జెన్ జీ, ఇండియా వేదిక, వామపక్షాలూ ఓటు హక్కు రక్షణ కోసం లేదా ఓటు హక్కు సామూహిక హరింపును అడ్డుకోవడం కోసం సాగిస్తున్న మహోద్యమం పతాక స్థాయికి చేరింది. సరిగ్గా ఈ కారణంతోనే దానిపైన దాడి కూడా పరాకాష్టకు చేరడం కూడా ఊహించదగిందే. ఒకవైపున నిరసనకారులపై దుష్ర్పచారాలూ మరోవైపున ఉద్యమాలపై నిర్బంధాలూ చాలవన్నట్టు మీడియా ద్వారా భయానక విష ప్రచారం పెంచడం ఇందులో భాగమే, విదేశీ నిధులతో సర్కారును కూలదోయడమే ఈ ఉద్యమ లక్ష్యమైనట్టు అతి హేయమైన ప్రచారాలకు పాల్పడటం జుగుప్సాకరంగా సాగుతున్నది. మరోవంక తమ నిర్బంధాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ప్రతిపక్ష నాయకులే ఏదో మహిళా పోలీసుల పట్ల, పాత్రికేయుల పట్ల తప్పుగా ప్రవర్తించారని చవకబారు కథనాలు వండివార్చబడు తున్నాయి. దేశంలో నిరసనలను కాలరాయాలనుకుంటే లండన్ న్యూయార్క్‌తో సహా విదేశాలలోనూ ఈ ఆందోళన ప్రతిధ్వనులు విస్తరించడం విశేషం. కొద్ది రోజుల వ్యవధిలోనే మోడీ సర్కారు బహుముఖ దాడులను అధిగమించి ఈ ఉద్యమం ఉధృతం కావడం దాని సత్తాకు మాత్రమే గాక అది చాటుతున్న సత్యానికి కూడా అద్దం పడుతుంది. సత్యాన్ని తొక్కిపట్టడం, దాన్ని బయటపెట్టాలనుకునేవారిని అణగదొక్కడం కూడా అంత తేలిక కాదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
చట్టసభల నిర్వాకం
తక్షకుడనే సర్పరాజును సంహరించడం కోసం పురాణాలలో రుషులు సర్పయాగం చేస్తారు. తక్షకుడు ఇంద్రుడిని ఆశ్రయిస్తే రుషులు సహేంద్ర తక్షకాయ స్వాహా అంటారు. ఇంద్రుడితో సహా తక్షకుడు హోమగుండంలో పడాలని దాని అర్థం. సిఇసి జ్ఞానేష్ కుమార్‌ను కాపాడేందుకు ప్రధానమంత్రి మోడీ తన సింహాసనానికే ఎసరు తెచ్చుకుంటారని ఆయన అనుయాయులు ఆందోళన చెందుతున్న పరిస్థితి అలాంటిదే. 2023లో చట్టాన్ని మార్చి మరీ కోరిన సిఇసి ని నియమించుకోవడం ఇందులో మొదటి అడుగైతే ఆ పథకం మొత్తం బహిర్గతం కావడం తాజా కలకలం. 2023లో సిఇసి నియామకంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో నియమాక కమిటీలో కేవలం కేంద్రానికే ఆధిక్యత వుండరాదని స్పష్టం చేసింది. ఒకవేళ ప్రధాన న్యాయమూర్తి కూడా వుండాలన్న నిబంధనను పార్లమెంటు చట్టంతో తోసిపుచ్చారనుకున్నా ఆధిక్యత ఎవరికిచ్చారనేది సమస్యగానే వుంటుంది. ప్రధాని, ఆయన ఎంచుకున్న మరో మంత్రి, ఆ పైన పెద్ద ప్రతిపక్ష నేత వుంటారని 2023 చట్టం చెబుతుంది. అంటే ఆధిక్యత విషయంలో కోర్టు స్పష్టమైన నిర్దేశాన్ని తోసిపుచ్చడమే. నియామక సమయంలో ఒకో