నవంబర్ మొదటి తేదీన రామ్‌లీలా మైదాన్‌లో సమీకృతమైన మహాజనరాశి సమరశంఖం పూరించింది. దసరా పండుగ సందర్భంగా సంప్రదాయకంగా రావణ దహనానికి పేరుగాంచిన ఆ మైదానం సమకాలీన దుష్టశక్తిని దహనం చేసేందుకు రంగం సిద్ధపర్చింది. భారత ప్రజల అతి కీలకమైన ఒక హక్కుగా వున్న ఓటు హక్కును లాక్కోవడానికిగాను విశృంఖలంగా చెలరేగిపోతున్న శక్తుల పీచమణచాలనే సంకల్పాన్ని ప్రకటించే సన్నివేశానికిది వేదికైంది.
బీహార్ కసరత్తుతో మొదలుపెట్టి గత ఏడాది కాలంగా ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర పరిశీలన (సర్) ప్రక్రియ అమలుతో సాగిన ఈ దుష్ట ప్రయత్నానికి వ్యతిరేకంగా ఈ పోరాటం పెం పొందిన క్రమ పరిణామాన్ని ‘పీపుల్స్ డెమోక్రసీ’ ఇప్పటికే కథనం చేస్తూ వస్తున్నది. అప్పటి నుంచి ప్రతిపక్షాలనూ నిరసన ప్రవాహాలను ఏకం చేయడంలో చాలా ప్రయత్నాలే జరిగాయి. నవంబరు 1న రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన బ్రహ్మాండమైన సభ దేశ ప్రజలనందరినీ ఒక తాటిపైకి తెచ్చింది. గత పన్నెండేళ్లుగా ఆర్.ఎస్.ఎస్, బిజెపి నాయకత్వంలోని మతతత్వ శక్తులు, కార్పొరేట్ల దుష్ట కూటమిపై పోరాడే రాజకీయ శక్తులన్నిటి విశాల వేదికగా ముందుకొచ్చిన ‘ఇండియా’ కలయిక ఈ సమీకరణకు ఏకీకరణ శక్తిగా వుండటం సహజ పరిణామమే.
ఈ పోరాటం దేశ వ్యాపిత స్వభావం సంతరించుకుందని ‘సర్’ నడిచిన తీరే నిరూపించింది. ప్రజల ఓటు హక్కును సామూహికంగా తొలగించేసే ఈ తతంగం ఏమిటో ఇప్పుడు వీసమెత్తు సందేహం లేకుండా రుజువైపోయింది. ఇప్పటికే ‘సర్’ అమలు జరిగిన ఇప్పుడు ముగింపుకొస్తున్న రాష్ట్రాలతో కలసి దాదాపు 13.5 కోట్ల ఓట్లు తొలగించబడ్డాయి. ఇది మన దేశ జనాభాలోనే గణనీయమైన భాగంగా వుంటుంది.
జ్ఞానేశ్ అందుకే...
జ్ఞానేశ్ కుమార్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఎంచుకుని సాగించిన ఈ ప్రక్రియ అత్యంత విభజన స్వభావంతో వుండటం ఎంత మాత్రం యాదృచ్ఛికం కాదు. ఆర్.ఎస్.ఎస్, బిజెపిల ఎజెండాలో అతి ప్రధానమైన రెండు అంశాలు కాశ్మీర్లో 370 అధికరణం రద్దు, అయోధ్య రామ మందిర నిర్మాణం అనే వాటిని పూర్తి చేయడంలో ఒక కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా అందుకాయన చక్కగా కుదిరాడు. ఈ ‘సర్’ ప్రక్రియ మొదలైన దాదాపు ఏడాదిన్నరగా సాగిన ఈ మోసపూరిత తతంగం దేశమంతటా కొత్త ఓటర్ల జాబితాలను తయారు చేసింది. జ్ఞానేశ్ కుమార్‌కు తక్కిన ఇద్దరు ఎన్నికల కమిషనర్లతో అంగీకారం లేదు. ఈ దృక్పథమూ ఈ నమూనా ఎంత ఏకాకులైపోయాయో దీన్నిబట్టే తెలుస్తుంది. అయితే దీనికి స్పష్టంగా మోడీ, అమిత్ షా ద్వయం ఆశీస్సులు వున్నాయనేది యథార్థం. ఈ కసరత్తు అసలైన లక్ష్యం భారత పౌరులను మతం ప్రాతిపదిక మార్గంలో విభజించడమే. విదేశీయుల ఏరివేత అనే లక్ష్యం బహిరంగంగానే ప్రకటించబడింది. వాస్తవానికి ‘శోధించు, తొలగించు, తరలించు’ అనే నినాదంతో అమిత్ షా బాహాటంగానే ఈ తతంగం ఎల్లలేంటో చెప్పేశారు. అయితే అమలు క్రమంలో దీనివల్ల దళితులు, వలస కార్మికులు, మహిళల వంటి నిరధికార తరగతుల వారు కూడా భారీ ఎత్తున అసమ నిష్పత్తిలో తీసివేయబడ్డారు.
