శుక్రవారం, 25 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రాంతీయ అసమానతలతో సమగ్రాభివృద్ధికి గండి!

21 గంటల క్రితం

migrants
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 05:15 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

బ్రిటీష్ వలస పాలన కానీ...స్వాతంత్య్రానంతరం వచ్చిన పాలకుల నిర్లక్ష్యం, చిన్నచూపు వలన కానీ...ఇన్నేళ్లు గడచినా అవశేష ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ అసమానతలు ఇంకా వికటాట్టహాసం చేస్తున్నాయి. ఏ పార్టీ అధికారం సాగించినా అన్ని రంగాల్లో వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలు నిత్య క్షామ పీడిత ప్రాంతమైన రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గణనీయమైన భాగం ఇతర అభివృద్ధి చెందిన ప్రాంతాలతో సమానంగా పురోగతి సాధించలేదు. ఈ అగాధం నిర్మూలనకు ప్రత్యేక పథకాలు కృషి అమలు జరిగిన జాడ లేదు. అధికారంలోనకి వచ్చిన పార్టీలు తమ రాజకీయ మనుగడకు ప్రయోజనాలకు అనుగుణమైన లేక ఓటు బ్యాంకు విధానాలను అమలు జరిపారు. ఈ నాటికీ ఇదే కొనసాగుతోంది.

అయిదారు వందల మిల్లీమీటర్ల సగటు వర్షపాతంగల రాయలసీమ 1200 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతంగల శ్రీకాకుళం జిల్లా రెండూ ఒకే గాటన వున్నాయి. రెండు ప్రాంతాలకు వలస బతుకులు నేటికీ తప్పడం లేదు. ఇందుకు బాధ్యులెవరు? నేరస్తులెవరు? ఈ మధ్య ఉత్తరాంధ్రకు రెక్కలు వచ్చాయని హోరెత్తించారు. ఎవరికి రెక్కలు వచ్చాయి? లక్షలాదిగాగల రైతులకు నిత్యం అయిదేళ్లు నోట్లోకి పోవాలంటే రెక్కలు ముక్కలు చేసుకోవలసినదే. రైతుల రెక్కలు సురక్షితంగా వుండాలంటే నేరడి బ్యారేజీ నిర్మాణం, కాట్రగడ వద్ద సైడ్ వియర్ వంశధార నాగావళి అనుసంధానం, హీర మండలం జలాశయం నీటిని నారాయణపురం డ్యామ్‌కు తరలించడం. ఇవన్నీ కాగితాల పైనే వున్నాయి. పారిశ్రామికవేత్తలకు రాజకీయ నాయకులకు ‌మాత్రం రెక్కలు వచ్చాయి.

ఇక ప్రధానంగా రాయలసీమవాసుల ఆకాంక్షలు, ఆశలు, మనోభావాలకు భిన్నంగా ఒకరు బటన్ నొక్కి అధికారం దిగిపోతే ప్రస్తుతం మరొకరు భూమి నుండి రైతును దూరం చేయడమే కాకుండా పాతిక ముప్పయి సంవత్సరాల తర్వాత అభివృద్ధి వస్తుందని, అమరావతి కనక వర్షం కురిపిస్తుందని అద్దంలో మాయాలోకం చూపిస్తున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సైబరాబాద్ అనే సిటీనే నిర్మించానని ఘన కీర్తి చాటుకొంటున్న నేత అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ఒక సిటీని అభివృద్ధి చేసి వుంటే ఇన్ని వివాదాల మధ్య అమరావతిని నిర్మించవలసిన అవసరం వుండేది కాదు. రేపు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏమౌతుందో? సంపద అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతమైతే ప్రాంతీయ అసమానతలు పెరిగి కష్టనష్టాలు కళ్ల ముందు వున్నా పట్టించుకోకపోవడమే నేటి విషాదం.

కూటమి ప్రభుత్వం వచ్చి రెండన్నర ఏళ్లు గడిచిపోయింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మేల్కొన్నట్లుంది. 35 ప్రాజెక్టులను 35 వేల కోట్లతో పూర్తి చేస్తామని చెబుతున్నారు. రాయలసీమలో ఎవరూ నమ్మడం లేదు. రెండున్నర ఏళ్ల కాలం ప్రచారం కోసం ఆచరణకు సాధ్యం కాని బనకచర్ల అనుసంధానం గురించి ఊదర గొట్టారు. అది అడ్డం తిరిగిన తర్వాత 35 ప్రాజెక్టులు తెర మీదకు వచ్చాయి. నష్ట నివారణ చర్యగా యుద్ధ ప్రాతిపదికన వెలిగొండ ప్రాజెక్టు పట్టాలకెక్కించారు. అది కూడా ఇప్పటికీ పొత్తిళ్లల్లో బిడ్డ. ఈ క్రతువులో నిర్వాసితులు బలిపశువులైనారు.

రాయలసీమలో ప్రవహించే పెన్నా నదిపై గండికోట భారీ ప్రాజెక్టు మినహాయిస్తే నాలుగైదు ప్రాజెక్టులే వున్నాయి. ఉప నదులైన చిత్రావతి, కుందూ వర్షం పడితే బాగానే వరద నీళ్లు తెస్తాయి. నేడు పెన్నా నదిపై వున్న అన్ని ప్రాజెక్టులు శిథిలావస్థకు చేరాయి. గత సంవత్సరం పెన్నా నది నుండి వెళ్లిన వరద సోమశిల జలాశయం 68 టియంసి లు నింపి రెండు వందల టియంసి లు సముద్రంలో కలిశాయి. కొత్త ప్రాజెక్టులు కాదు. శిథిలావస్థకు చేరిన పాత ప్రాజెక్టులు మరమ్మతులు చేసి వుంటే ఈ నీళ్లు సోమశిల నుండి సముద్రం పాలయ్యేటివి కావు.

