mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

భద్రత పేరుతో యుద్ధ వ్యాపారం..

2 రోజుల క్రితం

war
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 17, 2026, 06:30 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

స్టాక్‌హోమ్‌ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ (సిప్రి) తాజా నివేదిక ప్రపంచ రాజకీయాల గురించి ఒక ఆందోళనకరమైన చిత్రాన్ని మన ముందుంచింది. 2025లో ప్రపంచ సైనిక వ్యయం 2.887 ట్రిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.248 లక్షల కోట్లు) చేరింది. ఇది 2024తో పోలిస్తే 9.4 శాతం అధికం. సిప్రి 1949 నుంచి ఈ గణాంకాలను సేకరిస్తోంది. దాని చరిత్రలో ఒకే ఏడాదిలో నమోదైన అతి పెద్ద పెరుగుదలల్లో ఇది ఒకటి. 2015లో ప్రపంచ సైనిక వ్యయం సుమారు 2.1 ట్రిలియన్‌ డాలర్లు (రూ.180 లక్షల కోట్లు) ఉండగా, పదేళ్లలో అది దాదాపు 37 శాతం పెరిగింది. ప్రపంచం శాంతి వైపు కాకుండా మరింత సైనికీకరణ వైపు అడుగులు వేస్తోందని, భద్రత పేరుతో ఆయుధాల వ్యాపారం విస్తరిస్తోందని ఈ సంఖ్యలు చెబుతున్నాయి.
సిప్రి తాజా నివేదికలో మరో ఆందోళనకర అంశం అణ్వాయుధాల విస్తరణ. ప్రపంచంలోని తొమ్మిది అణ్వాయుధ దేశాల వద్ద ప్రస్తుతం 12,241 అణ్వాయుధాలు ఉన్నాయని సంస్థ తెలిపింది. వాటిలో 9,614 అణ్వాయుధాలు సైనిక నిల్వల్లో ఉండగా, సుమారు 3,912 అణ్వాయుధాలు తక్షణ వినియోగానికి సిద్ధంగా ఉన్నాయి. అమెరికా వద్ద 5,177, రష్యా వద్ద 5,459 అణ్వాయుధాలు ఉండగా, చైనా వద్ద 620 అణ్వాయుధాలు ఉన్నాయి. చైనా అత్యంత వేగంగా తన అణు సామర్థ్యాన్ని విస్తరిస్తున్న దేశంగా సిప్రి పేర్కొంది. భారత్‌ వద్ద 190, పాకిస్థాన్‌ వద్ద 170 అణ్వాయుధాలు ఉన్నాయని నివేదిక తెలిపింది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత అణ్వాయుధ నిల్వలు కొంత తగ్గు ముఖం పట్టినా, ఇప్పుడు ఆధునీకరణ, విస్తరణ దశ ప్రారంభమైందని సిప్రి హెచ్చరించింది. ​
సైనిక వ్యయంలో అమెరికా అగ్రస్థానంలో ఉంది. 2025లో అమెరికా రక్షణ వ్యయం 954 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.82 లక్షల కోట్లు). ప్రపంచ మొత్తం సైనిక వ్యయంలో దాదాపు 33 శాతం అమెరికాదే. రెండో స్థానంలో ఉన్న చైనా 336 బిలియన్‌ డాలర్లు (రూ.29 లక్షల కోట్లు) ఖర్చు చేసింది. మూడో స్థానంలో ఉన్న రష్యా 190 బిలియన్‌ డాలర్లు (రూ.16.3 లక్షల కోట్లు), నాలుగో స్థానంలో జర్మనీ 114 బిలియన్‌ డాలర్లు (రూ.9.8 లక్షల కోట్లు), ఐదో స్థానంలో భారత్‌ 92.1 బిలియన్‌ డాలర్లు (రూ.7.9 లక్షల కోట్లు) ఖర్చు చేశాయి. ఈ ఐదు దేశాలే ప్రపంచ సైనిక వ్యయంలో 60 శాతానికి పైగా వాటాను కలిగి ఉన్నాయి. భారత్‌ రక్షణ వ్యయం ఒక్క ఏడాదిలో 8.9 శాతం పెరిగింది. చైనా వ్యయం 7 శాతం పెరిగింది. రష్యా వ్యయం ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా 38 శాతం పెరిగింది. జర్మనీ వ్యయం 28 శాతం పెరిగింది. పోలాండ్‌ వంటి దేశాలు కూడా 30 శాతానికి పైగా పెరుగుదలను నమోదు చేశాయి.

భద్రత పేరుతో భయం!

