గురువారం, 13 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకాస్ట్రో స్ఫూర్తి అజరామరం

17 గంటల క్రితం

fidel castro100
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 13, 2026, 05:42 పూర్వాహ్నం | 5 నిమిషాల చదవడం

క్యూబా విప్లవ నేత, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట యోధుడు ఫైడల్‌ కాస్ట్రో శతజయంతిని ఆగస్టు 13న ప్రపంచంలోని పురోగామి శక్తులన్నీ ఎంతో స్ఫూర్తివంతంగా నిర్వహిస్తున్నాయి. 1926 ఆగస్టు 13న క్యూబాలోని చిన్న పట్టణంలో జన్మించిన కాస్ట్రో 2016 నవంబర్‌ 25న రాజధాని హవానాలో మరణించారు. 90 ఏళ్ల నిండు జీవితంలో కాస్ట్రో క్యూబా ప్రజలకే కాకుండా విశ్వ మానవాళికి చేసిన సేవలు, అందించిన స్ఫూర్తి అద్వితీయమైనవి. సహచరుడు చే గువేరా, సోదరుడు రావుల్‌ కాస్ట్రో తదితరులతో కలిసి ఆయన 1959లో క్యూబాలో విప్లవాన్ని సాధించడం ద్వారా, అమెరికా తన ''పెరటి దొడ్డి''గా భావిస్తున్న లాటిన్‌ అమెరికా ఖండంలో విప్లవాలకు తలుపులు తెరిచాడు. కాస్ట్రో కృషి క్యూబాకు మాత్రమే పరిమితమైనది కాదు. క్యూబా విప్లవ సాధనలోనూ, అక్కడ సోషలిజం నిర్మాణంలోనూ, అంతర్జాతీయంగా వలస విముక్తి పోరాటాలకు ప్రత్యక్ష, పరోక్ష సాయాన్ని అందించడం లోనూ, ప్రపంచంలో ఎక్కడ విపత్తులు జరిగినా అక్కడికి క్యూబా వైద్యులను, సహాయక సిబ్బందిని పంపించి ప్రజలకు సేవలు అందించడంలోనూ, లాటిన్‌ అమెరికా ఖండంలో సామ్రాజ్యవాద వ్యతిరేక కూటముల ఏర్పాటులోనూ కాస్ట్రో చేసిన ఎనలేని కృషి ఆయనను గొప్ప అంతర్జాతీయ నేతగా, విశ్వమానవాళి సంక్షేమాన్ని కాంక్షించే మానవతా వాదిగా నిలిపాయి.

శతజయంతి సందర్భంగా ఫైడల్‌ కాస్ట్రో విశ్వమానవాళికి చేసిన సేవలను స్మరించుకోవడంతోపాటు ఆయన అందించిన విప్లవ వారసత్వాన్ని, సామ్రాజ్యవాద వ్యతిరేక స్ఫూర్తిని నేటి యువతరానికి బదిలీ చేయడం అవసరం. అందునా ప్రపంచమంతటా, మన దేశంలోనూ మితవాద శక్తుల రాజకీయ కుట్రలపై జెన్‌ జి తరం తిరుగుబాటు చేస్తున్న ఈ సమయంలో ఇది మరింత అవసరం.

క్యూబా విప్లవంలో కాస్ట్రో నిర్వహించిన నాయకత్వం పాత్ర

క్యూబాలో విప్లవం సాధించే నాటికి కాస్ట్రో 33 ఏళ్ల యువకుడు. విద్యార్థి దశ నుండే ఆయన ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఎక్కుపెట్టాడు. క్యూబాలోని వనరులన్నిటిపై అమెరికా సామ్రాజ్యవాదులు పెత్తనం సాగిస్తూ ప్రజలను పీల్చిపిప్పి చేస్తుండడం, దీనికి నిరంకుశ క్యూబా పాలకులు వత్తాసు పలకడం నాటి యువతరం సహించలేకపోయింది. ఈ దోపిడీ విధానాలపై పోరాట బావుటా ఎగురవేసింది. కాస్ట్రో అనేక పోరాటాల్లో పాల్గొన్నాడు, నాయకత్వం వహించాడు. అమెరికా సాయంతో ఆ పోరాటాలను నిరంకుశంగా అణచివేస్తున్న పాలకులపై సాయుధ తిరగుబాటే మార్గమని భావించిన యువకులు ఆయుధాల కోసం సైనిక స్ధావరాలపై దాడులు చేశారు. 1953 జులై 26 కాస్ట్రో నాయకత్వంలో మోంకాడా సైనిక బరాక్‌పై దాడి చేశారు. అది విఫలమైంది. నాటి క్యూబా నియంత బాటిస్టా సైన్యం 80 మంది యువకులను ఊచకోత కోసి చంపింది. కాస్ట్రోను అరెస్టు చేసి విచారణ చేపట్టినప్పుడు ఆయన తన తరఫున కోర్టులో తనే వాదించుకుంటూ తన పోరాటాన్ని సమర్ధించుకున్నాడు. సాహసంగా అనిపించినా ఇది సరైందని కాలమే నిర్ణయిస్తుంది, ''చరిత్ర నన్ను నిర్దోషిగా ప్రకటిస్తుంది,'' అని కాస్ట్రో న్యాయమూర్తి ముందు ధైర్యంగా ప్రకటించాడు.

