‘దాచిన దాగదు వలపు’ అన్నట్టే రాజకీయాలలోనూ ప్రజా జీవితంలోనూ ఎవరు ఎటు మొగ్గు చూపుతున్నారనేది దాగే విషయం కాదు. మేము రాజకీయాలకు దూరంగా వున్నామనీ మాకు దేంతో సంబంధం లేదని ఎంతగా ప్రకటిస్తున్నా అదృశ్య అభిమాన బంధాలు లాగుతూనే వుంటాయి. కేంద్ర మంత్రి అమిత్ షా ఆదివారం నాడు హైదరాబాద్ వచ్చినపుడు జరిగింది అదే. ‘ఓట్ చోర్’ వ్యతిరేక వెల్లువ ఊపేస్తున్న సమయంలో కౌంటర్ ప్రచారం పెంచేందుకు అమిత్ షా వచ్చారు. ఒక రాజకీయ పార్టీగా అది ఆయన హక్కు. అయితే విదేశీయుల ఓట్ల కోసమే రాహుల్ గాంధీ ఈ నిరసనలు నడిపిస్తున్నారని అమిత్ షా చేసిన ఆరోపణ హాస్యాస్పదమైంది. మూడున్నర కోట్ల మంది విదేశీలయులు ఓట్లు పొందారని ఆయన ఆరోపించారుగానీ నిజానికి తొమ్మిది రాష్ట్రాల ‘సర్’లో దాదాపు పది కోట్ల ఓట్లలో తేలిన విదేశీయులు 1600 మంది మాత్రమే. దాన్ని కూడా ఇంకా పరిశీలించాలి. ఈ వాస్తవాలతో మాకెందుకుగానీ మా రాజకీయం మాదేనన్నది అమిత్ భాయ్ బూకరింపు. ఇదిగో ఇలాంటి సంక్లిష్ట సన్నివేశంలో ఎంట్రీ ఇచ్చాడు మన మెగాస్టార్. కుమారుడు రామ్‌చరణ్‌తో కలసి హోటల్లో అమిత్ షాను చిరంజీవి కలుసుకోవడం మర్యాద పూర్వకమేనని ఎవరూ అనుకోరు. అందులోనూ ఒక రాజకీయ యుద్ధం చేసేందుకు వచ్చిన నాయకులను అలాంటప్పుడు కలవరు. అయితే సరిగ్గా ఆ కారణంతోనే వారు కలిశారు. సందర్భం, సారాంశం లేదా టెక్స్ట్, కాంటెక్స్ట్ అన్నవే ఎప్పుడూ కీలక పాత్ర వహిస్తాయి. ప్రతిపక్షంపై దాడి చేసేందుకు వచ్చిన హోంమంత్రిని కలవడం యాదృచ్ఛికమవదు. పైగా చిరంజీవిని బిజెపి లోకి రమ్మని ప్రధాని మోడీతో సహా ఆహ్వానించి వున్నారు. నేరుగా చేరకపోయినా అటే మొగ్గుంటుందని చిరు చాలా సార్లు తన చర్యలతో సూచించారు. ఇప్పుడు ‘సర్’ సమర ఘట్టంలోనూ అదే జరిగింది. తమ్ముళ్లు పవన్ కల్యాణ్, నాగబాబు ఉభయులూ ఎన్‌డిఎ లో ముఖ్య భాగస్వాములుగా, సనాతన వీరులుగా వున్నప్పుడు చిరంజీవి మాత్రం మరోలా వెళతారా? కాకుంటే రజనీకాంత్‌లా కాలయాపన చేస్తున్నారు. ఏదో సమయంలో ఏదో పెద్ద బాధ్యత తీసుకోవచ్చనే సందేహాలు బలంగా వున్నాయి.
