శనివారం, 19 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బ్రిక్స్ - పరస్పర వైరుధ్యాల నడుమ ఆకాంక్షలు​

10 గంటల క్రితం

brics
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 19, 2026, 04:30 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

న్యూఢిల్లీలో సెప్టెంబర్ 12-13 తేదీల్లో జరిగిన బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం 140 అంశాలతో కూడిన ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇది ఒకవైపు 'గ్లోబల్ సౌత్' (అభివృద్ధి చెందుతున్న దేశాల) ఆకాంక్షల ప్రకటనగానూ, మరొకవైపు ఈ వేదికలోని అంతర్గత వైరుధ్యాలకు అద్దం పట్టేదిగానూ ఉంది. వామపక్షాల దృక్కోణంలో, దీనిని గుడ్డిగా ప్రశంసించడం గానీ లేదా పూర్తిగా తోసిపుచ్చడం గానీ సరికాదు. అమెరికా నేతృత్వంలోని ఏకధ్రువ ప్రపంచ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటాన్ని ఇది ఎక్కడ ముందుకు తీసుకెళ్తోంది, ఎక్కడ విఫలమవుతోంది, అలాగే భారత ప్రభుత్వ నడవడిక ఈ ప్రకటన స్ఫూర్తిని ఎలా దెబ్బ తీస్తోందో విమర్శనాత్మకంగా అర్థం చేసుకోవడమే మన ముందున్న బాధ్యత. ​

బ్రిక్స్ అనేది ఒక సామ్రాజ్యవాద వ్యతిరేక కూటమి కాదు. అమెరికా ప్రోత్సహిస్తున్న ఏకధ్రువ వ్యవస్థకు వ్యతిరేకంగా బహుళ ధ్రువ ప్రపంచాన్ని బలపరిచే ఒక వేదిక మాత్రమే. ఈ వ్యత్యాసాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. ఈ గ్రూపులో రాడికల్ గా భిన్నమైన సామాజిక వ్యవస్థలు కలిగిన దేశాలు ఉన్నాయి. అవి... చైనా (సోషలిస్ట్ దిశగా సాగే ఆర్థిక వ్యవస్థ, రష్యా (స్వార్ధపర సంపన్న వర్గాల పెట్టుబడిదారీ విధానం), భారత్‌ (కార్పొరేట్ - హిందుత్వ శక్తుల కూటమి ఆధ్వర్యంలో నడుస్తున్న బడా బూర్జువా -భూస్వామ్య రాజ్యం).

కూటమి విస్తరించే కొద్దీ ఈ వైవిధ్యం మరింత పెరుగుతుంది. కాబట్టి వీరంతా ఒకే సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట భాగస్వాములు కారు. వీరంతా డాలర్ ఆధిపత్యంతో, అమెరికా కేంద్రీకృతంగా సాగుతున్న ప్రజాస్వామ్య రహిత అంతర్జాతీయ వ్యవస్థలో తమకంటూ కొంత స్వతంత్ర స్థానాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తున్న దేశాలు మాత్రమే.

ఈ పరిమితి సహజమైనది. అందుకే ఈ ఢిల్లీ ప్రకటన ఎక్కడా అమెరికా పేరు నేరుగా ఎత్తకుండా 'ఏకపక్ష నిర్బంధ చర్యలను' ఖండించింది. అలాగే పశ్చిమాసియాలో ఇజ్రాయిల్ ను ఆక్రమణదారుగా వేలెత్తి చూపకుండా 'గరిష్ట సంయమనం' పాటించాలని పిలుపునిచ్చింది. ప్రకటనలోని ఈ మౌనాలు యాదృచ్ఛికం కావు. భిన్నమైన ప్రయోజనాలు, భిన్న వర్గ సంబంధాలు కలిగిన రాజ్యాల మధ్య ఐకమత్యం కోసం చెల్లించిన మూల్యం ఇది.

​రాజకీయ ప్రాబల్యం లేని ఆర్థిక బలం

​ బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభాలో సగానికి పైగా, ప్రపంచ జిడిపి లో దాదాపు మూడో వంతు వాటాను కలిగి ఉన్నాయి. అవి అపారమైన ఆర్థిక బలాన్ని కలిగి ఉన్నప్పటికీ, ఐరాస, ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థలలో వాటికి తగినంత రాజకీయ ప్రాబల్యం లేదు.

ఈ వ్యత్యాసాన్ని సరిదిద్దడానికే ఢిల్లీ ప్రకటన ప్రయత్నించింది. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న చైనా, రష్యాలతో పాటు ఇతర దేశాలకు తగిన భాగస్వామ్యం లభించేలా భద్రతా మండలి సంస్కరణలు చేపట్టాలని ఈ ప్రకటన కోరింది.

