గురువారం, 24 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఢీ!

15 నిమిషాల క్రితం

sports
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 05:00 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

" ఏ ఆటా రానోడికి...ఆటల సంఘం ప్రెసిడెంటు పదవేటండీ! సిటీలో మా నాయుడు గారికి తెలిసిన ఒకాయన ఉన్నాడు...కూకుంటే లేవలేడూ...లేస్తే కూకోలేడూ! ఆయన 'కోకో' సంఘం ప్రెసిడెంటట! ఇలాటోళ్లు సర్టిఫికేట్లు రాసీయడం...పైనున్నోళ్లు ఉజ్జోగాలు ఏసీయడం! ఏటండీ అరాసికం? అడిగినోడు లేకగానీ! "- టీవీ చూస్తూ, పరదేశి చిరాగ్గా అన్నాడు.

"రాజశేఖర రెడ్డి గారికి ఏం క్రికెట్ వచ్చని, విశాఖపట్నం గ్రౌండ్ కి ఆయన పేరెట్టారు! "- టీవీ చూస్తూనే, ముఖం తిప్పకుండా అన్నాడు నారాయణమూర్తి.

మూర్తి పూర్తిగా పెదబాబు, చినబాబు సపోర్ట్ అని తెలిసిన పరదేశి, ఏం మాట్లాడలేకపోయాడు.

‘నరేంద్ర మోడీ గారు ఎప్పుడైనా క్రికెట్ ఆడడం చూశావా? రాజశేఖర్రెడ్డి చనిపోయాడు కాబట్టి, అభిమానంతో ఆయన పేరు పెట్టారు అనుకుందాం. మోడీ గారి పేరుతో ఒక స్టేడియం కట్టేశారు... తెలియదా?"-మళ్లీ నారాయణ మూర్తే రెట్టించి అడిగాడు.

" అదీ నిజమేనండి! కనీసం, మా ప్రాంతానికే కాదు, దేశానికే పేరు తెచ్చిన కోడి రామ్మూర్తి నాయుడు పేరు పెట్టి ఉంటే గౌరవంగా ఉండేది కదా!"-దశుమంతు నాయుడు గొంతులో కాస్త బాధ వినిపించింది.

"ఉత్తరాంధ్రోళ్ళు అంటే కొంచెం చులకనేలెండి"-బుస్సీ జత కలిశాడు.

" శ్రీకాకుళంలో ఉన్న ఒక్క స్టేడియంకి కోడి రామ్మూర్తి గారి పేరు పెట్టారట! ఆ తర్వాత శిథిలమైపోతుందని, పూర్తిగా కూల్చేశారట! పన్నెండేళ్లయినా పూర్తికాలేదని ఆమధ్య విజయవాడలో కలిసిన ఒకాయన చెప్పాడు "-అన్నాడు నారాయణ మూర్తి.

" శికాకోళం... ఇజానగరంలో కట్టడం, పేరు పెట్టడం కాదండీ! దేశంలో మరెక్కడైనా రామ్మూర్తి నాయుడు పేరు పెట్టారా?"-పరదేశికి ఆ టాపిక్ మీద 'నాయుడు' అనే కోణంలో ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ ఉంది.

" అడగాలండీ! కూల్చేసినదే కట్టలేకపోతున్నోళ్లు ఏం అడుగుతారు? కరణం మల్లీశ్వరి ఒలింపిక్స్ లో ఒక పతకం తెచ్చిందని గొప్పగా చెప్పుకున్నాం"

" అవునండీ! ఆ అమ్మాయి కూడా ఉత్తరాంధ్ర ఆడపడుచే! శికాకుళమే!"- గుర్తుకొచ్చి పరదేశి చప్పట్లు కొట్టాడు.