నటులపైనా కత్తి, ఒత్తిడి
ఇది కూడా ప్రముఖ నటుల రాజకీయ సామాజిక కదలికల కథే. నటుడు ప్రకాశ్ రాజ్ ఈ మధ్య రామ్‌లీలా మైదానంలోనూ మాట్లాడారు. గౌరీ లంకేశ్ హత్యను ఖండించిన సమయం నుంచి ఆయన మతతత్వం, నిరంకుశత్వం వ్యతిరేక పోరాటంలో ముందు నిలబడుతున్నారు. మామూలుగా సినిమా నటులు ఇంత ధైర్యంగా ప్రతిపక్ష పాత్ర తీసుకోవడానికి జంకుతారు. అయితే ప్రకాశ్ రాజ్ మాత్రం ధైర్యంగా నిలవడమే గాక మోడీని సయితం నేరుగా విమర్శించేందుకు వెనుకాడటం లేదు. దీనివల్ల చాలా నష్టం జరిగినా నిర్బంధం ఎదురైనా ఆయన తగ్గకపోవడం విశేషం. తాజాగా ఆయన భార్య, ప్రముఖ కొరియోగ్రాఫర్ పోనీ వర్మ మాట్లాడుతూ తన అభిప్రాయాలు మార్చుకోని కారణంగా ప్రకాశ్ రాజ్ చాలా అవకాశాలు కోల్పోవడానికి సిద్ధమైనారని చెప్పారు. అయితే ఆయన భద్రత గురించి మాత్రం ఆమె ఆందోళన వెలిబుచ్చారు. ఇదే సమయంలో నటుడు ఇమ్రాన్ ఖాన్ కథ మరోలా వుంది. ఆయన అమీర్ ఖాన్ మేనల్లుడే గాక ప్రముఖ నటుడు కూడా. ఇటీవల ముంబాయిలో ‘సర్’ వ్యతిరేక ఆందోళనలో పాల్గొన్నారని ఆయనపై కక్ష సాధింపు మొదలుపెట్టారు. స్వతహాగా విదేశీ భారత పౌరుడు ఆయన. ఒవర్ సీస్ ఇండియన్ సిటిజన్ (ఒఐసి) కోటా కింద వచ్చిన వారు రాజకీయ వ్యవహారాలలో తల దూర్చకూడదని నోటీసులిచ్చి ఆయనను వేధిస్తున్నారు. తనకు ఈ నిబంధనలు తెలియవని, అయినా తాను ప్రజాస్వామ్యం కోసం పోరాడే వారికి తోడు నిలిచానని ఇమ్రాన్ చెప్పారు. ఇకపైన జాగ్రత్త వహిస్తానని అండర్ టేకింక్ కూడా ఇచ్చారు. ఈ కారణంగా కోర్టు ఆయన మరికొంత కాలం దేశంలోనే వుండేందుకు అనుమతినిచ్చింది.
వీడియో ఉచ్చులో కర్ణాటకం
అదేం చిత్రమో గానీ కర్ణాటక రాజకీయాలలో ఫోన్ ట్యాపింగ్‌లూ ఫేక్ విడియోలు ఎప్పుడూ సమస్యే. దేశంలో ఫిరాయింపుల, ప్రలోభాల రాజకీయం సాక్ష్యాధారాలతో సహా దొరికింది 1980లలో వీరప్ప మొయిలీ టేపులు. తర్వాత ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే పదవినే వదులుకోవలసి వచ్చింది 1988లో ఫోన్ ట్యాపింగ్ కేసులో. తాజా ఘట్టాలకు వస్తే మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడు, మనవలైన రేవణ్ణ, ప్రజ్వల్ రేవణ్ణలు మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన కేసుల వీడియోలు వారిని జైలుపాలు చేశాయి. అదలా వుంటే మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య తనపై స్ట్రింగ్ ఆపరేషన్ జరిగిందని ఆరోపించి మరో సంచలనం సృష్టించారు. ఇందుకు కారణమైన మహిళా కాంగ్రెస్ నేత కృపా ఆల్వాను ఆరేళ్లపాటు బహిష్కరించారు. ఈ సమయంలోనే ఇప్పటి ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్‌పై కేంద్రమంత్రి కుమారస్వామి గౌడ మరో స్ర్టింగ్ ఆపరేషన్ ఆరోపణ చేశారు. తమ కుటుంబ సభ్యులను ఇరికించే ఆపరేషన్ డి.కె చేయించాడని కుమారస్వామి అన్నారు. తీరా చూస్తే ఈ ఆరోపణకు ఆధారమైన వ్యక్తి నేరుగా కుమారస్వామి ఇంటి నుంచే ఆపరేట్ చేశాడని, ఇప్పుడు కేరళ పోలీసులు ఆధారాలు దొరికాయంటున్నారు. ఇది కాంగ్రెస్ కుట్ర అనీ తనను ఎక్కడకు విచారణకు పిలిచినా వస్తానని కుమారస్వాముల ఉవాచ. అతన్ని కుట్రతోనే తన నివాసానికి పంపించారని ప్రత్యారోపణ చేస్తున్నారు. ఇదంతా మహా వింత వ్యవహారంగా లేదూ?
