బుధవారం, 08 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

నియంత్రిత ప్రజాస్వామ్యం - నిర్వీర్యమైన రాజ్యాంగబద్ధ సంస్థలు

2 గంటల క్రితం

modi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 08, 2026, 05:15 పూర్వాహ్నం | 7 నిమిషాల చదవడం

ఆధునిక రాజ్య కార్యనిర్వాహక వర్గం అనేది మొత్తం బూర్జువా వర్గం ఉమ్మడి వ్యవహారాలను నిర్వహించే ఒక కమిటీ మాత్రమేనని కమ్యూనిస్ట్ మేనిఫెస్టో వివరిస్తుంది. మన దేశానికి సంబంధించి ఆ సూత్రీకరణను కూడా సవరించాల్సిన అవసరం ఉంది. దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి ఒక ఉదారవాద రాజ్యానికి చెందిన తటస్థ యంత్రాంగం ద్వారా బూర్జువా వ్యవహారాల సాధారణ నిర్వహణ కంటే చాలా విస్తృతమైనది, గుణాత్మకంగా భిన్నమైనది, గతంలో ఎన్నడూ చూడనిది అని చెప్పుకోవాలి. కార్యనిర్వాహక అధికారాన్ని నియంత్రించడానికి, పరిమితం చేయడానికి ఉద్దేశించిన ప్రతి సంస్థను రాజ్యం హస్తగతం చేసుకోవడాన్ని మనం ఈరోజున చూస్తున్నాం. ఈ సంస్థలన్నీ ఇప్పుడు హిందూత్వ భావజాలంతో పెనవేసుకుపోయిన నిర్దిష్ట బడా పెట్టుబడిదారీ వర్గ ప్రయోజనాలకు లోబడి పనిచేస్తున్నాయి. ఈ తేడాను మనం స్పష్టంగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది.

​ కార్పొరేట్ రాజ్యం - దాని రాజకీయ ఆర్థిక వ్యవస్థ

​ మన విశ్లేషణను ఆర్థిక పునాదితో ప్రారంభిద్దాం, ఎందుకంటే మిగిలినవన్నీ ఈ పునాది మీదనే ఆధారపడి ఉంటాయి. దేశంలో 1991 నుండి మార్కెట్ అనుకూల విధానాలు అమలులో ఉన్నాయి. అయితే, బిజెపి పాలన సాగిన దశాబ్ద కాలం 2014 వరకు అనుసరించిన సాధారణ మార్కెట్ అనుకూల పంథాకు భిన్నమైన ఒక కొత్త పరిస్థితిని సృష్టించింది. 2014లో, అధికార పార్టీ రాజకీయ యంత్రాంగాన్ని ఒక నిర్దిష్ట కార్పొరేట్ సమూహాలతో విలీనం చేసే ప్రక్రియను చేపట్టింది. ఈ పరస్పర బంధం ఎంత బలంగా ఉందంటే, కీలక రంగాలలో రాజ్యం, ప్రైవేట్ పెట్టుబడి మధ్య సరిహద్దులు ఆచరణాత్మకంగా అదృశ్యమయ్యాయి.

​ కార్పొరేట్లు బిజెపి లో రాజకీయ పెట్టుబడి పెట్టాయి. అందుకు ప్రతిగా ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడుల ఉపసంహరణ, పర్యావరణ, భూసేకరణ అనుమతుల నిబంధనల సవరణ, కార్పొరేట్ రుణాలను మాఫీ చేయడానికి అనువుగా బ్యాంకింగ్ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ వంటి వివిధ రూపాల్లో భౌతిక ప్రయోజనాలను పొందాయి. మరీ ముఖ్యంగా ఈ సందర్భంలో, రాజకీయ అధికారం అనేది కార్పొరేట్ పెట్టుబడిపై లభించే లాభంలా మారిపోయింది. ఇవన్నీ ప్రజాస్వామ్య పాలనకు తీవ్రమైన ముప్పుగా పరిణమించాయి. కార్యనిర్వాహక వ్యవస్థ స్వభావమే అధికార పార్టీ, వారి మిత్రుల అవసరాలకు అనుగుణంగా క్రమంగా మలచబడుతుంది.

