అక్టోబరు 10న దేశ రాజధాని వీధుల్లోకి వచ్చిన నిరసనకారులను అక్కడ నుండి పారద్రోలడంలో ఢిల్లీ పోలీసులు, వారికి అదనపు బలం కోసం రప్పించిన కేంద్ర బలగాలు విజయం సాధించి వుండవచ్చు, అయితే, శాంతియుతంగా సమావేశమయ్యే, స్వేచ్ఛగా కదిలే హక్కుపై వారు ఆంక్షలు విధించారు. దాదాపుగా ఏడు వేల మందిని నిర్బంధించారు. నిరసన గళాలు బహిరంగ ప్రదేశాల్లో వినబడకుండా చూసుకున్నారు. జులైలో నిరసనకారులపై ప్రయోగించిన హింస కన్నా అధికంగా ఉపయోగించకుండానే వారు ఇదంతా చేసేశారు. కానీ దురదృష్టవశాత్తూ, ఢిల్లీ పోలీసులకు, వారి రాజకీయ బాస్‌లకు ఈ కథ ఇంతటితో ముగియలేదు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్.ఐ.ఆర్) ప్రక్రియలో ఎన్నికల కమిషన్ పని తీరు, ముఖ్యంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వ్యవహార శైలి గురించి ఈ వార్తా పత్రిక దర్యాప్తులో ప్రముఖంగా ప్రస్తావించబడిన అనేకానేక ప్రశ్నలు, ఆందోళనలు ఇంకా అపరిష్కృతంగానే వున్నాయి. రాజధానిలో దశలవారీగా పెట్టిన బారికేడ్లు ఆందోళనకారుల సమీకరణలకు అంతరాయం కలిగించి వుండవచ్చు. లేదా వారు అటూ ఇటూ చెల్లాచెదురై వుండవచ్చు. కానీ ఢిల్లీ కోటలో ఇ.సి ఇప్పటికీ ఆందోళన కలిగించే బలహీనమైన చిరునామాగా నిలిచే వుంది. ఎన్నికల కమిషన్ మరింత పారదర్శకంగా వ్యవహరించాలని, జవాబుదారీతనం కావాలని కోరుతున్న గళాలను అణచి వేసేందుకు జరిగే ప్రతి ప్రయత్నం వల్లా ..ఆ గళాలు మరింత బిగ్గరగా, మరింత స్పష్టంగా వినిపిస్తాయి.
రాజధానిలో శనివారం చోటు చేసుకున్న అణచివేత సిజెపి నేతృత్వంలోని ఆందోళనకారులకు, నరేంద్ర మోడీ ప్రభుత్వం మధ్య జరుగుతున్న ఘర్షణలా అనిపించవచ్చు. అనేక ఏళ్ళ నుండి తాము పెట్టుకున్న నిబంధనలు, విధి విధానాలనే అనుసరిస్తూ వచ్చిన పాలక పార్టీ ప్రతినిధులు ఆ భావనను గట్టిగా నొక్కి చెప్పారు. ఆందోళనకారులను వారు చాలా దూకుడుగా చుట్టుముట్టారు. వారిని దూషించారు. వారిని అస్థిర శక్తులుగా, అరాచకవాదులుగా ముద్ర వేశారు. వారికి విదేశీ శక్తుల నుండి మద్దతు అందుతోందని ఆరోపించారు. కానీ ఇక్కడ వాస్తవం ఏమంటే, రాజ్యాంగబద్ధమైన సంస్థ, ఆ రోజున ఏ ప్రభుత్వం వున్నా దానితో సంబంధం లేకుండా స్వతంత్రంగా వుండే సంస్థ ఈ ఘర్షణకు కేంద్ర బిందువుగా మారింది. అస్పష్టమైన మౌనాన్ని పాటిస్తున్నప్పటికీ, ఎన్నికల కమిషన్ అనేక కీలక ప్రశ్నలకు జవాబు దొరకని రీతిలో ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. తన గురించి తాను మాట్లాడకపోవడం ద్వారా, తనపై విమర్శలు చేసే వారిపై కనివినీ ఎరుగని రీతిలో అణచివేతకు దిగేలా కేంద్రాన్ని అనుమతించడం ద్వారా ఎన్నికల కమిషన్, తాను ఎంతగానో కష్టపడి సంపాదించకున్న స్వయంప్రతిపత్తిని దెబ్బతీసుకుంది. ఇదిలా వుండగా, సిజెపి - బిజెపి మధ్య సాగుతున్న మాటల యుద్ధం మరో ఆందోళనకరమైన లోపం వైపునకు దృష్టిని మళ్లించింది. కేవలం బిజెపినే కాదు, మొత్తంగా రాజకీయ నాయకత్వం యువతతో మాట్లాడేందుకు సరైన భాషను, పదజాలాన్ని వాడడం లేదని తెలుస్తోంది. శనివారం తమ మాజీ ముఖ్యమంత్రులు నిర్బంధించబడిన ప్రతిపక్ష పార్టీలు కూడా కేవలం వారి అశాంతి, ఆందోళనలపై ఆధారపడడం లేదా వారి సమీకరణలను కొనసాగించడం కన్నా జెన్ జెడ్‌తో మాట్లాడాలన్నా, వారి ఆందోళనలను పరిష్కరించాలన్నా కూడా ముందు తమ పదజాలాన్ని మరింత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం వుంది.
వ్యక్తిగత స్వేచ్ఛలకు కలుగుతున్న ఆటంకాలు, అంతరాయాల పట్ల కాస్తంత తక్కువగా శ్రద్ధ పెట్టినట్లుగా వున్నా, పాలనాపరమైన అనివార్యతలకు కొంత కట్టుబడినట్లు కనిపించినా కొన్ని లక్ష్మణ రేఖలు గీసేందుకు ఆదివారం కూడా ప్రత్యేకంగా సమావేశమై సుప్రీంకోర్టు మంచి పని చేసింది. కానీ వారం ముగిసేటప్పటికి, ఒక దృశ్యం, ఒక ప్రశ్న నిశ్శబ్ద తుపాను కేంద్రంలో చిక్కుకుపోయాయి. సిఇసి తనకు తానుగా సృష్టించుకున్న సమస్యల వలయంలో చిక్కుకుపోయారు. ఓటర్లందరికీ ముఖ్యంగా యువతకు సృజనాత్మకంగా ఆకట్టుకునే రీతిలో చేరువ కావడంలో సుదీర్ఘకాలంగా గర్వకారణంగా నిలిచిన ఒక వ్యవస్థ ఇసి. దీనిపై వచ్చిన ప్రశ్నలను గుర్తించడానికి లేదా సమాధానాలివ్వడానికి కూడా తాను తిరస్కరించడమనేది తీవ్ర ప్రభావం చూపుతోందన్న విషయాన్ని గ్రహించాలంటే జ్ఞానేష్ కుమార్‌కు ఇంకా ఏం జరగాలి? ఈ విశ్వసనీయతా సంక్షోభాన్ని బంధించి వుంచేందుకు ఏ నిర్బంధ కేంద్రమూ సరిపోదు.
(‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సంపాదకీయం)







కామెంట్‌లు (0)