భారతదేశం స్వాతంత్ర్యం పొంది 79 ఏళ్లు _పూర్తి చేసుకుని 80వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో సమకాలీన భారతదేశంలో జాతీయోద్యమ స్ఫూర్తిని మరోసారి భారత ప్రజలు ప్రదర్శించవలసిన _అవసరం ఏర్పడింది. 1947 ఆగస్టు 15న రాజకీయ స్వాతంత్య్రం పొందినప్పటికీ, ఆర్థిక- సామాజిక స్వాతంత్ర్యాలు సాధించవలసిన _లక్ష్యాలుగా ఉన్నాయి. పాలకుల ‘వికసిత్ భారత్ -2047’ వంటి ప్రచారాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయి. వరుసగా మూడోసారి 2024 లో ఏర్పడిన నరేంద్రమోడీ ప్రభుత్వం రాజ్యాంగ లక్ష్యాలను, ఆశయాలను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నది. ఇటీవల ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన జెన్ జీ ఉద్యమం యువతలో ఏర్పడిన నిరాశ, అసంతృప్తులను తెలుపుతున్నది.
రాజ్యాంగ లక్ష్యాలపైనే దాడి
భారత దేశంలోగల భిన్నత్వం, బహుళత్వాలకు అనుగుణంగా భారత రాజ్యాంగం రూపొందింది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ _నాయకత్వాన గల ముసాయిదా కమిటీ భారత రాజ్యాంగాన్ని సమున్నతంగా తీర్చిదిద్దింది. రాజ్యాంగ పీఠికలో రాజ్యాంగ లక్ష్యాలను వివరించారు. సమాఖ్య విధానం, లౌకిక వాదం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, న్యాయశాఖ స్వతంత్రత మొదలైన లక్ష్యాలతో రాజ్యాంగం కొనసాగాలని రాజ్యాంగ నిర్మాతలు ఆశించారు. నరేంద్రమోడీ ప్రభుత్వం రాజ్యాంగ ఫెడరల్ వ్యవస్థను దెబ్బతీస్తున్నది. మూడు రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల నల్లచట్టాలను తేవడం ఫెడరల్ వ్యవస్థకు పూర్తి విరుద్ధం. భారత రైతాంగం చారిత్రాత్మక రైతాంగ ఉద్యమం ద్వారా ఈ చట్టాలను తిప్పికొట్టింది. ప్రజలను మతతత్వ, హిందుత్వ విధానాలతో చీల్చే విధంగా విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. మైనార్టీలపై భిన్నమైన పద్ధతులలో దాడులు జరుగుతున్నాయి. ‘సర్’ వంటి పద్ధతుల ద్వారా మైనార్టీలు, దళితులు, వలస కార్మికులు మొదలైన వారి ఓట్లు వివిధ రాష్ట్రాల్లో కోట్ల సంఖ్యలో తొలగిస్తున్నారు.
భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తూ, ‘ఉపా’ వంటి చట్టాల ద్వారా వేలాదిమందిని విచారణ లేకుండా జైళ్లలో ఉంచుతున్నారు. ‘న్యూస్ క్లిక్’ _ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థను అన్యాయంగా అరెస్టు చేసి ఆరు నెలలకు పైగా జైలులో ఉంచారు. ఆయనపై పెట్టిన కేసులను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. పరిశోధక విద్యార్థి ఉమర్ ఖలీద్‌ను ఆరేళ్ల నుండి జైలులో ఉంచారు. ఆయనకు బెయిలు ఇవ్వకపోగా, ఇంతవరకు కేసు విచారణకు కూడా రాలేదు. దేశవ్యాపితంగా ఒక ‘అప్రకటిత ఎమర్జెన్సీ’ కొనసాగుతున్నదని కొందరు రాజకీయ, రాజ్యాంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఆర్థిక అసమానతలు
1991లో నయాఉదారవాద విధనాలు ప్రారంభించిన తరువాత ఆర్థిక అసమానతలు తీవ్రంగా పెరిగాయి. ప్రముఖ ఆర్థికవేత్త థామస్ పికెట్టి రూపొందించిన నివేదికలో ప్రపంచ ఆర్థిక అసమానతలతోపాటు భారతదేశ ఆర్థిక_అసమానతలను వివరించాడు. భారతదేశంలో 11 మంది సంపన్నుల చేతిలో 45 శాతం సంపద ఉన్నదని ఆక్స్‌ఫామ్ నివేదిక పేర్కొన్నది. పెరుగుతున్న అసమానతలు దేశ ప్రజల ఆర్థిక, సామాజిక జీవన ప్రమాణాలను దెబ్బతీస్తున్నాయి. 2014 నుండి మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు కార్పొరేట్ ప్రయోజనాలకు ఉపయోగపడుతూ గౌతమ్ అదానీ, అంబానీ వంటి వారు ఆస్తులు పెంచుకోవడానికి దోహదపడ్డాయి. ఎయిర్‌పోర్టులు, ఓడరేవులు, సోలార్ ప్రాజెక్టులు విద్యుత్ మొదలైన వాటిని కార్పొరేట్ సంస్థలకు ప్రత్యేకించి అదానీకి అప్పగిస్తున్నారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం, ఎల్ఐసి వంటి సంస్థలను ప్రైవేటు వారికి అప్పగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్థిక అసమానతలు నిరుద్యోగానికి, ద్రవ్యోల్బణానికి దారితీసి ప్రజలలో సామాజిక_అశాంతికి కారణమౌతున్నాయి.
మానవాభివృద్ధిలో వెనుకబాటు
ప్రపంచ మానవాభివృద్ధి నివేదిక ప్రకారం భారతదేశం మానవాభివృద్ధిలో 175 దేశాలలో 133వ స్థానంలో కొనసాగుత్నుది. ఆర్థిక సంస్కరణల తరువాత ఆరోగ్యం, _విద్య మొదలగు రంగాలు కార్పొరేటీకరణ చెందాయి. విద్యారంగంలో 50 శాతం ప్రైవేట్, కార్పొరేట్ శక్తుల చేతుల్లో కొనసాగుతున్నది. జాతీయ విద్యావిధానం -2020 విద్యారంగంపై కేంద్ర ఆధిపత్యానికి దారితీసి నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (ఎన్‌టిఎ) వంటి _సంస్థలు ఏర్పడ్డాయి. కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ _రావడానికి ప్రధాన కారణం విద్యావ్యవస్థలో తెచ్చిన కేంద్రీకరణ, వ్యాపారీకరణ విధానాలే. వైద్య-ఆరోగ్య రంగాలు పేద ప్రజలకు, గిరిజనులకు ఆరోగ్య సదుపాయాలు కల్పించడంలో వైఫల్యం చెందాయి. దేశంలో డ్రాప్అవుట్ రేటు గ్రామీణ ప్రాంతాలలో 20 శాతం వరకు ఉన్నది. డ్రాప్అవుట్ అవుతున్నవారిలో ఎక్కువమంది ఆడపిల్లలే. భారతీయ మహిళలలో పౌష్టికాహార కొరత వలన 46 శాతం మంది రక్తహీనత సమస్య _ఎదుర్కొంటున్నారు. థైరాయిడ్, బ్రెస్ట్ క్యాన్సర్ , మెంటల్ స్ట్రెస్ వంటి ఆరోగ్య సమస్యలు మహిళలల్లో పెరుగుతున్నాయి. మొత్తం శ్రామికులలో 37 శాతం మహిళలు, వ్యవసాయ పనులలో64 శాతం మహిళలు పనిచేస్తున్నా తగిన విధంగా వేతనాలు పొందడం లేదు. నూతన రంగమైన ‘గిగ్’ వర్కర్ల జీతభత్యాలు సంతృప్తికరంగా లేవు.