​ కొనుగోళ్లు, విలీనాలు - నూతన పెట్టుబడి సంచయనం​

కార్పొరేట్ ఫైనాన్స్ రంగానికి చెందిన భాష చాలా నికార్సుగా రాజకీయ ఆచరణలోకి మారింది. కార్పొరేట్ బోర్డ్‌రూమ్‌లు తరచుగా యం అండ్‌ ఎ (మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్) అనే పదాన్ని ఉపయోగిస్తాయి, కొనుగోళ్లు, విలీనాలు, బలవంతపు స్వాధీనాలు ఇవన్నీ యం అండ్‌ ఎ కోవకు వస్తాయి. ఇది రాజకీయ రంగంలో బీజేపీ కార్పొరేట్ యం అండ్‌ ఎ సంస్కృతిని పుణికి పుచ్చుకుని ఎన్నికల ఏకీకరణకు, రాజకీయ ఆధిపత్యానికి ఒక ప్రధాన సాంకేతికతగా ఉపయోగపెట్టుకున్నది.​

మధ్యప్రదేశ్, కర్ణాటక, మణిపూర్ వంటి రాష్ట్రాల్లో ఎన్నికైన కాంగ్రెస్ శాసనసభ్యులను వ్యవస్థీకృతంగా వేటాడటం, గంపగుత్తగా కొనుగోలు చేయడం ద్వారా ఇంజనీరింగ్ చేసిన ప్రభుత్వాల పతనంతో ఈ రాజకీయ కార్పొరేట్ క్రీడ మొదలైంది. స్వీయ వైరుధ్యాల వలన ఇప్పటికే బలహీనపడిన కాంగ్రెస్ పార్టీ, బయటి నుండి వ్యూహాత్మకంగా జరిపిన ఈ పార్టీ ఫిరాయింపుల వల్ల మరింత దెబ్బతిన్నది. ఇది ఓటర్లు ఇచ్చిన తీర్పుపై వంచనాపూర్వకంగా చేసిన దాడి తప్ప మరొకటి కాదు. చట్టపరమైన అస్పష్టతను దుర్వినియోగం చేసుకోవడం ద్వారా బిజెపి ఇలాంటి అక్రమాలకు, అవినీతికి పాల్పడింది.

​ శివసేన, ఆప్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు తరువాత లక్ష్యాలుగా మారాయి. ఏకనాథ్ షిండే శివసేన శాసనసభా పక్షాన్ని హస్తగతం చేసుకోవడం, అజిత్ పవార్ ఎన్.సి.పి ని చీల్చడం, రాఘవ్ చద్దా మరో ఆరుగురు ఎంపీలతో కలిసి బిజెపి లోకి ఫిరాయించడం వంటివి ప్రోత్సాహకాలు, కాలపరిమితులు, విలీనం తర్వాత సమకూర్చిన ప్రయోజనాలతో కూడిన కార్పొరేట్ కొనుగోళ్లలాగా సాగాయి. రాజకీయ నాయకుల ఈ భవిష్య వ్యాపారం ("ఫ్యూచర్ ట్రేడింగ్" ) ఎంత సాధారణం అయిపోయిందంటే, దీనిని ఇప్పుడు ఒక కుంభకోణంగా, ప్రజాస్వామ్య విరుద్ధంగా, అనైతికతగా ఎవరూ భావించడం లేదు. ఈ రాజకీయ తొత్తడాలు నియోజకవర్గాల పునర్విభజన అనే మరో కీలక అంశంతో ముడిపడి ఉన్నాయి. ఈ విశ్లేషణ ఈ వ్యాసం తరువాయి భాగంలో వివరిస్తాను. ప్రస్తుతానికి, ఈ కొనుగోలు గణితం రాజకీయ భౌగోళిక గణితంతో లోతుగా ముడిపడి ఉందని గ్రహించగలిగితే చాలు.