పదవికి మూడు పేర్లు సూచించడంతో పాటు వారి పూర్వాపరాల వివరాలు పొందుపర్చాలన్నది కూడా విస్మరించారని జ్ఞానేష్ పై కేసులను దాచిపెట్టడం ద్వారా తేలిపోయింది. కనక ఏకగ్రీవంగా గానీ, మెజారిటీతో గానీ మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలన్న సూచనను కూడా సిఇసి జ్ఞానేష్ పాటించలేదని రుజువైంది. ఈ మూడూ సిఇసిని పూర్తిగా ఇరకాటంలో పెట్టాయి. అందుకే ‘సర్’ను సమర్థించుకుంటున్నట్టు చెబుతూనే మరోవైపున చాటుమాటుగా ఎస్ఎస్ఆర్ అనే (సత్వర ప్రత్యేక పరిశీలన)కు ఇప్పుడు ఉత్తర్వులిచ్చారు. ఈ విధంగా తమ తప్పును ఒప్పుకుంటూ చెంపలేసుకున్నారు. అయితే ఈ చర్యలు ఏమాత్రం చాలవని తొలగించిన కోట్ల ఓట్లను పునరుద్ధరించడం దీనివల్ల జరిగేపని కాదని కూడా పార్టీలూ మీడియా వ్యాఖ్యానాలు వచ్చాయి. కనుక సిఇసి ని ఇంటికి పంపి సమగ్ర ప్రక్షాళన చేయడం అనివార్యం. అయితే జ్ఞానేష్‌ను తప్పిస్తే గత రెండేళ్లుగా ఆయన హయాంలో జరిగిన నిర్వాకాలతో పాటు పాలక పక్షం కుట్ర బయటపడుతుందనేది అసలు భయం. ఆ విధంగా పాలకులే కోర్టు ఉత్తర్వులను, రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడానికి తోడైనారని రుజువైతే సర్కారును మరెవరో కూల్చడంగాక తామే నిష్క్రమించడం అనివార్యమవుతుంది. అందుకే ఇ.సి నుంచి ఎవరూ జ్ఞానేష్‌ను సమర్థించడం లేదు. హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వంటి వారు మాత్రం ఆయన తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడటానికి కారణమదే. తమను కూల్చడానికి కుట్ర అంటున్నప్పుడు తమకు పూర్తి మెజార్టీ లేదనే వాస్తవం కూడా వారిని కొంత భయపెడుతుండవచ్చు.
న్యాయవ్యవస్థ-సుప్రీంకోర్టు
ఇప్పుడు మనం న్యాయవ్యవస్థ దగ్గరకొద్దాం. అసలు ఈ సమస్య ఇంతవరకూ రావడానికి సుప్రీంకోర్టు ‘సర్’ కేసుల పైన, సిఇసి నియామక చట్టం చెల్లుబాటు పైన విచారణ జరపడంలో చేసిన జాప్యమే కారణమన్న అభిప్రాయం బలంగా వుంది. అది కూడా సాక్షాత్తూ న్యాయమూర్తులుగా పనిచేసిన, చేస్తున్న వారి నుంచే రావడం మరింత విశేషం, ప్రస్తుత సిజెఐ సూర్యకాంత్ రాకను వ్యతిరేకించిన నల్సార్ విద్యార్థులను అదే సంస్థ వేదిక పైనుంచి అభినందించిన ప్రస్తుత న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ కోట్ల ఓట్లు ఇష్టానుసారం తీసిపారేయడానికి రాజ్యాంగం ఒప్పుకోదని ప్రకటించడం సంచలనం కలిగించింది. ఇలా అన్నందుకు ఆయనపై కొంతమంది మాజీ న్యాయమూర్తులు దాడి చేస్తే ఒక మాజీ ప్రధాన న్యాయమూర్తితో సహా పలువురు