mh ad
శనివారం, 20 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాజును మించిన రాజభక్తి

2 గంటల క్రితం

visakha steel
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 20, 2026, 05:45 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో పది మంది కార్మికులు మరిగే ఉక్కు ద్రవానికి బూడిద కావడం దేశాన్నే కదిలించిన విషాద ఘటన. ప్రమాదం జరిగిన మర్నాడు కేంద్ర ఉక్కు శాఖామాత్యులు ప్లాంట్‌ను సందర్శించి తిరిగి వెళ్ళారు. ఎవరో కొద్ది మంది అధికారులను బలిపశువులుగా చేసి వారి మీద చర్యలు తీసుకుంటున్నారన్న వార్తలు మీడియాలో వస్తున్నాయి. అంతకు మించి ఈ ప్రమాదం మీద కేంద్రం అధికారికంగా ఇంతవరకూ ఎటువంటి నివేదికను గాని, ప్రమాదానికి వెనుక మూల కారణాలను గాని వెల్లడించలేదు. మోడీ స్టైల్‌ వ్యూహాత్మక మౌనమే కొనసాగుతోంది. కాని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ ప్రతినిధులు మాత్రం రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్నారు. కార్మిక సంఘాలను నిందిస్తున్నారు.

2000 నుండి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ లోని 14 కార్మిక సంఘాలూ తమ మధ్య విభేదాలను, పోటీని పక్కన బెట్టి సమైక్యంగా ఉక్కు పరిరక్షణ కోసం నిలబడ్డాయి. స్వాతంత్య్ర సమరయోధులు పత్తి శేషయ్య, బైరాగి తాము జలసమాధి కావడానికి సిద్ధం అని ప్రకటించి కార్మికులకు అండగా నిలిచారు. ప్రజానీకం అంతా మద్దతు పలికారు. దాంతో అప్పుడు ప్రభుత్వం వెనకడుగు వేసింది. గత రెండు దశాబ్దాలుగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ పాలు కాకుండా నిలుసుకోగలిగింది కార్మికులే.

అయితే కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేట్ల సేవే ప్రధానంగా ఎంచుకుని వ్యవహరిస్తోంది. గతంలో తెలుగుదేశంలో చంద్రబాబుకు నమ్మిన తోడుగా వ్యవహరించిన సి.ఎం.రమేష్‌ ఉన్నట్టుండి బిజెపి తీర్ధం పుచ్చుకుని ఖమ్మం నుంచి అనకాపల్లి వచ్చేసి ఇక్కడ బిజెపి తరఫున ఎంపీ అయిపోయాడు. ఆ వెంటనే ఆర్సెలార్‌-మిట్టల్‌ అనే అంతర్జాతీయ స్టీల్‌ దిగ్గజానికి అనకాపల్లిలో స్టీల్‌ పరిశ్రమ స్థాపించడానికి కావలసిన అనుమతులన్నీ చకచకా వచ్చేశాయి. ఇంకా ప్లాంట్‌ నిర్మాణమే మొదలుకాలేదు కాని క్యాప్టివ్‌ పోర్టుకు స్వంత గనులకు, నీటి సరఫరాకు అనుమతులు వచ్చేశాయి. ఇదే మా 'ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌' అని చంద్రబాబు దేశదేశాలూ తిరిగి మరీ గొప్పలు పోతున్నారు! కార్పొరేట్లకు కావలసిన వ్యక్తులు వారికి కావలసిన చోట పార్లమెంటు సభ్యులు అయిపోవడమే ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అని అనుకోవలసి వుంది.