​ వాషింగ్ మెషీన్

ప్రస్తుతం ప్రజల సాధారణ సంభాషణల్లోకి ఒక రాజకీయ పదం విస్తృతంగా వచ్చి చేరింది, అదే - వాషింగ్ మెషీన్. ప్రతిపక్షంలోని ఒక నాయకుడిపై అవినీతి ఆరోపణలు, క్రిమినల్ కేసులు, ఈడీ సమన్లు ఉంటాయి—రాజకీయ ఒత్తిడికి సాధనాలుగా దర్యాప్తు సంస్థల పూర్తి ఒత్తిడి వారిపై ప్రయోగించబడుతుంది. అదే నాయకుడు ప్లేట్ ఫిరాయించి, బిజెపి లో చేరిన వెంటనే ఆశ్చర్యకరంగా కేసులు వీగిపోవడం, ఈడికగా సాగడం, సమన్ల జోరు తగ్గడం, హడావిడి ప్రాసిక్యూషన్ మాయమవ్వడం చోటు చేసుకుంటుంది. మూసబోసినట్లు సాగే ఈ అప్రకటిత వేధింపుల ధోరణి రాజకీయ విధేయతలను బట్టి మారుతూ వస్తుంటే ఇక చట్టాలకు విలువ లేకుండా పోతుంది. అది చట్టం ముసుగు ధరించిన ఒక అణిచివేత రూపంగా మారుతుంది.

​ ఫిరాయింపుల నిరోధక చట్టం - పునాది లేని నిర్మాణం

పైన పేర్కొన్న హోల్‌సేల్ రాజకీయ వ్యాపారాన్ని నిరోధించడానికి, 1985 లో పదో షెడ్యూల్, ప్రజాదరణ పొందిన ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకొచ్చారు. మొదటి నుండి పదో షెడ్యూల్ లోపాలు ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధుల కొనుగోళ్లు, అమ్మకాలు ప్రాతినిధ్య ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని నిర్ధారించడానికి ఈ చట్టం రాజ్యాంగబద్ధమైన సమ్మతిగా ముందుకు వచ్చింది. అయితే ఇప్పుడు ఆ సమ్మతి కేవలం ఒక నామమాత్రపు తంతుగా మారిపోయింది. "విలీనం" (శాసనసభా పక్షంలో మూడింట రెండు వంతుల మంది ఫిరాయించవలసి ఉంటుంది) అనే షరతును చాలా చాకచక్యంగా ఉపయోగ పెట్టుకుంటున్నారు. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సిన రాజ్యాంగ అధికారులయిన స్పీకర్లు, ఆ పిటిషన్లు తమ సొంత పార్టీకి ప్రయోజనం చేకూర్చేవయితే వాటి మీద ఎలాంటి నిర్ణయం ప్రకటించకుండా అసాధారణమైన కాలయాపనకు పూనుకుంటున్నారు. సుప్రీంకోర్టు ఈ ధోరణులను గమనించి, అసంతృప్తిని వ్యక్తం చేసి, ఆదేశాలు జారీ చేసినప్పటికీ—ఈ ధోరణిలో ఇప్పటికీ మార్పు లేదు, అలాగే కొనసాగుతోంది. నేడు ఫిరాయింపుల నిరోధక చట్టం అనేది పునాదులు తొలగించబడిన ఒక భవనం లాంటిది. కేవలం ముఖద్వారం మాత్రమే అగుపడతా ఉంటుంది.

