ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన బెరైటీస్ ఖనిజానికి నిలయమైన మంగంపేటలో చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. దేశ పారిశ్రామిక, ఇంధన భద్రతకు కీలకమైన ఈ అరుదైన ఖనిజాన్ని జాతీయ అవసరాలకు అనుగుణంగా వినియోగించాల్సింది పోయి, ఒక ప్రైవేటు సంస్థకు లాభాలు చేకూర్చే విధంగా పెద్దఎత్తున విదేశాలకు తరలించేందుకు అవకాశం కల్పిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. బెరైటీస్ నిల్వలు వేగంగా తరిగిపోతున్న తరుణంలో దీర్ఘకాలిక బల్క్ టెండర్ ద్వారా ఖనిజాన్ని అప్పగించడం జాతీయ ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగించే ప్రమాదముంది.
క్షేత్రస్థాయిలో నిజనిర్ధారణ
మంగంపేట బెరైటీస్ గనుల్లో అక్రమాలు జరుగుతున్నట్లు వస్తున్న ఆరోపణలు, బల్క్ టెండర్ పరిణామాలు, ఖనిజ తరలింపు, కార్మికులు, నిర్వాసితులు, స్థానిక మిల్లులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రాష్ట్రస్థాయి నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ ఇలీవల మంగంపేట బెరైటీస్ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించింది.
బెరైటీస్ తవ్వకం, గ్రేడింగ్, నిల్వ, రవాణా, విక్రయం, ఎగుమతుల విధానాలతోపాటు బల్క్ టెండర్ వల్ల కలిగే దీర్ఘకాలిక పరిణామాలపై కమిటీ అధ్యయనం చేసింది. స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించాల్సిన సహజ వనరును ఇతర ప్రాంతాలకు, విదేశాలకు పెద్దఎత్తున తరలించడం వల్ల స్థానిక మిల్లులు మూతపడే ప్రమాదం ఉందని పలువురు కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. ఖనిజ పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన వేలాది కుటుంబాల జీవనోపాధి దీనివల్ల దెబ్బ తింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
మంగంపేట ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన నిర్వాసిత కుటుంబాలకు గతంలో చేసిన హామీలు పూర్తిగా అమలు కాలేదని బాధితులు కమిటీకి వివరించారు. అర్హులైన కుటుంబాలకు ఉపాధి, పునరావాసం, ఇతర ప్రయోజనాలు అందలేదని తెలిపారు. ఏళ్ల తరబడి పని చేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ కార్మికులను క్రమబద్ధీకరించకపోవడం, వారికి ఉద్యోగ భద్రత కల్పించకపోవడం కూడా ప్రధాన సమస్యగా కమిటీ గుర్తించింది.
వేగంగా తగ్గుతున్న నిల్వలు
కమిటీ పరిశీలన ప్రకారం మంగంపేటలో 2015లో సుమారు 49 మిలియన్ టన్నులుగా ఉన్న బెరైటీస్ నిల్వలు 2024 నాటికి సుమారు 23 మిలియన్ టన్నులకు తగ్గాయి. అంటే కేవలం తొమ్మిదేళ్లలో దాదాపు 53 శాతం నిల్వలు తగ్గిపోయాయి. ఏటా 25 లక్షల నుంచి 30 లక్షల టన్నుల వరకు తవ్వకాలు కొనసాగితే మిగిలిన గని జీవితకాలం ఎంత ఉంటుందో ప్రభుత్వం స్పష్టంగా తెలియజేయాలి.
బెరైటీస్ సాధారణ ఖనిజం కాదు. చమురు, సహజవాయువు అన్వేషణలో ఉపయోగించే డ్రిల్లింగ్ మడ్ తయారీకి ఇది అత్యంత అవసరం. ప్రస్తుతం ఈ అవసరానికి బెరైటీస్‌కు పూర్తిస్థాయి ప్రత్యామ్నాయం లేదు. భవిష్యత్తులో దేశీయంగా చమురు, సహజ వాయువు అన్వేషణ కార్యక్రమాలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున బెరైటీస్ నిల్వలను జాతీయ అవసరాలకు అనుగుణంగా సంరక్షించడం అత్యవసరం.
బల్క్ టెండర్‌పై తీవ్రమైన అభ్యంతరాలు
ఎపిఎండిసి జారీ చేసిన బల్క్ టెండర్ ద్వారా సుమారు 60 లక్షల మెట్రిక్ టన్నుల సి, డి, డబ్ల్యూ గ్రేడ్ బెరైటీస్‌ను ఐదేళ్ల కాలానికి కేటాయించినట్లు తెలుస్తోంది. అందులో దాదాపు 50 లక్షల మెట్రిక్ టన్నులను ‘ఎంప్రదా’ కంపెనీ ద్వారా ఎగుమతులకు కేటాయించడంపై నిజనిర్ధారణ కమిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏటా కనీసం పది లక్షల టన్నుల చొప్పున సరఫరా చేయడంతో మంగంపేట నిల్వలు మరింత వేగంగా తగ్గిపోయే ప్రమాదముంది.