వ్యసాయరంగ సంక్షోభం
గత రెండు దశాబ్దాలుగా వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటుండగా, లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్ కమిషన్ నివేదికను అమలు చేయాలని ఎప్పటి నుండో భారత రైతాంగం కోరుతున్నది. గిట్టుబాటు ధరలు, పంటల బీమా, మార్కెటింగ్ మొదలైన వాటిలో రైతాంగం పూర్తిగా అన్యాయానికి గురైంది. వ్యవసాయానికి అవసరమైన సమగ్ర ఉత్పత్తి ఖర్చులను (సి2) లెక్కించి, దానికి యాభై శాతం అదనంగా రైతుకు మిగిలేలా వుండాలని (సి2 + 50) స్వామినాథన్ కమిషన్ పేర్కొంది. అది ఇంత వరకూ అమలు జరగలేదు. నరేంద్రమోడీ ప్రభుత్వం నూతనంగా అనేక రైతు వ్యతిరేక చట్టాలను (2025 మార్కెట్ నియంత్రణ చట్టం, సహకార చట్టం, విద్యుత్ సవరణ చట్టం, విత్తన చట్టం, ప్రకృతి వైపరీత్యాల చట్టం) తెస్తున్నది. ఇవి రైతులను కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తాయి. అమెరికా, బ్రిటన్‌లతో కుదుర్చుకున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ల వల్ల భారత వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోబోతున్నది. గ్రామీణ పేదలు, వ్యవసాయ కార్మికుల జీవించే హక్కును హరిస్తూ 2005 మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో విబి గ్రామ్‌జీ చట్టం 2025 తేవడం గ్రామీణ ఉపాధిని నాశనం చేయడమే. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్‌కోడ్లు కార్మికుల హక్కులను హరిస్తాయి.
సామాజిక తరగతులు
భారత రాజ్యాంగం సామాజిక న్యాయం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. రాజ్యాంగం ద్వారా దళితులు, గిరిజనులకు, వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు ప్రవేశ పెట్టింది. సామాజిక తరగతులు, మహిళల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు చేపట్టాలని ఆదేశించింది. కానీ 80 ఏళ్ల తరువాత కూడా ఆశించిన అభివృద్ధి జరగలేదు. దళితులు, మైనార్టీలపై దాడులు కొనసాగుతున్నాయి. వారి కోసం చేసిన అనేక చట్టాలు సక్రమంగా అమలు జరగడం లేదు. జాతీయ అటవీహక్కులు వంటి చట్టాలు సక్రమంగా అమలు జరగడం లేదు. మహిళల ప్రాతినిధ్యం గత 18 లోక్‌సభల్లో 15 శాతం మించలేదు. వివిధ రాష్ట్రాల శాసన సభల్లో కూడా పరిస్థితి భిన్నంగా లేదు. అనేక ఉద్యమాల ఫలితంగా 2023లో 106వ రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకు 1/3వంతు రిజర్వేషన్లు చట్టం ఆమోదించినప్పటికీ 2024 ఎన్నికలలో అమలు జరపలేదు. ఇప్పుడు మళ్లీ కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో ముడి పెట్టడానికి ప్రయత్నిస్తున్నది. పై ఆంశాలను పరిశీలిస్తే దేశ ఆర్థిక, సామాజిక స్వాతంత్ర్య ప్రాముఖ్యత అర్థం అవుతుంది. వందేళ్ల పాటు జరిగిన జాతీయోద్యమంలో కోట్లాదిమంది ప్రజలు పాల్గొన్నారు. బలిదానాలు, ప్రాణత్యాగాలు చేస్తూ, ఉరితీతలను లెక్కచేయకుండా ఉద్యమాల్లో పాల్గొన్నారు. లక్షలాదిమంది జైళ్లకు వెళ్లారు. ఈ మహోద్యమంలో జాతీయ కాంగ్రెస్‌తో పాటు విప్లవకారులు, గిరిజన నాయకులు, రైతాంగ ఉద్యమ నేతలు మొదలైన వారంతా భాగస్వాములయ్యారు. ఆర్థిక, సామాజిక, స్వాతంత్ర్య సాధనకు, మరో స్వాతంత్ర్య పోరాటానికి సిద్ధం కావాలి.

వ్యాసకర్త: కె.ఎస్. లక్ష్మణరావు
మాజీ ఎమ్మెల్సీ, సెల్: 8309965083/








కామెంట్‌లు (0)