అమెరికా, చైనా, రష్యా, జర్మనీ, భారత్‌, పాకిస్థాన్‌ వంటి దేశాలు తమ భద్రత కోసం ఆయుధాలు సమకూర్చుకుంటున్నామని చెబుతున్నాయి. కానీ ఒక దేశం ఆయుధాలు పెంచుకుంటే ప్రత్యర్థి దేశం కూడా అదే చేస్తుంది. ఈ విధంగా భద్రత కోసం ప్రారంభమైన చర్యలు ఆయుధ పోటీగా మారుతున్నాయి. ఒక దేశం భద్రత కోసం కొన్న ఆయుధం, మరో దేశానికి భయంగా మారుతుంది. ఆ భయం మళ్లీ కొత్త ఆయుధాల కొనుగోలుకు దారి తీస్తుంది. ఈ పోటీలో సంప్రదాయ ఆయుధాలు మాత్రమే కాదు, అణ్వాయుధాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. అణ్వాయుధ నిల్వలను తగ్గించాల్సిన చోట వాటిని ఆధునీకరించడం, కొత్త వ్యవస్థలను అభివృద్ధి చేయడం ప్రపంచాన్ని మరింత ప్రమాదకర దిశగా నెడుతోందని సిప్రి హెచ్చరించింది. ఫలితంగా విద్య, ఆరోగ్యం, ఉపాధి, పేదరిక నిర్మూలన వంటి రంగాలకు వెళ్లాల్సిన ప్రజాధనం రక్షణ రంగానికి మళ్లుతోంది.

​ప్రపంచ పోలీసుగా అమెరికా

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా తనను తాను ప్రపంచ నాయకురాలిగా ప్రకటించుకుంది. కానీ అమెరికాకు ఆ బాధ్యతను ఎవరు అప్పగించారు? ప్రపంచ ప్రజలు కాదు. ఐక్యరాజ్యసమితి కాదు. తన ఆర్థిక, సైనిక శక్తిని ఆధారంగా చేసుకుని అమెరికా ఆ స్థానాన్ని ఆక్రమించింది. ప్రస్తుతం ప్రపంచంలోని 80కి పైగా దేశాల్లో అమెరికాకు 700కు పైగా సైనిక స్థావరాలు ఉన్నాయి. జర్మనీలో దాదాపు 35 వేల మంది, జపాన్‌లో 55 వేల మంది, దక్షిణ కొరియాలో 28 వేల మంది అమెరికా సైనికులు మోహరించి ఉన్నారు. బహ్రెయిన్‌, ఖతార్‌, కువైట్‌, సిరియా, ఇరాక్‌, జిబౌటి, ఇటలీ, బ్రిటన్‌, టర్కీ వంటి దేశాల్లో కూడా అమెరికా స్థావరాలు ఉన్నాయి. ఈ విదేశీ సైనిక వ్యవస్థ నిర్వహణకే అమెరికా ప్రతి ఏడాది 70 నుంచి 100 బిలియన్‌ డాలర్లు (రూ.6 నుంచి 8.5 లక్షల కోట్లు) ఖర్చు చేస్తోందని వివిధ అధ్యయనాలు సూచిస్తున్నాయి. ప్రపంచ వాణిజ్య మార్గాల భద్రత, ప్రజాస్వామ్య రక్షణ, అంతర్జాతీయ స్థిరత్వం పేరుతో ఈ వ్యవస్థను అమెరికా సమర్థించుకుంటోంది. కానీ ఇది భద్రతా వ్యవస్థ కాదు; ప్రపంచ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు నిర్మించిన సైనిక వలయం.

యుద్ధంలో ప్రజలు – లాభాల్లో కార్పొరేట్లు

ప్రపంచంలోని వంద అతి పెద్ద ఆయుధ కంపెనీల అమ్మకాలు 2024లో 679 బిలియన్‌ డాలర్లకు (రూ.58 లక్షల కోట్లకు పైగా) చేరాయి. ఇది 2023తో పోలిస్తే 5.9 శాతం పెరుగుదల. వీటిలో అమెరికా కంపెనీల వాటా 334 బిలియన్‌ డాలర్లు (రూ.28.7 లక్షల కోట్లు). ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ కంపెనీ లాక్‌హీడ్‌ మార్టిన్‌. దీని వార్షిక ఆయుధ విక్రయాలు 60 బిలియన్‌ డాలర్లకు (రూ.5.1 లక్షల కోట్లు) పైగా ఉన్నాయి. ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైన తర్వాత యూరప్‌ దేశాలు అమెరికా నుంచి భారీ ఎత్తున ఆయుధాలు కొనుగోలు చేశాయి. ఇజ్రాయిల్‌కు పంపుతున్న క్షిపణులు, వైమానిక రక్షణ వ్యవస్థలు, గాజా యుద్ధం నేపథ్యంలో జరిగిన ఆయుధ సరఫరాలు కూడా ఈ కంపెనీల ఆదాయాన్ని పెంచాయి. యుద్ధ భూముల్లో చనిపోయేవారు ప్రజలు. కానీ యుద్ధాలు ఎంత ఎక్కువ కాలం కొనసాగితే ఆయుధ కంపెనీల లాభాలు అంత పెరుగుతాయి. అందుకే ఈ వ్యవస్థలో యుద్ధాన్ని పొడిగించే ఆర్థిక ప్రయోజనాలు పని చేస్తున్నాయని విమర్శకులు చెబుతున్నారు. ప్రపంచ రాజకీయాలను అర్థం చేసుకోవాలంటే ఒక ప్రశ్నను మర్చిపోకూడదు – యుద్ధాలు ఎవరు చేస్తారు? లాభాలు ఎవరు తీసుకుంటారు?

​- సత్యాజీ
94900 99167

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్