నిరసన నినాదమదే
దీనివల్ల క్షేత్ర స్థాయిలో ఎంత నిరసన పుట్టిందంటే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ స్వయంగా కోటి డెబ్బై లక్షల మంది హిందువుల ఓట్లు తొలగించబడ్డాయని బహిరంగంగా ప్రకటించుతున్నారు. ఈ మొత్తం ఒక తుపానులా సమీకృతమైన రామ్‌లీలా మైదానంలో విస్ఫోటనం చెందింది. ఇదెంత తీవ్ర ప్రభావం చూపించిందంటే...ఇప్పుడు ప్రభుత్వం, దాని అత్యున్నత నాయకత్వం జ్ఞానేశ్ కుమార్‌ను కాపాడేందుకు కట్ట కట్టుకుని ముందుకు రావలసి వచ్చింది. ఆయనేమో సెప్టెంబర్ 23 నుంచి కనిపించడం లేదు. ఎందుకంటే ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఆ రోజే ‘సర్’ అమలుకు సంబంధించిన చట్టపర విధానపర అంశాలపై ఇ.సి.ఐ లో తీవ్ర ఉల్లంఘనలను బయటపెట్టింది. ఇప్పుడు కూడా స్వతంత్ర మీడియా, ఆఖరుకు కొన్నిసార్లు బడా మీడియాలో కొందరు కూడా ఈ భారీ తప్పుడు కార్యక్రమానికి సంబంధించిన వాస్తవాలు, సాక్ష్యాధార పత్రాలు బయటపెడుతున్నారు.
ఓటు హక్కును కాపాడుకునేందుకోసం సాగిన ఈ మహా ప్రజాస్వామిక పోరాట క్రమంలో ప్రజలు తీవ్ర నిర్బంధాన్ని తట్టుకుని నిలబడ్డారు. ప్రభుత్వం జంతర్ మంతర్‌ను ఒక నిరసన వేదిక కాకుండా చేసేదాకా వెళ్లింది. అయితే ఆ ప్రయత్నం ఎంతగా బెడిసికొట్టిందో రామ్ లీలా మైదానంలో లక్షోప లక్షల మంది సమీకృతమైన రీతిలోనే వెల్లడైంది. దానికి ఒక రోజు ముందు సి.ఇ.సి జ్ఞానేశ్ కుమార్‌ను బహిరంగ అభిశంసన కార్యక్రమంలో ఆమోదించిన తీర్మానం ఆయనను తొలగించడానికి నిర్దిష్ట కారణాలేమిటో సూటిగా ప్రకటించింది. ‘సర్’ ప్రక్రియను నిలిపివేయాలనీ స్తంభింపచేయాలని పేర్కొంది. ఇ.సి.సి ని, ఇతర ఎన్నికల కమిషనర్లను నియమించడంలో పాలక వ్యవస్థ గుత్తాధిపత్యంతో ఇష్టానుసారం వ్యవహరించే అవకాశం కల్పిస్తున్న చట్టాన్ని వెనక్కు కొట్టాలని ప్రకటించింది. అన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలూ పార్లమెంటులోని వాటి ప్రతినిధులూ పౌర సంఘాలూ తొలగించబడిన ఓటర్ల ప్రతినిధులూ ఒక్క తాటిపై నిలిచి ఈ తీర్మానం చేశారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా తయారైందో అర్థమవుతుంది.
విదేశీయుల వాదన వికృతమే
రామ్‌లీలా మైదానం ప్రజా ధిక్కార స్వరానికి వేదికవుతున్న సమయంలో ప్రతిపక్షాలు లేవనెత్తిన డిమాండ్లకు మరో కోణం కూడా వుంది. వీటిని కాదనేందుకు బిజెపి దగ్గర విశ్వసనీయమైన మరో ప్రత్యామ్నాయం లేదా ఎలాంటి వాస్తవాధారాలు లేవని తేలిపోయింది. అయితే వినాశ కాలే విపరీత బుద్ధి అనే సంస్కృత శ్లోకం చెబుతున్నట్టుగా అమిత్ షా, ఆయన ముఠా తమ తాలూకూ దుర్గంధ వ్యూహాలతో మరింత వికృతంగా ముందుకొచ్చారు.
హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొంటూ అమిత్ షా అక్కసు మొత్తం వెళ్లగక్కేశారు. విదేశీలయులందరినీ వెళ్లగొట్టేస్తామని ప్రకటించారు. అంతేగాక ‘సర్’కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఉద్యమం అక్రమంగా చొరబడిన విదేశీయులను కాపాడటానికేనని ఆరోపణలు చేశారు. ఇసిఐ పత్రాలు సుప్రీంకోర్టులో వారు సమర్పించిన అఫిడవిట్లు 13 కోట్ల మంది ఓట్లు తొలగించబడినట్టు చెబుతుంటే షా మాత్రం అందుకు భిన్నంగా వారిలో మూడు కోట్ల మంది చొరబాటుదారులను తీసేశామంటున్నారు. ఆయన అడుగుజాడలలోనే ఆయన జూనియర్ సహచరుడు, బిజెపి అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆరు కోట్ల మంది విదేశీయులను జాబితాల నుంచి తొలగించేశామని గొప్పగా ప్రకటిస్తున్నారు. తానెక్కడ వెనకబడిపోతానోనని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కూడా అసలు ‘సర్’ ఉద్దేశమే విదేశీయులను గుర్తించి బంగ్లాదేశ్‌కు పంపేయడమేనని చెబుతున్నారు. అయతే ఈ నాయకులెవరూ ‘సర్’కు సంబంధించిన అధికారిక సంఖ్యా వివరాలనే పట్టించుకోవడం లేదు. వివిధ రాష్ర్టాలలో తొలగింబచడిన ఓటర్ల సంఖ్య 9.86 కోట్లయితే అందులో విదేశీయులుగా తేలినవారు కేవలం 1600 మంది మాత్రమే!
సహజంగానే ఈ కట్టుకథలు ఎంత విడ్డూర దశకు పోయాయంటే...అసలు ప్రతిపక్షాలు అప్రజాస్వామిక వ్యవహారంగా తయారైనాయనే దాకా వెళ్తున్నారు. అక్కడైనా ఆగారా అంటే లేదు. ప్రజాస్వామ్య రక్షణ కోసం అరాచకానికి వ్యతిరేకంగా ఒక పోరాటమే ప్రారంభించాలనే నినాదం ఇస్తున్నారు. అంత భారీ ఎత్తున చొరబాట్లు జరిగిపోయాయనే కథలు హోం మంత్రిగా వున్న అమిత్ షా నే బోనులో నిలబెడతాయనే కనీస వాస్తవాన్ని కూడా గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే అలాంటి చొరబాట్లను ఆపవలసింది ఆయన చూస్తున్న హోంశాఖనే మరి! నిజం చెప్పాలంటే చాలా రాష్ర్టాలలో డబుల్ ఇంజన్ సర్కార్లు నడుస్తున్నప్పుడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటే ఏమిటర్థం?
రామ్‌లీలా మైదానం ఒక సువిశాల ఐక్యతనూ దృఢ సంకల్పాన్ని ప్రతిబింబించింది. దారి పొడుగునా అనేక నిర్బంధాలనూ ఆటంకాలనూ అధిగమిస్తూ మూలమూలల నుంచి ప్రజలు అక్కడకు చేరుకున్నారు. ఈ పోరాటంలో వెనక్కు తగ్గేందుకు వారేమాత్రం సిద్ధంగా లేరని స్పష్టంగా రుజువైంది. తమ ఓటు హక్కు కోల్పోతామనే ఆందోళన వారిని నడిపించింది. పౌరులుగా తమకు సంక్షేమానికి అవసరమైన కనీస చర్యలను కూడా పోగొట్టుకోవడానికి వారు సిద్ధంగా లేరు.
అవిశ్రాంతంగా.. అదే దిశలో..
భారత్ చాలా విస్తారమైన విభిన్నతలతో కూడిన దేశం. ప్రజాస్వామిక, లౌకిక రాజ్యాంగాన్ని రక్షించుకోవడం చుట్టూ దాన్ని సంఘటితపర్చాల్సి వుంది. ఎందుకంటే ఆ రాజ్యాంగమే వారి ఓటు హక్కునూ దేశ పాలనతో దాని అనుసంధానాన్ని చట్టబద్ధం చేసింది. కనుక ఈ పోరాటాన్ని అవిశ్రాంతంగా ముందుకు నడిపించడమే పురోగమన మార్గం. మరింత లోతుగా మరింత విస్తృతంగా దూసుకెళ్లవలసి వుంటుంది. బిజెపి, ఆర్.ఎస్.ఎస్ ల గుట్టు రట్టయిపోయింది. మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే ఈ జీవన్మరణ పోరాటంలో వారికి ఉద్వాసన చెప్పక తప్పదు. విశ్రాంతి లేకుండా పోరాడవలసిందే.
( ‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం - నవంబరు 4)








కామెంట్లు (0)