ఆలస్య జీవుల అసలు బుద్ధి
వివాహాలు, వేడుకలూ, సభలూ సమావేశాలు.. ఏవైనా సరే బుద్ధిగా ముందే వచ్చి కూర్చునే వారుంటారు. ఆఖరి నిముషంలో హడావుడిగా చేరుకునే వారుంటారు. కాస్త అటూ ఇటుగా ఆలస్యంగా వచ్చి కలిసేవారుంటారు. అందరికీ అనుభవైక వేద్యమైన విషయమే కదా. కాల పాలన అనబడే పంక్చువాలిటీ గురించి ఎప్పుడూ చెబుతున్నా ఇది మారదు. క్రమశిక్షణ, పద్ధతులు పాటించడం వంటివి అలా వుంచి అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? సమయానికన్నా ముందే వచ్చేవారు ఆలస్యంగా వచ్చేవారి స్వభావాలెలా వుంటాయని పరిశోధకులు అధ్యయనం చేసి ఆసక్తికరమైన విషయాలే తేల్చారు. తొందరగా వచ్చిన వారు అన్నీ తెలుసుకుంటూ ఏం చేయాలి చెప్పాలి అని సిద్ధమైపోతారట. ఆలస్యమైన వారు సమయానికి చేరుకుంటామా లేదా ఈ లోగా ఏమైపోతుందని ఆలోచిస్తూ ఏమైనా వీలుంటే కాగితాలు చూస్తూ వస్తారట. ఏతావాతా ఉభయులూ ఒకే విధంగా వ్యవహరిస్తారన్నది ఈ పరిశోధన సారాంశం. అయితే కొంతమంది ముందు రావడానికి, మరికొందరు తీరిగ్గా రావడానికి స్వభావంలో ఒక కారణం వుంటుంది. ఏది, ఏమిటి, ఎవరు ఇవన్నీ ముందే లోతుగా తెలుసుకుని సిద్ధంగా వుండాలనేవారు నిర్ణీత సమయం కన్నా ముందే వస్తారట. ఏదైనా ఎలాగో చేయొచ్చు, చూడొచ్చు అనుకునేవారు ఆలస్యంగా వస్తారట. మొదటి తరహావారు అనిశ్చితిని ఏమాత్రం సహించలేరు గనక అన్నీ స్పష్టంగా తెలిసి వుండాలనుకుంటారు. ఏదో ఒకటి జరుగుతుంది ఎలాగో చేసేయొచ్చు అనుకునేవారు ఇంకా చెప్పాలంటే అనిశ్చితి గురించి పెద్ద బెంగలేని వారు ఆలస్యం చేస్తుంటారట. ఇంతకూ ముందే వచ్చేవారు బాధ్యతాయుతమైన వారనీ, ఆలస్యంగా వచ్చేవారు నిర్లక్ష్య జీవులనీ నిర్ధారణ చేయలేమన్నది ఈ అధ్యయనం సారాంశం. పైగా వారి వారి నేపథ్యాలు బాధ్యతలూ కూడా ఇందుకు కారణమవుతుంటాయి. ఉన్నది ఉన్న ఫలాన వదిలేసి వచ్చేవారు ఎప్పుడైనా బయలుదేరతారు. అలాగాక పని ఒక కొలిక్కి తెచ్చి ఇవ్వాలనుకునేవారు లేదా ఇతరుల సమస్యలకు కూడా స్పందించేవారు ఆలస్యం చేసుకుంటారట. ఇంత కథ వుంది మరి. అయినా నథింగ్ ఈజ్ టూ లేట్ అంటారు కదా.. ఏదీ మరీ ఆలస్యమైనట్టు కాదు. బెటర్ లేట్ దేన్ నెవర్. ఆలస్యంగానైనా జరిగితే మంచిదంటూ పనిలో దిగిపోతుంటారు. సమయపాలన కథాకమామిషు ఇది.
- పీపీ








కామెంట్‌లు (0)