శనివారం, 08 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కార్పొరేట్‌ కైంకర్యానికి ‘గేట్‌ వే’!

6 గంటల క్రితం

sasa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 08, 2026, 04:30 పూర్వాహ్నం | 5 నిమిషాల చదవడం

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం సందర్భంగా టిడిపి, జనసేన, బిజెపి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ముందస్తు కార్పొరేట్‌ వ్యూహంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ ప్రచారం చేశాయి. కేంద్ర బిజెపి, రాష్ట్ర టిడిపి కూటమి ప్రభుత్వాలకు అనుకూలంగా ఉన్న ప్రధాన ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా నెలల తరబడి పతాక శీర్షికలతో భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభాన్ని ఆకాశానికెత్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా బడా కార్పొరేట్‌ సంస్థ జిఎంఆర్‌కు మోకరిల్లాయి. ప్రారంభ సభ కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేశాయి. ఉత్తరాంధ్రలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించి వేలాది బస్సుల్లో ప్రజలను తరలించాయి. ఆదివాసీ ప్రాంతాల నుంచి 13 వేల మందికి పైగా గిరిజన విద్యార్థులను సమీకరించి, వారు ప్రదర్శించిన థింసా నృత్యాలతో మోడీ, చంద్రబాబు, పవన్‌, జిఎంఆర్‌ ప్రతినిధులు ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. ఇందుకోసం 9 వేల మంది పోలీసులను వినియోగించారు.

మోడీ, చంద్రబాబు, పవన్‌ ప్రసంగాల్లో భోగాపురం ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేట్‌వేగా, జాతీయ–అంతర్జాతీయ పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక కేంద్రంగా ఈ ప్రాంతాన్ని మార్చేస్తుందని చెప్పారు. ఎయిర్‌పోర్టుతో వలసలు ఆగిపోవడమే కాక, ఇప్పటికే వలస వెళ్లినవారు తిరిగి వస్తారని, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆరు లక్షల ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రకటించారు. ఎర్ర బస్సు కూడా రాని గ్రామాలకు ఎయిర్‌పోర్టు నిర్మించామని గొప్పగా చెప్పుకున్నారు. కానీ ఎయిర్‌పోర్టు చుట్టుపక్కల గ్రామాల ప్రజల్లో విమానం ఎక్కే స్తోమత ఉన్నవారు దాదాపు లేరు. వారికి కావాల్సింది ప్రభుత్వ ఎర్ర బస్సే. ఆ బస్సు సేవలను మాత్రం ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఎయిర్‌పోర్టులో స్థానికులకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా ద్రోహం చేసింది.

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రభుత్వ–ప్రైవేట్‌ భాగస్వామ్యం (పిపిపి) పేరుతో జిఎంఆర్‌ నిర్మించిన ప్రైవేట్‌ ఎయిర్‌పోర్టు. దీని నిర్వహణ 40 ఏళ్లపాటు ఆ సంస్థ చేతుల్లో ఉంటుంది. ఎయిర్‌పోర్టు కోసం రైతుల నుంచి బలవంతంగా భూములు సేకరించి 22 వేల ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం జిఎంఆర్‌కు అప్పగించింది. విశాఖ ఎయిర్‌పోర్టును మూసివేయాలనే ఒప్పందాన్ని బిజెపి, టిడిపి కుదుర్చుకున్నాయి. ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం ప్రభుత్వ బ్యాంకుల నుంచి సుమారు రూ.4,300 కోట్ల రుణం సమకూరింది. అదనంగా 'వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌' పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వందల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించాయి. జిఎస్‌టితో పాటు పలు పన్ను రాయితీలను పదేళ్లపాటు కల్పించాయి. విమాన ప్రయాణికులపై భారీ యూజర్‌ చార్జీలు విధించే చట్టబద్ధమైన హక్కులను కూడా జిఎంఆర్‌కు అప్పగించాయి.