మరి అదే ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ సూత్రాన్ని విశాఖ ఉక్కుకు ఎందుకు వర్తించేట్టు చేయడం లేదు? ప్లాంట్‌కు కావలసిన నిధులు ఇవ్వరు. అదే చేత్తో కార్పొరేట్లకు మాత్రం ప్రజాధనాన్ని బ్యాంకుల నుంచి రుణాల పేరుతో ఇప్పించేస్తారు, ఆ తర్వాత ఆ కార్పొరేట్లు రుణాలను ఎగ్గొడితే రుణాలను అలవోకగా మాఫీ చేసేస్తారు. అదే సూత్రం విశాఖ ఉక్కు కు ఎందుకు వర్తించదు? విశాఖ ఉక్కు సంస్థ చేసేది బిజినెస్‌ కాదా? దానికి ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ సూత్రం వర్తించదా? ఇంకా ప్రారంభమే కాని మిట్టల్‌ కంపెనీకి ముందే గనులను కేటాయంచగలిగిన వీరులు, దశాబ్దాల తరబడి మొత్తుకుంటున్నా విశాఖ ఉక్కుకు ఎందుకు స్వంత గనులను కేటాయించలేకపోతున్నారు? విశాఖ ఉక్కు పట్ల కేంద్రం వివక్షత ప్రదర్శిస్తుంటే నిలదీయడం పోయి ఆ కేంద్రాన్ని వెనకేసుకు వస్తున్నారు. ప్రభుత్వ రంగాన్ని, రాష్ట్ర ప్రయోజనాలను, కార్మికులను బలిపెట్టి జాతీయ సంపదను కొల్లగొట్టే కార్పొరేట్ల కొమ్ము కాయడమే ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అసలు అర్ధం అని స్పష్టం కావడం లేదా? కార్పొరేట్లకు జాతి సంపదను దోచిపెట్టడంలో కేంద్రంలో మోడీ ప్రభుత్వం కన్నా రాష్ట్రంలో తామేమీ తీసిపోవడం లేదని కార్పొరేట్‌ ప్రపంచానికి చాటిచెప్పుకోడానికే చంద్రబాబు తాపత్రయ పడుతున్నారు.

ఆర్సెలార్‌ మిట్టల్‌ ప్లాంట్‌ వచ్చినా విశాఖ ఉక్కు కొనసాగుతుందని, దానిని ప్రైవేటీకరణ నుండి రక్షించేశామని కూటమి ప్రభుత్వం, అటు కేంద్రం కూడా చాలా ప్రచారం చేసుకున్నాయి. కాని కేంద్రం విశాఖ ఉక్కు విషయంలో అనుసరిస్తున్న విధానాలు ఆ ప్లాంట్‌ను లోపలి నుంచే చెద దొలిచివేసి కూల్చివేసే చందాన అమలవుతున్నాయి. ప్లాంట్‌ను ఆధునీకరణ చేసి, ముడి సరుకుల సరఫరాతో సహా సామర్ధ్యం పెంపు వరకూ చేపట్టవలసిన చర్యల్లో ఏ ఒక్కటీ చేపట్టలేదు. అనుభవం, నైపుణ్యం ఉన్న పర్మనెంట్‌ కార్మికులను, కాంట్రాక్ట్‌ కార్మికులను వేల సంఖ్యలో తొలగించారు. ఎక్కడెక్కడి నుంచో అనుభవం, దక్షత లేని కాంట్రాక్టర్లను తెచ్చి రుద్దారు. స్థానిక మేనేజ్‌మెంట్‌ కేవలం తాన తందాన అనేట్టుగా దిగజారిపోయింది. జీతాలు చెల్లించకపోయినా, అనేక రకాల ఇబ్బందులపాలు చేసినా, సహనంతో కార్మికులు, వారి సంఘాలు వ్యవహరించారు. ఏ విధంగానైనా ప్లాంట్‌ను కాపాడుకోవాలనే తాపత్రయ పడుతున్నారు. యజమానిగా ఉన్న కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును నడవనివ్వకుండా వ్యవహరిస్తోంది. అయినా కార్మికుల పట్టుదల కేంద్రం ఆటల్ని అనుకున్నట్టు సాగకుండా అడ్డుకుంటోంది. అందుకే కార్మికుల మీద, సంఘాల మీద అంత అక్కసు వెళ్ళగక్కుతున్నారు లోకేష్‌, పవన్‌ కల్యాణ్‌ అండ్‌ కో.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కొనసాగినంత కాలమూ అది ఆర్సెలార్‌ మిట్టల్‌ కు పక్కలో బల్లెం లాగే ఉంటుంది. ఉక్కు ధరను నిర్ణయించే విషయంలో, తయారైన ఉక్కు నాణ్యత విషయంలో, కార్మికుల ఉత్పాదకత స్థాయిలో, వేతనాల విషయంలో, సంక్షేమ చర్యల విషయంలో, చివరికి కేంద్రానికి, రాష్ట్రానికి చెల్లించే పన్నుల విషయంలో-అన్నింటా ఆర్సెలార్‌ మిట్టల్‌ సంస్థను విశాఖ ఉక్కుతో పోల్చి చూస్తారు. ఏ విషయంలోనూ ఆర్సెలార్‌ మిట్టల్‌ సంస్థ విశాఖ ఉక్కుకు సాటిగా నిలవలేదు. ఇక్కడ ఉచితంగా భూములు, నీళ్ళు, చౌకగా కార్మికులు దొరుకుతారనే కదా ఇక్కడికి ఆ సంస్థ వస్తున్నది? విశాఖ ఉక్కుకు దీటుగా సాంకేతికతను, నిపుణులైన కార్మికులను ఎక్కడి నుంచి తెస్తారు? విశాఖ ఉక్కు పన్నులు చెల్లిస్తున్నప్పుడు ఆర్సెలార్‌ మిట్టల్‌ కూడా చెల్లించవలసి వుంటుంది కదా? సరిసమాన స్థాయిలో కాకపోయినా జీతాల విషయంలో విశాఖ ఉక్కు కార్మికులతో ఆర్సెలార్‌ మిట్టల్‌ కార్మికులు కూడా సరిపోల్చుకుంటారు కదా? తయారైన ఉక్కు నాణ్యత విషయంలో కూడా అంతే కదా? అందుచేత ఆర్సెలార్‌ మిట్టల్‌ సంస్థ నడవడం అంటే విశాఖ ఉక్కు అంతకన్నా ముందు మూత పడాలి. ఇప్పుడు విశాఖ ఉక్కు కార్మికుల ముందున్న సవాలు ప్రైవేటీకరణ కాదు. ప్లాంట్‌ను బతికించుకోవడం. బతకనివ్వకుండా చేసే పనిలో కేంద్రం ఉంది. దానికి అత్యంత విధేయతతో రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోంది.

