట్ర, గుజరాత్‌లలో కరువు

మహారాష్ట్ర, గుజరాత్‌‌లలో ఇప్పటికే కరువు పరిస్థితులు నెలకొన్నాయి. మహారాష్ట్రలోని 38 ప్రధాన జలాశయాల్లో 14.589 బిసిఎంల నీరు నిల్వ ఉంది. ఇది మొత్తం సామర్థ్యంలో 71.63 శాతం. అయితే సాధారణ నిల్వ స్థాయి 18.069 బిసిఎంలతో పోలిస్తే 19.26 శాతం తక్కువగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ జలాశయాల్లో 19.814 బీసీఎం నీరు ఉండేది. మహారాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్‌ 14న 33 జిల్లాల్లోని 305 తాలూకాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించింది. గుజరాత్‌లోని 19 ప్రధాన జలాశయాల్లో 13.437 బిసిఎంల నీరు నిల్వ ఉంది. ఇది మొత్తం సామర్థ్యంలో 74.60 శాతం. గత ఏడాది ఇదే కాలంలో ఉన్న 17.282 బిసిఎంలతో తో పోలిస్తే ప్రస్తుత నిల్వలు గణనీయంగా తగ్గాయి. సాధారణ స్థాయి కంటే 6.82 శాతం తక్కువగా నీరు ఉంది. దేవభూమి ద్వారక, పోర్‌బందర్‌, జామ్‌నగర్‌, కచ్‌ జిల్లాలను కరువు ప్రభావిత జిల్లాలుగా ప్రకటించారు. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో 80 తాలూకాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించగా, వాటిలో 69 తీవ్ర కరువు ప్రభావితమైనవిగా, 11 మధ్యస్థ కరువు ప్రభావితమైనవిగా వర్గీకరించారు.

తూర్పు భారతంలోనూ...

తూర్పు భారతదేశంలోని 31 ప్రధాన జలాశయాల్లో 21.853 బిసిఎంల సామర్థ్యానికి గాను 16.399 బిసిఎంల నీరు నిల్వ ఉంది. ఇది 75.04 శాతానికి సమానం. అయినప్పటికీ సాధారణ నిల్వ స్థాయి కంటే 2.43 శాతం తక్కువగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ జలాశయాల్లో 17.822 బీసీఎం నీరు ఉండేది. రాష్ట్రాలవారీగా చూస్తే అస్సాంలోని జలాశయాల్లో 36.58 శాతం, బీహార్‌లో 46.87 శాతం, మేఘాలయలో 48.59 శాతం, పశ్చిమ బెంగాల్‌లో 47.14 శాతం నీరు మాత్రమే ఉంది. ఈ నాలుగు రాష్ట్రాల్లోని జలాశయాలు సగం కంటే తక్కువ సామర్థ్యంతోనే ఉన్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్