భోగాపురం ఎయిర్‌పోర్టు 'గేట్‌వే' పేరుతో గత పదేళ్లుగా పాలక పార్టీలు రైతుల భూములను కొల్లగొడుతున్నాయి. నేడు కూటమి ప్రభుత్వంలో పదవుల్లో ఉన్న పలువురు వందల ఎకరాల్లో రిసార్టులు నిర్మించి, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు చేస్తున్నారు. ఒక టిడిపి నాయకుడు ఎయిర్‌పోర్టు సమీపంలో 400 ఎకరాల్లో రిసార్టు నిర్మించగా, మరో ప్రతిపక్ష నాయకుడు భూదందాల ఆరోపణల మధ్య పార్టీ ఫిరాయించాడు. అధికారాన్ని ఉపయోగించి ప్రభుత్వ, ప్రైవేట్‌ భూముల రికార్డులను తారుమారు చేయడం, ఆక్రమణలు చేయడం ద్వారా వందల కోట్ల ఆస్తులు కూడబెట్టారు. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు భూ దోపిడీ విస్తరించింది. ఎయిర్‌పోర్టు చుట్టూ అనేక గ్రామాలు భూమిలేని గ్రామాలుగా మారాయి. భూములు, ఉపాధి కోల్పోయిన ప్రజలు వలసలు వెళ్లి కూలీలుగా మారుతున్నారు. ఇంకా మిగిలిన భూములను కూడా స్వాధీనం చేసుకోవడానికి ఎయిర్‌పోర్టు ప్రారంభాన్ని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వినియోగిస్తోంది. ఈ గేట్‌వే భూ దోపిడీకే పరిమితం కాలేదు. ఉత్తరాంధ్ర తీర ప్రాంతాన్నే కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇందుకోసం కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ (సిఆర్‌జెడ్‌), మారిటైమ్‌ నిబంధనలను కూడా సరళతరం చేస్తున్నారు.

ఈ దోపిడీ ఏ స్థాయిలో ఉందో రుషికొండ ఉదాహరణే చెబుతుంది. గత వైసిపి ప్రభుత్వం రూ.450 కోట్లతో ప్యాలెస్‌లు నిర్మించి ప్రజాధనాన్ని వృథా చేసింది. దీనిపై అప్పట్లో చంద్రబాబు, పవన్‌, బిజెపి నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా ప్రయోజనాలకు వినియోగిస్తామని హామీ ఇచ్చి, రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందారు. అధికారంలోకి వచ్చాక మాత్రం వైఖరి మార్చుకున్నారు. ఇప్పుడు అదే ప్యాలెస్‌లతో పాటు వేల కోట్ల విలువైన కొండ శిఖర భాగాన్ని, కింద ఉన్న తొమ్మిది ఎకరాల తీర ప్రాంత భూమిని కూడా పిపిపి పేరుతో తమకు సన్నిహిత సంస్థకు అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు. రుషికొండ మాత్రమే కాదు, ఇలాంటి కొండలను కూడా కార్పొరేట్‌ లాభాల కోసం ధారాదత్తం చేస్తున్నారు.

అంతర్జాతీయ పర్యాటకం పేరుతో ఈ దోపిడీని మరింత విస్తరిస్తున్నారు. రుషికొండ కేంద్రంగా 'వైజాగ్‌ బే సిటీ' ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చారు. సుమారు 45 చదరపు కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని ప్రపంచశ్రేణి నగరంగా అభివృద్ధి చేస్తామని ప్రకటిస్తున్నారు. లగ్జరీ హోటళ్లు, ప్రపంచ ప్రమాణాల రిసార్టులు, సముద్ర వ్యూ రెస్టారెంట్లు, బీచ్‌ షాక్ లు, బార్లు, విలాసవంతమైన విల్లాలు, ఎత్తైన నివాస భవనాలు, షాపింగ్‌ మాళ్లు వంటి నిర్మాణాలతో మొత్తం బీచ్‌ ప్రాంతాన్ని ప్రైవేట్‌ శక్తుల చేతుల్లో పెట్టే ప్రణాళిక అమలు చేస్తున్నారు. కైలాసగిరి, తోట్లకొండలతో పాటు ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎర్రమట్టి దిబ్బలను కూడా ప్రైవేట్‌ చెరలోకి నెట్టబోతున్నారు. ఉత్తరాంధ్రలోని టైటానియం వంటి విలువైన ఖనిజాలను తవ్వేందుకు ఇప్పటికే అదానీ వంటి సంస్థలకు అనుమతులు ఇచ్చారు. ఈ వనరుల వినియోగానికి విశాఖ కేంద్రంగా ఖనిజ కారిడార్‌ను కూడా ప్రకటించారు.

ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ డేటా సెంటర్లను కూడా ఉత్తరాంధ్రపై మోపుతున్నారు. ఏకంగా 8.5 గిగావాట్ల సామర్థ్యం గల డేటా సెంటర్ల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఇప్పటికే గూగుల్‌, అదానీ, సిఫీ, అంబానీ సంస్థలకు వేల ఎకరాల భూములు, కొండలను కేటాయించారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని రాయితీలు, సబ్సిడీల రూపంలో ఈ సంస్థలకు అందిస్తున్నారు. గతంలో ప్రజా వ్యతిరేకతతో నిలిచిపోయిన కొవ్వాడ అణువిద్యుత్‌ ప్రాజెక్టును కూడా ఈ డేటా సెంటర్లకు విద్యుత్‌ సరఫరా కోసం తిరిగి ముందుకు తెస్తున్నారు.

