mh ad
ఆదివారం, 21 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

దేశవ్యాప్తంగా యోగా డే

2 గంటల క్రితం

pm yoga
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 21, 2026, 11:03 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

కొల్‌‌కతాలో మోడీ హాజరు

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఆదివారం ఘనంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ఇందుకోసం నిర్వహించిన కార్యక్రమాల్లో అధికారులు, నాయకులు, యోగా అభ్యాసకులు, సాధారణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. “ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా” ఇతివృత్తంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించచారు. యోగాతో శారీరక ఆరోగ్యం, మానసిక శ్రేయస్సు, భావోద్వేగ స్థితిస్థాపకత కలగడంతోపాటు మెరుగైన జీవన నాణ్యతకు యోగా దోహదపడుతుందనడానికి ఈ ఇతివృత్తాన్ని ఎంపిక చేశారు. కొల్‌కతాలోని రెడ్ రోడ్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. కొల్‌‌కతాలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ ప్రపంచం మొత్తాన్ని యోగా ఒకే వేదికపైకి తీసుకొచ్చిందని అన్నారు. యోగాతో ప్రపంచ వ్యాప్తంగా ఒకరికొకరు కలిసినట్లయిందన్నారు. ‘జూన్ 21 అనేది పగటి కాలం ఎక్కువగా ఉండే రోజు. యోగా కారణంగా ఇది ఇప్పుడు అతిపెద్ద సామూహిక వేడుక దినంగానూ మారింది’ అని మోడీ అన్నారు. ‘యోగా అందర్నీ ఏకం చేస్తుంది. జీవనం మరింత సమతులంగా సాగేలా చేస్తుంది. ఏం చేయాలో, ఏం చేయకూడదో నేర్పుతుంది. శక్తిమంతంగా, సౌకర్యవంతంగా ఉంచుతుంది. వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది’ అని మోడీ తెలిపారు. కొల్‌‌కతాలో వేర్వేరు ప్రదేశాల్లో మొత్తం 10 లక్షల మంది యోగాసనాలు వేసేలా ఏర్పాట్లు చేశారు.

జబల్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు మధ్యప్రదేశ్ గవర్నర్ మంగుభాయ్ పటేల్, ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, వేలాది మంది ప్రజలు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ మానవాళిని శాంతి, సామరస్యాల వైపు నడిపించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ప్రపంచానికి భారతదేశ సాంస్కృతిక వారసత్వం అందించిన అమూల్యమైన బహుమతి యోగా అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముంబయిలోని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఇ) ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) ఎండి, సిఇఓ ఆశిష్ కుమార్ చౌహాన్, ఏఎన్ఎంఐ జాతీయ అధ్యక్షుడు కమలేష్ ష్రాఫ్, ఇతర అధికారులు పాల్గొని పలు యోగాసనాలు ప్రదర్శించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్