- వి రాంభూపాల్
ఎనిమిది దశాబ్దాల తర్వాత దేశంలో త్రివర్ణ పతాకం ఆంక్షలను ఎదుర్కొంటోంది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ‘లెహ్రా దో తిరంగా’ (త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయండి) కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు సిజెపి నేతలతో పాటు, వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల నాయకులను అరెస్టు చేశారు. జాతీయ పతాకం కేవలం రంగుల సమాహారం కాదు. దేశ ప్రజల స్వాతంత్య్ర ఆకాంక్షలకు, ఆత్మగౌరవానికి, ఐక్యతకు అది ఒక ప్రతీక. భారత స్వాతంత్య్రోద్యమంలో త్రివర్ణ పతాకం ఎగురవేయడం ఒక సాధారణ కార్యక్రమం కాదు. అది బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ప్రకటించిన రాజకీయ నిరసన. అందుకే బ్రిటిష్ పాలకులు అనేక సందర్భాల్లో జాతీయ పతాక ప్రదర్శనను అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఆ పతాక స్వేచ్ఛా విహంగం కోసం ఎందరో అసమాన త్యాగాలు చేశారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మత సామరస్యం కోసం, పౌరహక్కుల రక్షణ కోసం త్రివర్ణ పతాకం నిరసన ఆయుధంగా మారింది. ఇటీవల ‘నీట్’ లీకేజికి, ఓట్ల తొలగింపునకు వ్యతిరేకంగా త్రివర్ణ పతాకాన్ని చేతబూని యువత ఉద్యమిస్తుంటే కేంద్ర పాలకులు ఆంక్షలతో అడ్డుకుంటున్నారు. శుక్రవారం ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్లోని సెంట్రల్ పార్క్లో ‘లెహ్రా దో తిరంగా’కు కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) ఇచ్చిన పిలుపునకు విద్యార్థి, యువజన, పౌర సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి కేంద్ర బిజెపి పాలకులు సైనిక బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. ‘పరిపాలనా కారణాల’ వల్ల ఆ పార్కును 16,17 తేదీలలో మూసివేస్తున్నట్లు న్యూ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు. శాంతిభద్రతలను కాపాడటానికి, మానవ ప్రాణాలను, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను రక్షించడానికి భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బి.ఎన్.ఎస్.ఎస్) సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు విధించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. గత కొన్ని వారాలుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులను, యువతను, ముఖ్యంగా అమ్మాయిలను క్రూరంగా రోడ్లపై ఈడుస్తూ, పోలీసు వ్యానులలో రిజర్వు దళాలు దారుణంగా హింసించడం, సిపిఎం ఎంపి జాన్ బ్రిట్టాస్ పై దాడి చేయడం ఏ శాంతిభద్రతల పరిరక్షణ కోసం? ఆర్ఎస్ఎస్, బజరంగ్దళ్ గూండాలు మైనర్ అమ్మాయిలపై దాడులు చేయడమే కాకుండా వారి దుస్తులను లాగివేయడానికి చేసిన ఆటవిక చర్యలను దేశమంతా చూసింది. కానీ ఢిల్లీ పోలీసులకు మాత్రం అది శాంతిభద్రతల సమస్యగా కనిపించడంలేదు.