ఇప్పుడు జరిగిన ప్రమాదం కోరుకోనిదే అయినా, కార్మికులు, ఎగ్జిక్యూటివ్‌ లు, నిపుణులు ఇటువంటి ప్రమాదాల గురించి హెచ్చరిస్తూనే వున్నారు. నివారించే దిశగా ఒక్కటంటే ఒక్క చర్య కూడా కేంద్రం తీసుకోలేదు. కేంద్రం తలూపకుండా చర్యలు తీసుకునే సత్తా స్టీల్‌ మేనేజిమెంట్‌కి లేదు. ఇప్పుడు ప్రమాదం జరిగిపోయింది. కేంద్రం దుర్మార్గం, ఆర్సెలార్‌ మిట్టల్‌ కోసం విశాఖ ఉక్కును బలిపెడుతున్న దాని విధానం మళ్ళీ బహిరంగంగా చర్చకు వస్తాయి. అలా జరగకుండా ఉండాలంటే చర్చను పక్కదోవ పట్టించాలి. ప్రధాన దోషం, బాధ్యత కేంద్రానిది అయినప్పుడు లోకేష్‌, పవన్‌ కల్యాణ్‌ కార్మికులను, కార్మిక సంఘాలను తప్పుబట్టడానికి తయారయారంటే వారిద్దరికీ ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియకపోవడం కాదు. తెలిసే, కావాలనే, చర్చను పక్కదోవ పట్టించడానికి, కేంద్రాన్ని, తెర వెనుకనున్న ఆర్సెలార్‌ మిట్టల్‌ను కాపాడడానికి, విశాఖ ఉక్కుపై వాళ్ళు సాగిస్తున్న కుట్ర బైటపడకుండా ఉండడానికి ఈ విధంగా అర్ధంలేని విధంగా కార్మిక సంఘాల నాయకులతో తగువులకు దిగారు. కార్మికుల ఓట్లతో గెలిచి ఆ కార్మికులనే నిందించేందుకు తెగబడ్డారు.

పరవాడలో, ఫార్మా రంగంలో ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో ప్రాణ నష్టం జరిగినప్పుడు రూ.కోటి వరకు నష్ట పరిహారాన్ని యజమానులు చెల్లించడానికి అంగీకరించారు. పాలిమర్స్‌ ప్రమాదంలో మరణించినవారికి కూడా అదే మోతాదులో చెల్లించారు. ఇప్పుడు నష్ట పరిహారాన్ని అదే స్థాయిలో చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడుతోంది. ఇదేదో అనాలోచితంగా చేస్తున్నది కాదు. ''మా రాష్ట్రంలో ప్రమాదాలు జరిగినా, కార్మికులు చనిపోయినా, నామమాత్రంగా నష్ట పరిహారం చెల్లిస్తే చాలు, తతిమ్మాది మేం చూసుకుంటాం'' అని కార్పొరేట్‌ ప్రపంచానికి చంద్రబాబు ప్రభుత్వం పంపుతున్న సందేశం ఇది. కార్పొరేట్ల కోసం, కార్పొరేట్ల చేత ఎంపిక చేయబడినవారితో ఏర్పడిన కార్పొరేట్‌ ప్రభుత్వాలు ఇప్పుడు మనల్ని పాలిస్తున్నాయి. ఎటొచ్చీ ఓట్లు, తిప్పలు మాత్రం మనవే సుమా.


- ఎం.వి.ఎస్‌. శర్మ

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్