​ ప్రిసైడింగ్ అధికారులు, ఎన్నికల సంఘం - లొంగుబాటు సాధనం

లోక్‌సభ స్పీకర్, గవర్నర్లు, భారత ఎన్నికల సంఘం (ఇ.సి.ఐ) వంటి రాజ్యాంగ పదవులు, రాజ్యాంగ వ్యవస్థలో సమతుల్యతను కాపాడేందుకు లేదా రెఫరీలుగా వ్యవహరించేందుకు రూపొందించబడ్డాయి. ఆటగాళ్లే రెఫరీలు కాకుండా నిలువరించేందుకు తగిన వ్యవస్థలుగా వీటిని తీర్చిదిద్దారు. ​అయితే ఇప్పుడు ఈ నమ్మిక సడలిపోయింది. తమిళనాడు, కేరళ, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో గవర్నర్ల పక్షపాత పని తీరు గురించి కూలంకషంగా చర్చించడం, దానిని డాక్యుమెంట్ చేయడం జరిగింది. ఈ గవర్నర్లు రాజ్యాంగ సంక్షోభాలను సృష్టిస్తున్నారు, బిల్లులను తొక్కి పెడుతున్నారు. రాజ్యాంగ అధిపతులుగా తమ పాత్రను నిర్వర్తించకుండా కేంద్ర ప్రభుత్వం చేతిలో పావులుగా వ్యవహరిస్తున్నారు. వీరి పని తీరు చూస్తే రాజ్యాంగ పదవులను రాజకీయ సాధనాలుగా ఎలా వినియోగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

ఎన్నికలను నిర్వహించే బాధ్యత కలిగిన ప్రిసైడింగ్, రిటర్నింగ్ అధికారుల పనితీరులో కూడా ఇదే ధోరణి కనిపిస్తుంది. మధ్యప్రదేశ్, జార్ఖండ్‌లలో జరిగిన రాజ్యసభ ఎన్నికలు, అలాగే చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారి ఎన్నికల ప్రక్రియలో చట్ట విరుద్ధంగా జోక్యం చేసుకున్నట్లు సుప్రీంకోర్టు నిర్ధారించిన ఇటీవలి వివాదాలు, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అధికారుల తటస్థతపై తీవ్ర ఆందోళనలను రేకెత్తించాయి. నిష్పక్షపాతంగా ఉండాల్సిన రెఫరీలు కూడా పక్షపాత ప్రభావానికి లోనవుతున్నారనే వాస్తవాన్ని ఈ సంఘటనలు బలపరుస్తున్నాయి.

ఎన్నికల సంఘం నడవడికపై ప్రత్యేక శ్రద్ధ అవసరం, ఎందుకంటే ఇ.సి.ఐ అనేది ఒక సాధారణ సంస్థ కాదు. ఎన్నికల ప్రజాస్వామ్యం మనుగడే దాని స్వతంత్రతపై ఆధారపడి ఉంటుంది. ఇటీవలి సంవత్సరాలలో దాని పనితీరు కేవలం విధానాలను ప్రస్తావించడం ద్వారా సమాధానం చెప్పలేని ప్రశ్నలను లేవనెత్తింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం మతపరమైన విజ్ఞప్తులుగా పరిగణించబడే ప్రసంగాలు చేసిన ప్రధానమంత్రి, హోంమంత్రిపై వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడానికి ఇ.సి.ఐ నిర్ద్వంద్వంగా నిరాకరించడం ఇందుకు అత్యంత స్పష్టమైన ఉదాహరణలలో ఒకటి. కాంగ్రెస్ "దేశ సంపదను చొరబాటుదారులకు పంచుతోంది" అని ప్రధానమంత్రి మాట్లాడినప్పుడు, "మంగళ సూత్రాలను" ప్రస్తావించినప్పుడు, అలాగే హోంమంత్రి మతపరమైన విభజనను సృష్టించే భాషను ఉపయోగించినప్పుడు కూడా ఇ.సి.ఐ ఎటువంటి ఉల్లంఘనను గుర్తించకపోవడం దాని పక్షపాత ధోరణిని స్పష్టం చేస్తుంది.