జాతీయోద్యమంలో ఎలాంటి పాత్ర లేని కుదురు నుండి ఆవిర్భవించిన బిజెపి నేడు ఆ జాతీయ పతాకాన్ని చూసి భయపడుతున్నది. అది కేవలం మూడు రంగుల వస్త్రం కాదని, బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా దేశ ప్రజల ఐక్యతకు, స్వాతంత్య్ర ఆకాంక్షకు, జాతీయ ఆత్మగౌరవానికి, అన్నిటికన్నా ముఖ్యంగా మత సామరస్యానికి ప్రతీక అని బిజెపి పాలకులకు తెలుసు. అందుకే అంత కలవరపడుతున్నది. అంతేకాదు, బిజెపి మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ జాతీయ పతాకం గురించి తన అధికార పత్రిక ‘ఆర్గనైజర్’ 1947 ఆగస్టు 15 సంచికలో ‘ఏదో అదృష్టవశాత్తు అధికారానికి వచ్చినవాళ్లు మూడు రంగుల జెండాని మన చేతుల్లో పెట్టవచ్చు, కానీ,.... మూడు అనే పదమే చెడ్డది. అలాంటిది ఇక మూడు రంగులు కలిగిన జెండా ఖచ్చితంగా మానసికంగా, అత్యంత దుష్ప్రభావాన్ని వేస్తుంది. ఇది దేశానికి హాని కలిగిస్తుంది’ అని రాసింది. అలాగే 1946 జులై 14న నాగపూర్లో జరిగిన గురు పూర్ణిమ సభలో ఆర్ఎస్ఎస్ అధినేత గోల్వాల్కర్ మాట్లాడుతూ ‘అంతిమంగా ఈ దేశం అంతా కాషాయ జెండా ముందు తల వంచి తీరుతుందని మేము దృఢంగా నమ్ముతున్నాము’ అన్నారు. కాబట్టే ఈనాడు త్రివర్ణ పతాక ప్రదర్శనలపై విధిస్తున్న ఆంక్షలు కేవలం శాంతిభద్రతల సమస్య కాదు, అది బిజెపి దీర్ఘకాలిక వ్యూహంలో భాగం. అందుకే ఢిల్లీ నగరాన్ని జైలుగా మార్చింది. వేల మంది సైనికులను మోహరించింది. రైళ్ల రాకపోకలను కుదించి, ఇంటర్నెట్ సదుపాయాలను రద్దు చేసి, నిరసన ప్రదేశాలను వరుసగా నిషేధిస్తున్నది.
చరిత్రలో త్రివర్ణ పతాక పోరాటం
జాతీయ పతాక చరిత్రలో 1906 ఆగస్టు 7 ఒక ముఖ్యమైన మైలురాయి. కలకత్తా లోని పార్శీ బగాన్ స్క్వేర్లో స్వాతంత్య్రయోధులు ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగులతో కూడిన ఒక పతాకాన్ని ఎగురవేశారు. భారతదేశానికి ప్రత్యేకమైన జాతీయ పతాకం ఉండాలనే ఆకాంక్షకు ప్రతీకగా, ఐక్యతను ప్రతిబింబించేదిగా నిలచింది. ఆ తర్వాత 1907 ఆగస్టు 22న, జర్మనీలోని స్టుట్గార్ట్లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్టు మహాసభలో మేడమ్ కామా విదేశీ గడ్డపై భారత స్వాతంత్య్ర ఆకాంక్షను ప్రతిబింబించే పతాకాన్ని ప్రదర్శించారు. 1921లో విజయవాడలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మన రాష్ట్రానికి చెందిన పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకం జాతీయోద్యమ చిహ్నంగా ప్రజల మదిలో స్థానం సంపాదించింది. ఇవన్నీ ఆర్ఎస్ఎస్ ఏర్పడక ముందే జరిగాయని గుర్తించుకోవాలి.