మాంకాడా తిరుగుబాటు అంతం కాలేదు. అది జులై 26 ఉద్యమంగా చిగురించి అనేక ప్రాంతాలకు విస్తరించింది. అమెరికన్‌ సామ్రాజ్యవాద దోపిడీ, బాటిస్టా ప్రభుత్వ నిరంకుశ అణచివేతల మధ్య ప్రజలు నలిగిపోతున్న క్యూబాలో పరిస్థితులు విప్లవానికి అనుకూలంగా ఉన్నాయని గ్రహించిన కాస్ట్రో 82 మంది 'జులై 26 ఉద్యమకారులను' తీసుకుని మెక్సికో నుండి ''గ్రాన్మా'' పడవలో బయలుదేరాడు. వారి బృందంలో చే గువేరా, రావుల్‌ కాస్ట్రోలు కూడా ఉన్నారు. వారు క్యూబా తీరాన్ని చేరుకోవడంతోనే పసికట్టిన బాటిస్టా దళాలు పెద్ద ఎత్తున తిరుగుబాటుదారులపై దాడి చేశాయి. 82 మందిలో 17 మంది మినహా మిగిలిన అందరూ చనిపోయారు. మిగిలిన యోధులు గెరిల్లా యుద్ధ తంత్రాన్ని అనుసరించారు. రైతాంగం, పట్టణ మధ్యతరగతి మద్దతు కూడగట్టారు. నాలుగు దళాలుగా విడిపోయి నాలుగు వైపుల నుండి హవానాకు దండయాత్ర సాగించారు. 1959 జనవరి 1న హవానా విప్లవకారుల వశమైంది. క్యూబా విప్లవం విజయం సాధించింది. ఆ విధంగా క్యూబాలోనే కాదు లాటిన్‌ అమెరికా ఖండంలో ఒక కొత్త శకం ప్రారంభమైంది. కాస్ట్రో దేశ పాలనా పగ్గాలు చేపట్టి, కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో సోషలిజం నిర్మాణానికి నడుం కట్టాడు.

అమెరికా సామ్రాజ్యవాదులను కాస్ట్రో ఎదిరించిన తీరు

ప్రపంచ పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద అగ్రరాజ్యం, అమెరికాకు కేవలం 90 మైళ్ల (సుమారు 140 కిలో మీటర్ల) దూరంలో ఉన్న అతి చిన్న ద్వీప దేశం క్యూబా. జనాభా కేవలం కోటి మంది (విప్లవం నాటికి 70 లక్షల మంది). అందువల్ల ఆది నుండీ క్యూబా విప్లవాన్ని నలిపేయడానికి అమెరికా చేయని ప్రయత్నం లేదు. చేయని ఘోరం లేదు. క్యూబాలోని గ్వాంటనామో బేను అమెరికా ఆక్రమించి సైనిక స్థావరం నెలకొల్పుకుని నిరంతరం సైనిక నిఘా పెట్టింది. ప్రజల్లో అసంతృప్తి రెచ్చగొట్టి పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహంచింది. క్యూబాపై ఆర్థిక, సైనిక, ఇంధన ఆంక్షలు పెట్టింది. అన్నిటికీ మించిన ఘోరం, ఫైడల్‌ కాస్ట్రోను చంపడానికి ఆయన జీవిత కాలంలో 600కు పైగా హత్యాయత్నాలు చేసింది. వీటన్నిటినీ తట్టుకుని దేశాన్ని సోషలిస్టు మార్గంలో నడిపించాడు కాస్ట్రో. 140 కోట్ల జనాభా, అయిదో ఆర్థిక వ్యవస్థగల భారత దేశంలో 56 అంగుళాల ఛాతీ ఉన్నదని చెప్పుకునే నేతలు అమెరికా బెదిరింపులకు భయపడి దాని ముందు అడుగడుగునా మోకరిల్లుతున్న తీరుతో పోల్చినప్పుడు ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా సామ్రాజ్యవాద పెత్తనానికి వ్యతిరేకంగా క్యూబా ప్రజలను నిలిపిన కాస్ట్రో తెగువ మనకు అర్ధమవుతుంది. ఆర్థిక, సైనిక, వాణిజ్య, ఒప్పందాలు, అధిక సుంకాల ద్వారా మన దేశంపై పెత్తనం సాగించడానికి అమెరికా నేడు బరితెగించి చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో కాస్ట్రో నాయకత్వంలో క్యూబా ప్రజలు సాగించిన సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం మన యువతకు ఎంతగానో స్ఫూర్తినిస్తుందనడంలో సందేహం లేదు. సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నమైన తరువాత 'సోషలిజమో, మరణమో' అని కాస్ట్రో ఇచ్చిన పిలుపు విపరీతమైన కష్టాల్లో కూడా క్యూబాను సోషలిజం మార్గంలో నిలిపింది. నేటికీ క్యూబాపై అమెరికా దిగ్బంధనం, ఆంక్షలు, దాడులు, బెదిరింపులు, వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి.