ఈ మహా పాపం రాయలసీమ రైతులు చేసుకొన్నారా? లేక ప్రభుత్వ నిర్లక్ష్యమా? ఈ రోజు పెన్నా పరివాహక ప్రాంతంలోనే కాకుండా రాయలసీమ మొత్తంగా ప్రధానంగా అనంతపురం, కడప, కర్నూలు ఉమ్మడి జిల్లాలో సాగైన కొద్ది పాటి పంటలు వాడు మొహం పడినట్లు చెబుతున్నారు.

మొదలే రాయలసీమ దుర్భిక్ష ప్రాంతం. గోరు చుట్టుపై రోకటి పోటు లాగా ఎల్-నినో ప్రభావంతో కొద్దిపాటి పంటలు ఎండిపోతున్నాయి. సాగునీటి గురించి కాకుండా ఎక్కువ ప్రాంతాల్లో తాగునీటికి వెంపర్లాడుతున్నారు. భూగర్భ జలాలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో 30 నుండి 35 అడుగులకు పడి పోయినట్టు ప్రభుత్వం గణాంకాలే చెబుతున్నాయి. తుదకు మధ్యతరగతి రైతుల చేతిలో కూడా చిల్లిగవ్వ వుండటం లేదు. రాష్ట్రంలో కరవు ప్రాంతాలను ప్రకటించవచ్చు. రాయలసీమను కూడా ఒకే గాటన కట్టకుండా ప్రత్యేక చర్యలు చేపట్టకపోతే ప్రమాదకర పరిస్థితులు ప్రభుత్వం ఎదుర్కొనవలసి ఉంటుంది.

మరోవైపు వెనుకబడిన ప్రాంతాలకు రాష్ట్ర విభజన చట్టం నిర్దేశించిన రాయితీలు, నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం నుండి రాబట్టలేకపోయారు. మాకు నీళ్లు ఇవ్వండి, మా కండ బలంతో బంగారం పండిస్తామని రాయలసీమ జనం వాపోతుంటే కార్పొరేట్ సంస్థలకు భూములు ఇవ్వండని వారిచ్చే డబ్బులు ఒకటి రెండేళ్లలో హారతి కర్పూరమైతే బికారులు కండని రాష్ట్ర ప్రభుత్వం పీకల మీద కూర్చొంటోంది. భూములు ఇచ్చేందుకు నిరాకరించిన గ్రామస్తులపై పోలీస్ జులుం ప్రయోగిస్తున్నారు.

రాష్ట్ర విభజన తర్వాత రాజధాని కూడా లేకుండా ఆర్థికంగా వెనుకబడిన ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి సాధించేందుకు ప్రత్యేక గ్రాంట్లు, పథకాలు మంజూరు చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరే నేతలు... రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలు అభివృద్ధి చెందిన జిల్లాలతో సమానంగా అభివృద్ధి చెందేందుకు బడ్జెట్ లో ప్రత్యేక పథకాలు మంజూరు చేసిన సందర్భం లేదు. ఈ ఒక్క అంశంలోనే వెనుక బడిన ప్రాంతాల ఎడల వీరి నిబద్ధత, నిజాయితీ వెల్లడౌతోంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ ప్రతి ఇంటి నుండి ఒక మహిళ పారిశ్రామికవేత్త కావాలని చెబుతుంటారు. ఆర్థిక, సామాజిక జీవనంలోనూ విద్యాపరంగానూ ఆహార్య ఆహార అలవాట్లలో వెనుకబడిన రాయలసీమ గ్రామీణ మహిళల దినకృత్యం తెల్లవారింది మొదలు ఎంత కఠోరంగా వుంటుందో ముఖ్యమంత్రికి తెలియదనుకోగలమా?

శ్రీకాకుళం జిల్లా ఎక్కడ? తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఎక్కడ? శ్రీకాళహస్తిలో వరి నాట్లకు గత సంవత్సరం శ్రీకాకుళం జిల్లా నుండి మహిళలు ఉపాధి వెతుక్కుంటూ వచ్చారు. కూటమి ప్రభుత్వ పాలనలో గత సంక్రాంతి నాటి రోజులు జ్ఞప్తికి తెచ్చుకొంటే కోస్తా జిల్లాల్లో కోడి పందేలకు ఏర్పాటు చేసిన బరులు, దానితో పాటు క్యాజినోలను తలపించే గుంజాట, జూదం లక్షలు కోల్పోయి బికారులైన యువత, ఏరులై పారిన మద్యం ఇత్యాది "సంక్రాంతి సంబరాలు" (ఎమ్మెల్యేలు పెట్టుకున్న ముద్దు పేరు) రాయలసీమ జిల్లాల్లో కలికానికైనా కనిపించాయా? ఈ ప్రాంతీయ అసమానతలు వున్నంత వరకు రాష్ట్ర సమగ్రాభివృద్ధి ఎండమావుల్లో నీటిని వెతకడమే.


శంకరయ్య

- వ్యాసకర్త: వి. శంకరయ్య

విశ్రాంత పాత్రికేయుడు


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్