మహిళా నాయకత్వం

'ఇంతవరకు ఏ మహిళ కూడా ఐరాస సెక్రటరీ జనరల్‌గా ఎన్నిక కాలేదు' అని ఈ ప్రకటన ప్రత్యేకంగా గుర్తు చేయడం అభినందనీయం. త్వరలో జరగబోయే కొత్త సెక్రటరీ జనరల్ ఎన్నికల్లో దీనిని సరిదిద్దాలని, అలా ఎన్నికయ్యే మహిళ గ్లోబల్ సౌత్ ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తి అయి ఉండాలని పేర్కొంది.

ఆర్థిక సంస్థల సంస్కరణలు

అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాతినిధ్యం పెరిగేలా ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకులలో సంస్కరణలు కావాలని, డబ్ల్యూటిఒ సంస్కరణల ద్వారా బహిరంగ, పారదర్శక బహుళపక్ష వ్యాపార వ్యవస్థకు మద్దతు తెలపాలని ప్రకటన కోరింది.

క్యూబాకు మద్దతు

క్యూబాపై అమెరికా విధిస్తున్న ఏకపక్ష దిగ్బంధనాన్ని తీవ్రంగా నిరసిస్తూ, దానిని తక్షణమే ముగించాలని పునరుద్ఘాటించింది. అయితే, ఈ చర్యలన్నీ ప్రపంచ పెట్టుబడిదారీ సంస్థల పరిధిలోనే జరిగే సంస్కరణలు తప్ప, వాటిని అధిగమించేవి కావు. డాలర్ రిజర్వ్ కరెన్సీ హోదాను గానీ, అభివృద్ధి చెందుతున్న దేశాలను శాశ్వత అప్పుల ఊబిలోకి నెట్టే ఐ.ఎం.ఎఫ్ షరతులను గానీ ఈ ప్రకటన నేరుగా సవాలు చేయలేకపోయింది. ​

గ్లోబల్ సౌత్ ఎదుర్కొంటున్న సవాళ్లు ​

పేదరికం, ఆరోగ్య సంరక్షణ, నిరుద్యోగం, అప్పుల భారం, కృత్రిమ మేధ వంటివి గ్లోబల్ సౌత్ దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు (వందల మిలియన్ల మందిని పేదరికం నుండి బయటపడేసి, స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేసుకున్న చైనా మినహా మిగిలిన బ్రిక్స్ దేశాలన్నీ ఈ సమస్యలతో సతమతమవుతున్నాయి). ఈ సవాళ్లను ఎదుర్కోవాలంటే అమెరికా సామ్రాజ్యవాదానికి, దాని దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా నిలబడాలి. అమెరికా కార్పొరేషన్ల చేతిలో ఉన్న సాంకేతిక మేధోసంపత్తి హక్కుల దుర్మార్గమైన వ్యవస్థను మార్చకుండా ఉచిత ఎ.ఐ వనరుల గురించి మాట్లాడటం, పెద్ద ఫార్మా కంపెనీల ఏకఛత్రాధిపత్యాన్ని సవాలు చేయకుండా అందరికీ ఆరోగ్యం గురించి మాట్లాడటం నిరర్థకం.

వాతావరణ మార్పులు - పరిహారం చెల్లించాల్సింది అభివృద్ధి చెందిన దేశాలే

ఇటీవల నేపాల్‌‌లో జరిగిన ప్రకృతి విపత్తులు, భారతదేశంలో ఎల్-నినో ప్రభావం వల్ల వచ్చిన అకాల వర్షాలు, వరదలు, కరువు వంటివి వాతావరణ మార్పు తీవ్రతను చూపుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న నిధుల కొరతను డిక్లరేషన్‌ గుర్తించినప్పటికీ, అసలు నేరస్తుల పేర్లను వెల్లడించడానికి సంకోచించింది.