అంతర్జాతీయ విముక్తి పోరాటాలకు కాస్ట్రో నాయకత్వంలో క్యూబా అందించిన అండ ఆఫ్రికా అంతటా వలసవాద వ్యతిరేక, వర్ణవివక్ష వ్యతిరేక ఉద్యమాలకు మద్దతు ఇవ్వడంలో క్యూబా ఒక ప్రధానమైన, పలుసార్లు నిర్ణయాత్మక పాత్ర పోషించింది. 1960ల నుండి 1980ల వరకు సామ్రాజ్యవాద దేశాల నుండి స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న దేశాలకు సహాయం చేయడానికి క్యూబా వేలాది మంది సైనికులు, వైద్యులు, ఉపాధ్యాయులు, సైనిక సలహాదారులను మోహరించింది. 1975లో అంగోలా కొత్తగా పొందిన స్వాతంత్య్రాన్ని రక్షించడానికి క్యూబా 16 సంవత్సరాల కాలంలో లక్షలాది మంది పోరాట దళాలను పంపింది. అంగోలాపై దాడి చేసిన దక్షిణాఫ్రికా వర్ణవివక్ష దళాలను రెండుసార్లు (1976, 1988లో) క్యూబా దళాలు తిప్పికొట్టాయి. ఇది 1990లో నమీబియా స్వాతంత్య్రానికి మార్గం సుగమం చేసింది. గినియా-బిసావు, కేప్‌ వెర్డేలలో పోర్చుగీస్‌ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉద్యమాలకు, అలాగే అల్జీరియా, కాంగో లోని వలస వ్యతిరేక పోరాటాలకు క్యూబా నేరుగా సాయం అందించింది. అలీనోద్యమాన్ని సామ్రాజ్యవాద వ్యతిరేక శిబిరంలో నిలబెట్టడానికి కాస్ట్రో తీసుకున్న చొరవ అనితరమైనది.

అంతర్జాతీయ సమాజానికి క్యూబా అందించిన సాయం

కొత్తగా విముక్త పొందిన దేశాలలో ప్రజారోగ్యం, విద్యా వ్యవస్ధలను నిర్మించడానికి క్యూబా వైద్యులు, నర్సులు, ఇంజనీర్లతో సహా పెద్ద సంఖ్యలో పౌర స్వచ్ఛంద సేవకులను పంపింది. వేలాది మంది ఆఫ్రికన్‌ విద్యార్థులకు క్యూబాలో ఉచితంగా వైద్య, సాంకేతిక విద్యనభ్యసించడానికి వసతులు ఏర్పాటు చేశారు. ప్రపంచంలో ఎక్కడ ప్రకృతి విలయం సంభవించినా అక్కడకు వేలాది మంది క్యూబా వైద్య సిబ్బంది వెళ్లి క్షతగాత్రులకు సాయం అందించారు.

లాటిన్‌ అమెరికాలో సామ్రాజ్యవాద వ్యతిరేక కూటముల ఏర్పాటుకు కాస్ట్రో కృషి

21వ శతాబ్దం ఆరంభంలో లాటిన్‌ అమెరికాలో ఎన్నికల ద్వారా ఏర్పడిన సామ్రాజ్యవాద వ్యతిరేక, వామపక్ష ప్రభుత్వాలను ఒక చోట చేర్చి సామ్రాజ్యవాదాన్ని ఎదిరించేందుకు 33 దేశాలతో 'అలబా' వంటి కూటముల ఏర్పాటులో కాస్ట్రో గొప్ప కృషి చేశారు.

చిన్న క్యూబా అంతర్జాతీయంగా అంత పెద్ద పాత్ర నిర్వహించడం వెనుక కాస్ట్రో నిర్వహించిన పాత్ర ఎనలేనది. క్యూబా స్వాతంత్య్ర సమరయోధుడు జోస్‌ మార్టీ సామ్రాజ్యవాద వ్యతిరేక స్ఫూర్తి, మార్క్సిజం-లెనినిజం సైద్ధాంతిక చైతన్యం, కార్మికవర్గ అంతర్జాతీయత...ఇవన్నీ ఒకే వ్యక్తిలో పోతపోస్తే ఆయనే ఫైడల్‌ కాస్ట్రో.

నేడు అమెరికన్‌ సామ్రాజ్యవాద పెత్తనానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యం, సోషలిస్టు ప్రత్యామ్నాయం కోసం పోరాడ్డమే శత జయంతి సందర్భంగా మహనీయుడు కాస్ట్రోకు మనమిచ్చే నిజమైన నివాళి.

s venkatrao

ఎస్‌. వెంకట్రావు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్