వేలంలో నిర్ణయించిన ధరను మొత్తం ఐదేళ్ల ఒప్పంద కాలానికి ఒకే విధంగా కొనసాగిస్తే భవిష్యత్తులో అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగినా ఎపిఎండిసి కి, రాష్ట్ర ప్రభుత్వానికి తగిన ఆదాయం లభించకపోవచ్చు. టెండర్‌లో రిజర్వు ధరను టన్నుకు రూ.1,188గా నిర్ణయించగా, ఈ-వేలంలో ఖరారైన ధరను ఐదేళ్లపాటు స్థిరపరిచినట్లు సంబంధిత పత్రాలు తెలియజేస్తున్నాయి. అదే సమయంలో స్థానిక మిల్లుల యజమానులకు టన్నుకు రూ.1,688గా నిర్ణయించడం వివక్షాపూరితమని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రతి సంవత్సరం ధరలను సమీక్షించాలనే నిబంధనలు ఉన్నప్పటికీ, ఖనిజ మార్కెట్‌లో వచ్చే మార్పులను పరిగణనలోకి తీసుకోకుండా దీర్ఘకాలంపాటు ఒకే ధరను కొనసాగించడం వల్ల లాభం ఎవరికి? అత్యున్నత గ్రేడ్ బెరైటీస్‌ను తక్కువ గ్రేడ్‌గా చూపుతున్నారని, అనుమతించిన పరిమాణానికి మించి ఖనిజాన్ని తరలిస్తున్నారని, టెండర్ నిబంధనలను ‘ఎంప్రదా’ సంస్థకు ప్రయోజనం కలిగించే విధంగా రూపొందించారనే ఆరోపణలు కూడా కమిటీ పరిశీలనలోకి వచ్చాయి.
గతంలో శాసనసభ వేదికగా కూడా మంగంపేట బెరైటీస్ వ్యవహారంలోని అవకతవకలపై చర్చ జరిగింది. మైనింగ్ రంగంలో సుమారు రూ.20 వేల కోట్ల అవినీతి జరిగిందని ప్రస్తుత పాలకులే గతంలో ఆరోపించారు. అయినప్పటికీ ఇప్పటివరకు సమగ్ర విచారణ చేపట్టకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
ఎపిఎండిసి ని బలహీనపరిచే ప్రయత్నం
ఎపిఎండిసి 1975 నుంచి బెరైటీస్ తవ్వకం, సరఫరాలో కీలకమైన ప్రభుత్వ రంగ సంస్థగా పనిచేస్తోంది. రాష్ట్రానికి ఆదాయం సమకూర్చడంతోపాటు స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడంలో ఈ సంస్థది ముఖ్యమైన పాత్ర. అటువంటి ప్రభుత్వ సంస్థ కార్యకలాపాలను బలహీనపరిచి, విలువైన ఖనిజ సంపదను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధం. ఎపిఎండిసి కార్యకలాపాలను నిలిపివేయాలనే ప్రతిపాదనలు ఉన్నట్లు వస్తున్న సమాచారం కార్మికులు, నిర్వాసితులు, స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థను మూసివేయడం పరిష్కారం కాదు. ఎపిఎండిసి ని మరింత బలోపేతం చేసి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రీయ తవ్వకాలు చేపట్టాలి.
ముడి ఖనిజాన్ని యథాతథంగా ఎగుమతి చేయకుండా స్థానికంగా శుద్ధి, విలువ జోడింపు పరిశ్రమలను ఏర్పాటు చేయాలి. తద్వారా రాష్ట్రానికి అధిక ఆదాయం రావడంతోపాటు స్థానిక యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి. స్థానిక మిల్లులను పరిరక్షించి వాటిపై ఆధారపడిన కార్మిక కుటుంబాలకు జీవనోపాధి భద్రత కల్పించాలి.
మంగంపేట వ్యవహారంలో వేల కోట్ల రూపాయల ప్రజాసంపదకు నష్టం వాటిల్లిందనే ఆరోపణలు వస్తున్నప్పుడు ప్రభుత్వం మౌనం వహించడం తగదు. హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరిపించాలనే డిమాండ్ పూర్తిగా న్యాయసమ్మతమైనది. మంగంపేట బెరైటీస్‌ను కాపాడుకోవడం అంటే...జాతి సంపదను, ప్రభుత్వ రంగాన్ని, ప్రజల ఉపాధిని, దేశ భవిష్యత్తు అవసరాలను కాపాడుకోవడమే.
- వ్యాసకర్త : కందారపు మురళి
సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు, తిరుపతి








కామెంట్‌లు (0)