ఉత్తరాంధ్ర ఏజెన్సీ తూర్పు కనుమల్లో కీలక భాగం. బాక్సైట్‌, మైకా, క్వార్ట్‌జైట్‌ వంటి విలువైన ఖనిజ సంపదకు, ప్రపంచశ్రేణి కాఫీ సాగుకు ఈ ప్రాంతం కేంద్రం. ఎన్నో ఏళ్లుగా ఈ సంపదను స్వాధీనం చేసుకోవడానికి కార్పొరేట్‌ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు చింతపల్లి, గూడెం కొత్తవీధి, అరకు, అనంతగిరి ప్రాంతాల్లోని బాక్సైట్‌ నిక్షేపాలను తవ్వేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. పంప్డ్‌ స్టోరేజ్‌ విద్యుత్‌ ప్రాజెక్టుల పేరుతో అదానీ, నవయుగ వంటి సంస్థలకు వేల ఎకరాల గిరిజన అటవీ భూములను అప్పగిస్తోంది. వన్‌ ఆఫ్‌ 70 చట్టానికి తూట్లు పొడుస్తూ, అటవీ హక్కుల చట్టం, పీసా చట్టాన్ని బలహీనపరుస్తూ, అటవీ సంరక్షణ నిబంధనలను మార్చుతోంది. మొత్తం ఏజెన్సీ ప్రాంతాన్నే కార్పొరేట్‌ లాభాల కోసం బలి చేస్తోంది.

కేంద్ర బిజెపి ఆదేశాలతో నీతి ఆయోగ్‌ రూపొందించిన విశాఖ ప్రాంతీయ కార్పొరేట్‌ అభివృద్ధి వ్యూహాన్ని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం మరో ప్రణాళికను ముందుకు తెచ్చింది. ఇప్పటికే ప్రత్యేక ఆర్థిక మండలాలు, ఫార్మా, పారిశ్రామిక కేంద్రాలు, అపెరల్‌ పార్కులు, పెట్రో కెమికల్‌ రీజియన్‌, విశాఖ–చెన్నై కారిడార్‌ పేర్లతో వేల ఎకరాల భూములను రైతుల నుంచి బలవంతంగా సేకరించి బడా సంస్థలకు అప్పగించారు. ఇప్పుడు బల్క్‌ డ్రగ్‌, లైఫ్‌ సైన్స్‌, మెడ్‌టెక్‌, అల్యూమినియం పార్కులు, స్టీల్‌ హబ్‌లు, పోర్టులు, లాజిస్టిక్స్‌, బీచ్‌ శాండ్‌ మైనింగ్‌, టూరిజం, ఐటీ, అధునాతన పారిశ్రామిక, సర్వీస్‌ నగరాల పేర్లతో ఈ వ్యూహాన్ని మరింత విస్తరిస్తున్నారు. వీటి కోసం లక్షల ఎకరాల భూదోపిడీకి సన్నాహాలు చేస్తున్నారు.

మరోవైపు ఉత్తరాంధ్ర ప్రజలకు జీవనాడిగా ఉన్న విశాఖ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. ముఖ్యంగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విక్రయించేందుకు మార్కెట్లో పెట్టి, వేలాది మంది కార్మికులను తొలగిస్తూ సంస్థను నష్టాల్లోకి నెట్టారు. ఈ ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టులు దశాబ్దాలుగా పూర్తికాక పాలకుల నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. విద్య, వైద్యం, గృహం వంటి మౌలిక సదుపాయాల పరిస్థితి కూడా దయనీయంగానే ఉంది. దేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర ఇప్పటికీ ముందు వరుసలోనే ఉంది. దరిద్రం, ఆకలి, నిరుద్యోగం, భూములు, జీవనోపాధులు, ప్రజా వనరులు, ప్రకృతి సంపద కోల్పోవడం, వలసలు పెరగడం వంటి పరిణామాలతో ఉత్తరాంధ్ర క్రమంగా దోపిడీ శక్తుల సొంత ఎస్టేట్‌గా మారుతోంది. ఇదే మోడీ–చంద్రబాబు–పవన్‌ల ఉత్తరాంధ్ర కార్పొరేట్‌ గేట్‌ వే.


వ్యాసకర్త: డా. బి. గంగారావు

సెల్: 94900 98792

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్