​ ప్రధాన న్యాయమూర్తికి ఎంపిక కమిటీలో స్థానం లేదు

మార్చి 2023లో, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం అనూప్ బరన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో, ఎన్నికల సంఘం నియామకాలను ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తిలతో కూడిన కమిటీ సలహాపై చేపట్టాలని ఆదేశించింది. నియామకాలను పూర్తిగా కార్యనిర్వాహక వర్గం చేతుల్లోనే వదిలేయడం "మన ప్రజాస్వామ్య ఆరోగ్యానికి తీవ్ర హానికరం" అని ఆ తీర్పు స్పష్టంగా పేర్కొంది.

​ తమ అన్యాయమైన ప్రయోజనాలకు భంగం కలిగే అన్ని విషయాల లాగే, ఇక్కడ కూడా ప్రభుత్వ ప్రతిస్పందన వేగంగా వ్యూహాత్మకంగా మారింది. డిసెంబర్ 2023 నాటికి, పార్లమెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎలక్షన్ కమిషనర్ల (నియామకం, సేవా నిబంధనలు-పదవీ కాలం) చట్టం, 2023 ను ఆమోదించింది. ఈ చట్టం భారత ప్రధాన న్యాయమూర్తి స్థానంలో ప్రధానమంత్రి నామినేట్ చేసిన ఒక క్యాబినెట్ మంత్రిని చేర్చింది. ఇప్పుడు ఆ ఎంపిక కమిటీలో ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడితోపాటు ప్రధానమంత్రి ఎంచుకున్న ఒక మంత్రి ఉంటారు. అంటే మూడు ఓట్లలో రెండు ఓట్లు కార్యనిర్వాహక వర్గానికి చెందినవే.

మెజారిటీ ప్రతిపక్ష సభ్యులు సస్పెన్షన్‌లో ఉన్న సమయంలోనే లోక్‌సభలో ఈ బిల్లు ఆమోదం పొందిందనే విషయాన్ని మనం ఇక్కడ గమనంలో ఉంచుకోవాలి. 2023 చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన కేసులు జనవరి 2024 నుండి సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. స్టే మంజూరు కాలేదు. మే 2026 నాటికి, ఈ విషయం ఇంకా డివిజన్ బెంచ్ ముందు వాదనల్లో ఉంది. ఇద్దరు ప్రధాన న్యాయమూర్తులు ఈ ప్రక్రియ నుండి తప్పుకున్నారు. ఈ వివాదాస్పద చట్టం కింద నియమించబడిన ఎన్నికల కమిషనర్లు మాత్రం పదవిలో కొనసాగుతూ ఉన్నారు, ఎన్నికల చక్రం నడుస్తూనే ఉంది.

ఆర్డినెన్స్ - జమ్మూ కాశ్మీర్ టెంప్లేట్

రాజ్యాంగ ఉల్లంఘనకు సంబంధించిన మరో రెండు ఉదాహరణలను ఈ సందర్భంలో చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవి తమకు నచ్చని న్యాయస్థాన తీర్పులను అధిగమించడానికి ఒక పద్ధతిని నిర్దేశిస్తాయి. ఢిల్లీ ఆర్డినెన్స్ మొదటి కేసు-మే 2023లో ఢిల్లీ ఎన్నికైన ప్రభుత్వానికి సేవలపై నియంత్రణను సుప్రీంకోర్టు పునరుద్ధరించడం. ఒక నగర-రాష్ట్ర ఎన్నికైన ప్రభుత్వాన్ని కేవలం ఒక నామమాత్రపు సంస్థగా కాకుండా అధికారయుత సంస్థగా మార్చడం అంటే అది రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన అంశం. అయితే కొద్ది రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం ఆ తీర్పు ప్రభావాన్ని రద్దు చేసేలా ఒక ఆర్డినెన్స్‌ రూపొందించింది. ఆ ఆర్డినెన్స్ తదనంతరం చట్టంగా ఆమోదం పొందింది. ప్రభుత్వం కోర్టు తీర్పును సవాలు చేయాల్సిన అవసరం లేకుండా, చట్ట సభలో కార్యనిర్వాహక వర్గానికి ఉన్న మొరటు బలంతో సుప్రీం తీర్పునకు విలువ లేకుండా చేసింది.