సమర్థించారు. రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును తొలగించడం తప్పని చెప్పడం ఏ విధంగానూ తప్పు కాదన్నారు. ఈ కేసులో మార్గదర్శకంగా పరిగణిస్తున్న 2023 అనూప్ బనర్వాల్ కేసులో వాదించిన కాళీశ్వరం రాజ్ స్వయంగా ఈ మేరకు వ్యాసం రాస్తూ సిఇసి నియామకంపై కొత్త చట్టం చెల్లదని కోర్టు తనే ప్రకటించి వుంటే పరిస్థితి ఇంతవరకూ వచ్చేది కాదన్నారు. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనంలో చెరొక తీర్పునిచ్చారనే పేరిట దాన్ని సిజెఐ తుది నిర్ణయానికి నివేదించారు. అయితే ఇందులో జస్టిస్ దత్తా మరోసారి పరిశీలన అవసరం లేదని కొట్టివేయాలని భావించారు. జస్టిస్ శర్మ మాత్రం మరింత పెద్ద ధర్మాసనానికి పంపించాలనడంతో సిజెఐ కి పంపారు. అయితే ఆ జస్టిస్ శర్మ కుమారుడు సిద్ధార్థ శర్మ ఎన్నికల సంఘం తరపున వాదించిన న్యాయవాది అని తర్వాత బయటపడింది. ఇలాంటి సందర్భాల్లో జడ్జిలు మర్యాదగా పక్కన కూర్చుంటారు (రెక్యూజ్). కానీ జస్టిస్ శర్మ ఆ పని చేయకపోవడం వల్లనే ఇది విభజిత తీర్పుగా సిజెఐ ముందుకు వెళ్లింది. విచారణ ఆలస్యమవుతున్నది. ఇక ‘సర్’ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమనే విషయంలోనూ కోర్టు సకాలంలో తీర్పునివ్వకుండా సాంకేతికంగా అనుమతించినట్టు చేసింది. అంతా అయిపోయాక ఇప్పుడు ‘ఫారం 6’లో మార్పులకు తమ ఆమోదం లేదా అనామోదం రెండూ లేవని సన్నాయి నొక్కులు నొక్కుతున్నది. ఈ లోగా ఇ.సి పారదర్శకత పాటించకుండా లోపాయికారిగా దిద్దుకోవడానికి అవకాశమిస్తున్నది. ఇదే సమయంలో ‘సర్’ను ఉపసంహరించాలని కోరిన న్యాయవాదులపైన కూడా భద్రతా బలగాలు దౌర్జన్యం చేయడం, అడ్డుకోవడం వంటివాటిని విచారించడంలోనూ జాప్యం చేస్తున్నది. ఎంతో పోరాటం తర్వాత ప్రతిపక్షాలు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించి సిఇసి కి నోటీసు నిస్తూనే అంతమాత్రాన తప్పు చేసినట్టు కాదని సిజెఐ వ్యాఖ్యానించడం ఆశ్చర్యం కలిగించింది. ప్రతిపక్షాల విమర్శల విషయంలో మాత్రం ఎవరూ తమను లొంగదీయలేరని తీవ్ర భాషలో హెచ్చరికలు చేశారు. విచారణలోనూ స్పందనలోనూ కూడా అత్యున్నత న్యాయస్థానం ఇస్తున్న సంకేతాలు ఈ మాటలతోనే అందరికీ అర్థమైనాయి. సిసి టివి ఫుటేజి భద్రపరచడంలో వైఫల్యాన్ని కూడా ఈ తరుణంలోనే కోర్టు తప్పు పట్టింది. ముంబాయి కర్ణాటక, బెంగాల్, ఢిల్లీ సహా పలు హైకోర్టులు కూడా ఈ తరుణంలోనే ఓట్ల తొలగింపుపై త్రీవ వ్యాఖ్యలు చేసి దిద్దుబాటుకు ఆదేశాలిచ్చాయి.