" శ్రీకాకుళమని ఆ అమ్మాయి ఎక్కడా చెప్పుకోలేదులే! పెళ్లయిన తర్వాత మాత్రం, వెయిట్ లిఫ్టింగ్ లో ట్రైనింగ్ ఇస్తానంటే, శ్రీకాకుళంలో నాలుగైదెకరాలు రాసి ఇచ్చేశారు. సింధు ఒక పతకం తెచ్చి, షటిల్ ట్రైనింగ్ సెంటర్ పెడతానని అడగ్గానే, విశాఖపట్నంలో భూమి ఇచ్చేశారు. అసలు, వెయిట్ లిఫ్టింగ్, షటిల్ కోర్టులకు అన్ని ఎకరాల అవసరమా? శంకుస్థాపనల్లో మళ్లీ పాలిటిక్స్!"-తీవ్ర అసంతృప్తిని నారాయణమూర్తి వ్యక్తం చేశాడు.

" పతకాలు తెచ్చినోళ్ళకి భూములేటండి! సీఐ, డి.ఎస్.పి లాంటి ఉద్యోగాలే ఇచ్చేస్తన్నారు. మరి వాళ్లకి కొలతలూ లేవు.. పరీక్షలూ లేవు!"-పరదేశి వాస్తవం గ్రహించాడు.

" అలాంటప్పుడు, స్పోర్ట్స్ కోటాలో, సర్టిఫికెట్లు చూపిస్తే టీచరు పోస్టులు ఇవ్వడం తప్పు ఎలా అవుతుందయ్యా?"-

అడిగాడు మూర్తి.

" అవునండీ...అసలు పోటీలే జరగకుండా, పోటీలకు ఎళ్లకుండా, దొంగ సర్టిఫికెట్లు ఇచ్చీస్తే ఎలాగా? నిజమైనోళ్లు ఏటైపోవాలా? అందుకే, ఆటలు రానోళ్లని ఆ సంఘాలకి పెట్టకూడదూ ...అంటన్నాను"-అసలు విషయానికొచ్చాడు పరదేశి.

" ఆటలు రాకపోయినంత మాత్రాన ఏమైపోతుంది. నాలుగు డబ్బులు ఉన్న వాళ్ళని ప్రెసిడెంట్లుగా పెట్టుకుంటే, క్రీడాకారులకు ఆర్థికంగా సపోర్టు చేస్తారు కదా!"-మూర్తి సమర్ధించాడు.

" సొమ్ముంటే ఒళ్ళొస్తుంది గానీ, స్కిల్లు..స్కిల్లు ఒస్తాదేటి సారూ!"

" ఉద్యోగాలు వస్తాయి కదరా! నీ సోది ఆపు "-కోప్పడ్డాడు నాయుడు.

" మూర్తి గారూ! నాకు డౌటూ.. ఆ మధ్య ఢిల్లీలో ఈ బొద్దింక కుర్రోళ్ళు అంత గందరగోళం సేసీశారు గదా! మన స్టేట్ లో డిఎస్సీ మీద ఇంత గొడవ జరుగుతుంటే..."- అన్నాడు బుస్సీ ఆశ్చర్యంగా.

" వాళ్లు చేశారంటే! చేసిన వాళ్లలో అన్ని రాజకీయ భావాలున్నవాళ్లు ఉన్నా.. వాళ్లు ఏ జెండా పట్టుకోలేదు..మన దేశం జెండానే పట్టుకొని పోరాటం చేశారు. అందుకే, వాళ్లు సక్సెస్ అయ్యారు."-మూర్తి తన అభిప్రాయం చెప్పాడు.

"నిజమే సార్.. అన్యాయం జరిగిన వాళ్ళు.. వాళ్లు వచ్చి పోరాటం చేస్తే బాగుంటుంది. రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చేలా ఉండాలి. అంతేగానీ, ఒక రాజకీయ పార్టీ కార్యక్రమం మాదిరిగా చేస్తే ఎలా?"-బుస్సీ అభిప్రాయపడ్డాడు.

" ఏ తరం ఉద్యమం, ఆ తరం చెయ్యాలి. పెద్ద తరం సందేశాలతో ఉత్సాహపరచాలి "-అన్నాడు మూర్తి.


- ' నల్లి ' కుట్టు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్