వాతావరణ సంక్షోభ పరిష్కారం అందరి ఉమ్మడి బాధ్యత కాదు. గత రెండు శతాబ్దాలుగా అభివృద్ధి చెందిన దేశాలు అపరిమితంగా చేసిన కర్బన ఉద్గారాల ఫలితమే ఇది. ఐరాస నిర్దేశించిన "ఉమ్మడి విభిన్న బాధ్యతల" సూత్రాన్ని కాపాడాలి. తమ వలసలుగా మార్చుకుని దోచుకున్న దేశాలకు అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలు 'వాతావరణ రుణం'(క్లయిమేట్‌ డెట్‌) బాకీ ఉన్నాయి; వారు సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడం ద్వారా, ఉద్గారాలను తగ్గించడం ద్వారా ఈ పరిహారాన్ని చెల్లించాలి. ​

అమెరికా సామ్రాజ్యవా‌దానికి జూనియర్ భాగస్వామిగా భారత్‌ ​

న్యూఢిల్లీ శిఖరాగ్ర సదస్సులో అత్యంత తీవ్రమైన వైరుధ్యం భారత ప్రభుత్వ నడవడికే. బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమెరికాతో రాజీ పడుతూ, దానికి జూనియర్ భాగస్వామిగా వ్యవహరించే విదేశాంగ విధానాన్ని అవలంబిస్తోంది. ఇది బహుళ ధ్రువ ప్రపంచ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం.

చైనాను కట్టడి చేసే లక్ష్యంతో అమెరికా తీసుకొచ్చిన క్వాడ్, ఆకస్ వంటి సైనిక పొత్తులలో భారత్ భాగస్వామ్యాన్ని పెంచుకుంది. -1967 సరిహద్దుల ప్రకారం తూర్పు జెరూసలేం రాజధానిగా స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటుకు ప్రకటన మద్దతు తెలిపినప్పటికీ, భారత్ మాత్రం ఇజ్రాయిల్‌తో వ్యూహాత్మక సంబంధాలను కొనసాగిస్తోంది. - ఇరాన్, వెనిజులా, క్యూబాలపై అమెరికా సాగిస్తున్న దాడిపై గానీ, గాజాలో ఇజ్రాయిల్ సాగిస్తున్న నరమేధంపై గానీ భారత్ నిష్పక్షపాతంగా స్పందించడంలో విఫలమైంది. ​

మోడీ ప్రభుత్వం అమెరికా అడుగులకు మడుగులొత్తుతూ, గ్లోబల్ సౌత్ వేదికపై పెద్దపీట వేసుకోవాలని చూస్తోంది. విదేశాంగ విధానాన్ని పునఃసమీక్షించుకుని పాలస్తీనా, ఇరాన్, క్యూబాలకు భారత్ మద్దతుగా నిలబడాలి. అంతర్జాతీయంగా అరబ్ ప్రపంచంలో 84 శాతం మంది ఇజ్రాయిల్‌‌ను, 77 శాతం మంది దాదపు అమెరికాను తమ భద్రతకు పెద్ద ముప్పుగా భావిస్తున్నారని వివిధ సర్వేలు (అరబ్ సెంటర్, ‘పూ’ రీసెర్చ్) స్పష్టం చేస్తున్నాయి. ఈ వాస్తవాన్ని భారత్ గ్రహించాలి. ​అలాగే, సదస్సుకు ముందు పేదరికం కనిపించకుండా మురికివాడలను మూసివేయడం, నిరాశ్రయులను నగరాల బయటకు తోసివేయడం ద్వారా పేదరికాన్ని దాచలేరు. పేదరికం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగాలను ఆర్థిక గణాంకాలతో మాయ చేయలేరు. ​

మన ముందున్న కర్తవ్యం

న్యూఢిల్లీ ప్రకటన గ్లోబల్ సౌత్ ఆందోళనలను వ్యక్తపరిచింది. కానీ కేవలం ప్రకటనలు ప్రజలకు విముక్తిని కలిగించలేవు. పోరాటాలు మాత్రమే మార్పును తెస్తాయి. మోడీ ప్రభుత్వ మాటలకు, చేతలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వామపక్షాలు ఎండగట్టాలి. ప్రభుత్వాన్ని జవాబుదారీగా చేయాలి. బ్రిక్స్ అనేది సామ్రాజ్యవాద వ్యతిరేక వేదిక కాకపోవచ్చు, కానీ దానిని విడిచిపెట్టడం కాకుండా, బహుళ ధ్రువ వ్యవస్థ పరిమితులను దాటి మరింత ప్రగతిశీల దిశగా నెట్టడమే మన పని.

పాలస్తీనా, ఇరాన్, క్యూబా, వెనిజులా ప్రజలకు కావల సింది ప్రకటనలు కాదు, ఆచరణాత్మక చర్యలు. ఆ చర్యలు కార్మికవర్గం, రైతాంగం, యువత నిర్మించే సంఘటిత పోరా టాల నుండే ఉత్పన్నమవుతాయి. పోరాటం కొనసాగుతుంది.​


- వ్యాసకర్త: ఎం.ఎ. బేబీ, సిపిఎం ప్రధాన కార్యదర్శి

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్