కార్యనిర్వాహక వర్గం
ఇక కార్యనిర్వాహక వర్గం విషయంలోనూ ఇదే తంతు. రాజును మించిన రాజభక్తుల్లా పోలీసులు, ఉన్నతాధికారులు నిరసనలను అణచివేయడంలో అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇది ఎంత దూరం పోయిందంటే ఈ విషయంలో హైకోర్టులు సుప్రీంకోర్టు ఇచ్చిన కనీస ఆదేశాలను కూడా వారు గౌరవించలేదు. ఢిల్లీలో నిరసనల నిషేధానికి సబంధించి బిఎన్ఎస్ 163 కింద అధికారులు తీసుకున్న నిర్బంధ చర్యలకు ఆధారమైన ఉత్తర్వులేమిటో తమకు తెలియదని స్రుపీంకోర్టు న్యాయమూర్తి జోయ్మాల్యా బాగ్చీ సూటిగానే ప్రకటించారు. వాటిని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాల సంఘాల తరపున న్యాయవాదులు మాట్లాడటం దయ్యంతో మాట్లాడినట్టే వుందని అపహాస్యం చేశారు. న్యాయవ్యవస్థ పాత్ర ఎంతగా విస్మరించబడిందో అర్థం కావడానికి ఈ ఉదంతం చాలు. గతంలో పౌరసత్వ సవరణ నిబంధనలతో సహా చాలా విషయాల్లో ఇలాగే మోడీ సర్కారు దాగుడుమూతలాడింది. పాలనా ప్రకటనలు రాజకీయ విధానాలు తీసుకుంటూ రాజ్యాంగ పరిధిలో వాటి స్థానాన్ని చూపకపోవడం కేంద్రం తప్పిదమైతే వాటిని సకాలంలో నిలదీయకపోవడం న్యాయవ్యవస్థ పాత్ర కిందకు వస్తుంది. అయితే సిజెఐని ఉద్దేశించి కొందరు రాజకీయ నాయకులు వ్యాఖ్యాతలు చేసిన విమర్శలపై మాత్రం శరవేగంగా స్పందించడం ఇక్కడ గమనించదగింది.
మేడిపండు మీడియా
రాజ్యాంగ పరంగా కాకున్నా ఆచరణలో మీడియాను నాలుగో స్తంభం అంటుంటారు. ‘సర్’ ఆందోళన ముందు వెనక కూడా బడా మీడియా, అలాగే పాలక కూటమి పెంచి పోషించే సోషల్ మీడియా బృందాలు తమ మేడిపండు రూపాన్ని బయటపెట్టుకున్నాయి. మొదట్లోనైతే ఇవన్నీ ఎవరూ పట్టించుకోరన్నట్టు చులకనగా వ్యవహరించాయి. నీట్‌పై ఆందోళన సమయంలో ఇచ్చిన కవరేజి కూడా ఇవ్వలేదు. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఈ పరిశోధనతో బయటికి వచ్చిన మాట నిజమే అయినా తర్వాత కూడా అరకొరగా అదే సమయంలో అర్థసత్యాలు, అసత్యారోపణలతో నడిపించాయి. తెలుగులోనూ ఈ తేడా మనం చూడొచ్చు. ప్రధాన మీడియా ఒకటైతే సోషల్ మీడియాలో పెద్ద సైన్యమే మోడీ భజన కోసం పనిచేస్తున్నది. విమర్శకులపై విషం కక్కుతున్నది. జాతీయంగా ఆర్మాన్ గోస్వామి రిపబ్లిక్ టీవీ వంటివి అచ్చంగా అదే పనిలో వున్నాయి. వీరే తాజాగా నేహా బోరా, ప్రశాంత్ భూషణ్, ప్రకాశ్ రాజ్‌ల మాటలను వక్రీకరించి గోరంతను కొండంతలు చేస్తున్నారు. బంగ్లాదేశ్‌లో యువత మొదట హసీనా నిరంకుశత్వంపై పోరాడటం నిజం. తర్వాత అది దారి తప్పిందంటే దానికి ఆ యువత బాధ్యతేముంటుంది? అలాగే ప్రభుత్వ మార్పు (రిజిమ్ ఛేంజ్) అంటే తప్పేమిటని ప్రశాంత్ భూషణ్ మాటను కూడా దాంతో ముడి పెట్టి తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. నేహా బోరా, ప్రశాంత్ భూషణ్ మాటలతో మాకు సంబంధం లేదని అభిజిత్ దీప్కే విడగొట్టుకున్నారు. తాము జ్ఞానేశ్ రాజీనామా మాత్రమే కోరుతున్నామని యోగేంద్ర యాదవ్ ముందే రాశారు. అయితే ఇవన్నీ ఎన్ని చేసినా మోడీ గుజరాత్ ఏకపక్ష నమూనా దేశాన్ని శాశ్వతంగా శాసించజాలదని తాజాగా రాజ్‌దీప్ సర్దేశాయ్ వంటి వారే రాయడం గమనించదగ్గది. ఈ పరిణామాలన్నీ ఎలాంటి మలుపులు తిరుగుతాయో త్వరలోనే తెలిసిపోతుంది.







కామెంట్లు (0)