ప్రజాస్వామ్య హక్కులకు ముప్పు
జాతీయోద్యమంలో భాగంగానే ప్రజల్లో ప్రజాస్వామ్య భావాలు మొలకెత్తాయి. పౌరులందరికి సమాన ఓటు హక్కు కావాలని, ఎన్నికల ద్వారా తమ అభిప్రాయాలు ప్రతిబింబిస్తాయని పౌరులు బలంగా విశ్వసించారు. తమ సమస్యలను ప్రభుత్వాలకు నివేదించుకోవడానికి అవసరమైన భావ ప్రకటనా స్వేచ్ఛ, తమ ఆచార, సాంప్రదాయాలను, విశ్వాసాలను కొనసాగించుకోవడానికి చట్టం రక్షణ కల్పించాలని కోరుకున్నారు. వీటికి భారత రాజ్యాంగం హామీ ఇచ్చింది. గెలిచినవారు తమకు అపరిమిత అధికారాలు ఉండాలని, అధికారం శాశ్వతంగా తమ చేతుల్లోనే ఉండాలని నియంతృత్వ పోకడలు అనుసరించిన ప్రతి సందర్భంలో పౌరులు ఉద్యమించి తమ హక్కులను, రాజ్యాంగాన్ని రక్షించుకున్నారు. మోడీ ప్రభుత్వం ఆ చరిత్రను మరచి, విశ్వవిద్యాలయ విద్యార్థులపై, మైనారిటీలపై, ప్రతిపక్షాలపై చేసిన దాడులు చివరకు పౌరుల ఓటు హక్కునే హరించే స్థాయికి చేరాయి. నేడు బిజెపి చెబుతున్న ‘‘ఆయేగా తో మోడీ హీ” (అధికారంలోకి వచ్చేది మాత్రం మోడీనే) అనే నినాదం వెనుక ప్రజా విశ్వాసం కంటే ఎన్నికల వ్యవస్థను దుర్వినియోగం చేయడమే కీలకమని చాలా కాలంగా కొందరు వాదిస్తున్నారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ‘సర్’ ప్రక్రియలో 13 కోట్ల మంది పౌరుల ఓట్లు గల్లంతు కావడం, ఎన్నికల కమిషన్ లో ప్రజాస్వామ్య పద్ధతులు పాటించకపోవడంతో యువతలో అసంతృప్తి రగులుకుంది.
తీవ్రమవుతున్న ఆర్థిక అసమానతలు, పెరుగుతున్న నిరుద్యోగం గురించి నేటి యువ నిరసనకారులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యలకు మూలం కేవలం ఆర్థిక విధానాలు మాత్రమే కాదు, ఎన్నికల వ్యవస్థను స్వాధీనం చేసుకున్న పాలకుల జవాబుదారీతనం లోపించడంలో ఉందని యువత స్పష్టంగా గుర్తించారు. ఒకరిద్దరు వ్యక్తుల చుట్టూ అధికార వ్యవస్థ కేంద్రీకృతమై, రాజ్యాంగ సంస్థలన్నీ పాలకులకు అనుకూలంగా మారుతూ, సంపద కొద్దిమంది దగ్గరకు చేరడం, రాజకీయ విరాళాలు, మీడియా యాజమాన్యం, ఉన్నత స్థానాల్లోని న్యాయమూర్తులు పదవీ విరమణ అనంతరం పొందుతున్న లబ్ధి, పరీక్షా పత్రాల లీకేజి, సామ్రాజ్యవాదానికి సాగిలపడుతున్న పాలకుల తీరు యువతలో అసంతృప్తి పెరగడానికి కారణమైంది.
ప్రశ్నించడాన్ని సహించలేని బిజెపి ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది. జాతీయ పతాక ప్రదర్శనను కూడా అడ్డుకుంటున్నది. నిరసన అనేది ప్రజాస్వామ్యంలో భాగమని వారు గుర్తించడంలేదు. నేరం చేసిన వారిని శిక్షించాలని పౌరులు కోరడం నేరంగా పరిగణిస్తున్నది. తమను అంగీకరించని వారంతా దేశద్రోహులు అంటూ నిందిస్తున్నది. నాటి బ్రిటిష్ ప్రభుత్వం జాతీయోద్యమ నాయకులపై ఇలాంటి నిర్బంధాలను ప్రయోగించింది. నిందలు మోపింది. మత సంస్థలను ప్రోత్సహించడం ద్వారా ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేయాలని చూసింది. ఆనాడు అన్ని స్రవంతులు ఏకమై త్రివర్ణ పతాకం చేబూని రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పారద్రోలిన జాతీయ స్ఫూర్తి నేడు దేశవ్యాప్తంగా ప్రజ్వరిల్లుతున్నది.







కామెంట్లు (0)