ఆదివారం, 20 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గ్రామ సభలు, గిరిజన భూ సమస్యలపై ప్రమాదకరమైన వెనకడుగు

11 సెప్టెంబర్, 2026

forest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 12, 2026, 04:15 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

అటవీ హక్కుల చట్టం (ఎఫ్.ఆర్.ఎ) ద్వారా సంక్రమించిన చట్టపరమైన రక్షణలను బలహీనపరిచేందుకు భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను గిరిజన సంఘాలు తమ ఉనికికే ప్రమాదంగా గుర్తించాలి. ఎఫ్.ఆర్.ఎ చట్టం ఆశయానికి భిన్నంగా, ఒక ప్రాజెక్ట్ వల్ల ప్రభావితమయ్యే 'అన్ని' గ్రామ సభల సమ్మతికి బదులు 'మెజారిటీ' గ్రామ సభల సమ్మతి ఉంటే సరిపోతుందని ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ (సిఒపియు) చేసిన సూచన రాబోయే చట్టపరమైన మార్పునకు సంకేతంగా నిలుస్తోంది.

ప్రభావితమైన గ్రామ సభలలో 70-75 శాతం సమ్మతి ఉంటే సరిపోతుందని భావించే నిబంధన అమల్లోకి వస్తే...అది గ్రామ సభలను, అక్కడి నివాసితుల రాజ్యాంగ హక్కులను పరిరక్షించే ప్రజాస్వామ్య వ్యవస్థల స్థాయి నుండి కార్పొరేట్ వాటాదారుల స్థాయికి దిగజార్చుతుంది. ఈ నిబంధన అమల్లోకి వస్తే, ప్రాజెక్ట్ డెవలపర్లు ప్రతిపాదిత రిజర్వాయర్ పరిధిలోనే నేరుగా మునిగిపోయే గ్రామం సమ్మతిని దాటవేస్తూ... తక్కువ ప్రభావం ఉన్న ఇతర గ్రామాల నుండి నిరభ్యంతర ధృవీకరణ పత్రాలను సేకరించే అవకాశం ఏర్పడుతుంది.

గిరిజన ‌సమాజాలలో ఎవరిని సభ్యులుగా పరిగణించాలి అనే అంశంపై జరుగుతున్న రాజకీయ పోరాటంతో కూడా ఇది సంబంధం కలిగివుంది. ఒక సమాజంలో సభ్యులుగా అర్హత పొందే వారి జనాభా నిర్మాణాన్ని మార్చడం ద్వారా, ప్రభుత్వం ఒక గ్రామ సభను విభజించి తమకు అనుకూలంగా సమ్మతిని పొందడం సులభమవుతుంది.

ఈ అంశం తన పరిధిలో లేదని గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిరాకరించడం మూలంగా ప్రమాదకరమైన నియంత్రణ శూన్యత ఏర్పడుతోంది. ఇది అటవీ భూములను ఇతర అవసరాలకు మళ్లించే నిబంధనలను తమకు తోచినట్లు తిరగరాయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అడ్డులేకుండా చేస్తోంది. ప్రతి ప్రభావిత గ్రామ సభ నుండి నిరభ్యంతర ధృవీకరణ పత్రం తప్పనిసరి అని ఎఫ్.ఆర్.ఎ స్పష్టంగా పేర్కొననప్పటికీ, గ్రామ సభ నిర్ణయాలను దాటవేయవచ్చనే చట్టపరమైన వెసులుబాటు ప్రస్తుతం ఉందనడం సరికాదు.

ఆర్థిక లక్ష్యాలను సాధించడం కోసం ప్రభుత్వం నిలిచిపోయిన 'తీస్తా-IV' ప్రాజెక్టుతో సహా పలు ఇంధన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగంగా విస్తరిస్తోంది. కానీ ఎఫ్.ఆర్.ఎ లో గ్రామసభ ఆమోద నిబంధన అసలు అవసరమే లేదన్న ధోరణితో ప్రభుత్వం వ్యవహరించడం సముచితం కాదు.

పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లాలనుకుంటే, సంబంధిత నిబంధనలను లేదా చట్టాలను బహిరంగంగా , ప్రజాస్వామ్యయుతంగా సవరించాలి. ఎఫ్.ఆర్.ఎ, తదితర పర్యావరణ మంత్రిత్వ శాఖ నిబంధనల మధ్య ఉన్న సాంకేతిక అంశాలను సాకుగా చూపి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన బాధ్యతల నుండి తప్పుకోవడం కూడా సరైనది కాదు. ఈ రకమైన వ్యూహాలు అటవీ ఆధారిత సమాజాల అత్యంత శక్తివంతమైన చట్టపరమైన రక్షణ ఆయుధాన్ని నిర్వీర్యం చేస్తాయి.

ఈ వర్గాల జీవనోపాధి, సంస్కృతి, గుర్తింపు , రాజకీయ స్వయంప్రతిపత్తికి భూమే పునాది. అందుకే వారు తరతరాలుగా విస్థాపనకు, భూములను కోల్పోకుండా నిరోధించడానికి, తమ సంప్రదాయ ఉమ్మడి యాజమాన్య హక్కులను కాపాడుకోవడానికి పోరాడుతున్నారు.

భారతదేశంలో గిరిజన తెగల సమాజాలు అందిస్తున్న సామాజిక, పర్యావరణ సేవలను, దేశ శీతోష్ణస్థితి లక్ష్యాలను సాధించడంలో వారి సహకారం, జాతీయ అభివృద్ధికి వారు చేస్తున్న సేవలను గుర్తించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు షెడ్యూల్డ్ ప్రాంతాలలోని గ్రామ సభలకు భూ సేకరణ, పునరావాస చట్టం, పెసా చట్టం ద్వారా లభించిన అధికారాలను మరింత బలోపేతం చేయాలి. గిరిజన భూములకు సంబంధించిన అంశాలపై గ్రామ సభలకు 'వీటో' అధికారం ఉండాలి.

__( ‘హిందూ’ సంపాదకీయం)

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్