జమ్మూ కాశ్మీర్ టెంప్లేట్ - అసెంబ్లీ లేని పరిస్థితిని ఉపయోగించుకుని ఆర్టికల్ 370 రద్దు, పూర్తి స్థాయి రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడం అనేది కుయుక్తులతో కూడిన రాజ్యాంగ ఎత్తుగడల ద్వారా సాధించారు. ఈ కేంద్రపాలిత ప్రాంతాలలో ఒకటి లడఖ్, దీనికి అసెంబ్లీ కూడా లేదు. ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి ఉత్తర్వులను ఉపయోగించి ఆర్టికల్ 370లో సవరణలు చేశారు. దీనికి రాష్ట్ర రాజ్యాంగ అసెంబ్లీ ఆమోదం అవసరం. కానీ అది అప్పటికే ఉనికిలో లేదు. 'చట్ట సభ ఆమోదం' అన్న రాజ్యాంగ అవసరాన్ని రద్దు చేయడం ద్వారా ఆ షరతును అధిగమించారు. ఇది అధికార పార్టీ తన ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి చట్టపరమైన లొసుగును సృష్టించి మరీ అప్రజాస్వామికంగా వ్యవహరించిన తెంపరితనానికి ఒక ఉదాహరణ.

​ ఒక పరంజాని నిర్మించడం

పైన పేర్కొన్న విషయాలన్నీ స్పష్టం చేసేదేమిటంటే, బిజెపి చేపట్టిన సంస్థాగత హస్తగత ప్రాజెక్ట్ అనేది ఒక పరంజా లాంటిది, ఇక్కడ ప్రతి అంశం మిగిలిన వాటిని బలోపేతం చేస్తుంది. ఎన్నికల సంఘాన్ని నిర్వీర్యం చేయడం ద్వారా ఎన్నికలను మరింత సులభంగా ప్రభావితం చెయ్యవచ్చు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని బలహీనపరచడం ద్వారా ఎన్నికల అనంతర మార్పులు సులభం చేసుకోవచ్చు. వాషింగ్ మెషీన్ విధానం ఫిరాయింపులను మరింత ఆకర్షణీయంగా చేస్తుంది.

ఆర్డినెన్స్ అధికారం, జమ్మూ కాశ్మీర్ టెంప్లేట్ న్యాయవ్యవస్థ యొక్క ప్రతిఘటనను కూడా తట్టుకోగలమని నిరూపిస్తున్నాయి. అణకువగా ఉండే ప్రిసైడింగ్ అధికారులు జవాబుదారీతనాన్ని సృష్టించే ప్రక్రియలను (అనర్హత పిటిషన్లు, మనీ బిల్లు ధృవీకరణలు, ఫిరాయింపుల నిరోధక చర్యలు వంటివి) నెమ్మదింపజేస్తారు లేదా నిలిపివేస్తారు.

ఈ పరంజా కేవలం అధికారాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రమే ఉపయోగపడటం లేదు. ఇది జనాభా ఇంజనీరింగ్, పౌరసత్వ పునర్వ్యవస్థీకరణ, హిందూ రాష్ట్ర ప్రాజెక్టుకు సాధనంగా వినియోగిస్తున్నారు. ఈ అంశాలను మరింత విపులంగా తరువాయి భాగంలో మనం చర్చిద్దాం.


m.a baby

వ్యాసకర్త : ఎమ్. ఎ. బేబీ, సిపిఎం ప్రధాన కార్యదర్శి

(పార్ట్ 2: "నియోజకవర్గాల పునర్విభజన, జనాభా ఇంజనీరింగ్, *హిందూ రాష్ట్ర ఏర్పాటు: మతతత్వ వ్యవస్థ ఎన్నికల నిర్మాణం" మరోసారి)

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్