మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కాలుష్య కోరల్లో యమునా నది

7 గంటల క్రితం

కాలుష్య కోరల్లో యమునా నది
- శుద్ధి కోసం భారీగా నిధుల ఖర్చైనా ఫలితం లేకపోయింది : సుప్రీం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026, 09:53 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- శుద్ధి కోసం భారీగా నిధుల ఖర్చైనా ఫలితం లేకపోయింది : సుప్రీం

న్యూఢిల్లీ: యమునా నది శుద్ధికి భారీ మొత్తాలు ఖర్చు చేసినప్పటికీ కాలుష్యం మరింత పెరిగిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. యమునా, దాని ప్రధాన కాలువలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, జిల్లాల్లోకి ప్రవేశించే, బయటకు వెళ్లే చోట్ల నీటి నాణ్యతను పర్యవేక్షించాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి)ని ఆదేశించింది. గతవారం నాటి ఉత్తర్వులో జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం, పారిశ్రామిక కాలుష్యాన్ని, శుద్ధి చేయని మురుగునీటిని మూలంలోనే అడ్డుకోవాలని స్పష్టం చేసింది. కేవలం మరిన్ని మురుగునీటి శుద్ధి కేంద్రాలను నిర్మించడం సరిపోదని పేర్కొంది. నది ఒడ్డున ఉన్న పట్టణాలు, నగరాలు, గ్రామాల్లోని పరిశ్రమలు, నివాసాలు నుండి మురుగునీరు, అత్యంత విషపూరిత కాలుష్యకారకాలు యమునలో కలుస్తున్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది. నది శుద్ధికి సంబంధించిన పిటిషన్‌ను విచారిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. భారీగా ఖర్చు చేసినా కాలుష్యం పెరగిపోయిందని తెలిపింది. మురుగునీటిని మూలంలోనే నియంత్రించడం సాధ్యం కాని చోట, దాన్ని ముందు ట్యాప్ చేసి ఆ తర్వాత శుద్ధి చేయాలని కోర్టు సూచించింది. అయితే పటిష్ఠమైన మురుగునీటి వ్యవస్థ లేకపోవడం, వర్షపు నీటి కాలువలు మురుగునీటి కాలువలతో కలిసిపోవడం వల్ల ట్యాపింగ్ సవాలుగానే ఉంటుందని పేర్కొంది. అలాగే, ఆక్రమిత భూముల్లో వెలిసిన అక్రమ, అనధికార కాలనీల్లో మురుగునీటిని ట్యాప్ చేయడం పౌర సంస్థలకు కష్టం, దాదాపు అసాధ్యమని కోర్టు అభిప్రాయపడింది. అవి గ్రిడ్ లేఅవుట్‌లో నిర్మితం కాకపోవడం, మురుగునీటి వ్యవస్థ వేసేందుకు స్థలం దాదాపు లేకపోవడం కారణమని తెలిపింది. కాలువలపై, నదీ గర్భంలో ఉన్న అక్రమ కాలనీలు, జుగ్గీ-ఝోంపడీ (మురికివాడ) క్లస్టర్లను తొలగించి, అక్కడి నివాసితులకు పునరావాసం కల్పించకపోతే వాటి మురుగునీరు నదిని కలుషితం చేస్తూనే ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. యమునలో చేపలు మృత్యువాత పడటం, ఉపరితలంపై తెల్లని నురగ తేలడం, యూట్రోఫికేషన్ లేదా ఆల్గల్ బ్లూమ్, లేదా బివొడి, సివొడి, టిఎస్‌ఎస్‌ స్థాయిలు పెరగడం వంటి ఏ కాలుష్య ఘటన జరిగినా ‌సిపిసిబి దర్యాప్తు చేసి సమగ్ర నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఆ ఘటనకు కారణం ఏమిటో, తీసుకోవాల్సిన నివారణ చర్యలేమిటో నివేదికలో ప్రత్యేకంగా పేర్కొనాలని సూచించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్