మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసహకార ‘షుగర్స్’కు పాలకుల చావుదెబ్బ

12 గంటల క్రితం

Sugar.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 18, 2026, 05:25 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

రాష్ట్రంలో అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక, తాండవ, విజయనగరం జిల్లా భీమసింగి సహకార చక్కెర ఫ్యాక్టరీలను లిక్విడేషన్ చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం గత వారంలో నిర్ణయించింది. ఈ ఫ్యాక్టరీలను శాశ్వతంగా మూసివేసి, వీటి ఆస్థులన్నింటినీ అమ్మకానికి పెట్టే చట్టపరమైన ప్రక్రియే ఈ లిక్విడేషన్. ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ ఆసియాలోనే అత్యంత పురాతన సహకార షుగర్ ఫ్యాక్టరీల్లో ఇదొకటి. రాష్ట్రంలో మొదటి షుగర్ ఫ్యాక్టరీ ఇదే. ఈ ఫ్యాక్టరీకి సుమారు 120 ఎకరాల భూముల విలువే 250 కోట్ల వరకు ఉంటుందని అంచనా. తాండవ సహకార షుగర్ ఫ్యాక్టరీ కి సుమారు 100 ఎకరాలు భూములు 200 కోట్ల వరకు విలువ ఉంటుందని అంచనా. భీమసింగి ఫ్యాక్టరీకి కూడా 80 ఎకరాల వరకు భూములు 150 కోట్ల విలువ ఉంటుందని అంచనా. ఈ ఫ్యాక్టరీల భూములు, యంత్రాలు, భవనాలు, క్వార్టర్స్ ఇలా అన్నింటినీ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌళిక సదుపాయాల సంస్థ (ఎపిఐఐసి)కి బదిలీ చేసి వేలం వేసి తెగనమ్మాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ షుగర్ ఫ్యాక్టరీల ఆస్తులను అమ్మడం ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడడమే ఈ లిక్విడేషన్ ఆంతర్యం. చంద్రబాబు ప్రభుత్వం ఎప్ప్పుడు అధికారంలోకి వచ్చినా సహకార రంగాన్ని ముఖ్యంగా సహకార షుగర్ ఫ్యాక్టరీలను నాశనం చేయడం, మూసివేయడం, ఆ ఆస్తులను కొల్ల గొట్టడడమే పనిగా ఉంటున్నది. దీనిలో భాగమే నేడు ఈ లిక్విడేషన్‌కు వెళ్లడం!

దేశంలో 20వ శతాబ్ధంలో సహకార ఉద్యమం బలపడిన తరువాత ఆంధ్రరాష్ట్రంలో ఉద్యమం ప్రత్యేకించి వ్యవసాయ రంగంలో చెరకు సాగు ఆధారం చేసుకుని సహకార షుగర్ ఫ్యాక్టరీలు అభివృద్ధి చెందాయి. 2014 రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రంలో 10 షుగర్ ఫ్యాక్టరీలు సహకార రంగంలోను, మరో 19 ప్రైవేటు షుగర్ ఫ్యాక్టరీలు మొత్తం 29 ఉండేవి. వీటి ద్వారా 4 లక్షల రైతాంగ కుటుంబాలు, ఈ ఫ్యాక్టరీలలో 30 నుండి 35 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి పొందేవారు. ఈ ఫ్యాక్టరీల ఆధారంగా ఆ ప్రాంతాల అభివృద్ధి, పరోక్ష ఉపాధి కూడా ఆ స్థాయిలో జరిగింది. చెరుకు పంటకు పెట్టుబడికి తగ్గట్టు ఆదాయం కూడా రావడంతో చెరుకు రైతాంగానికి ఎంతో ఉపయుక్తంగా ఉండేది. కానీ నేటికీ ప్రభుత్వాల సహకారం లేకపోవడంతో సహకార రంగంలోని 10 ఫ్యాక్టరీలు మూతపడగా ప్రైవేటులో కూడా 4 ఫ్యాక్టరీలే నడుస్తున్నాయి. 2025 నాటికి సుమారు 60-70 శాతానికి సాగు తగ్గిపోవడంతో కేవలం 40 వేల హెక్టార్లలో కూడా పంట వేయలేని పరిస్థితులు దాపురించాయి. అనకాపల్లి ప్రాంతంలో ఇదే చెరుకు ఆధారంగా ‘బెల్లం’ పరిశ్రమ కూడా ఒకప్ప్పుడు దేదీప్యమానం వెలిగేది. అనకాపల్లి బెల్లం మార్కెట్ ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది. అనకాపల్లి అంటేనే బెల్లం అనే బ్రాండ్ ఉన్నది. బెల్లం ఉత్పత్తికి పోను పంచదార ఉత్పత్తికి కూడా చెరుకు సాగు విస్తారంగా ఉండేది. అటువంటిది నేడు చెరుకు సాగు దాదాపు 90 శాతం తగ్గిపోయింది. నేడు బెల్లం తయారీలో కూడా ఈ ప్రాంత రైతాంగం దయనీయ స్థితికి నెట్టబడ్డారు.

ఇప్ప్పుడు లిక్విడేట్ చేసిన అనకాపల్లి జిల్లాలోని ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ 1932లో రిజిస్ట్రర్ అయి 1951-52 సీజన్‌లో ఉత్పత్తిని ప్రారంభించింది. తాండవ, విజయనగరం జిల్లా భీమసింగి ఫ్యాక్టరీ కూడా అదే సమయంలో నెలకొల్పబడ్డాయి. అంత పురాతన ఫ్యాక్టరీలను ఎప్పటికప్ప్పుడు ఆధునీకరించడం, చెరుకు రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం వంటి చర్యలను ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా చేయకపోవడమే షుగర్ ఫ్యాక్టరీలు మూతబడడానికి ప్రధాన కారణం. అనకాపల్లి జిల్లాలో ఉన్న 4 సహకార ఫ్యాక్టరీలు నేడు మూతపడ్డాయి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే గోవాడ షుగర్ ఫ్యాక్టరీని మూతవేశారు. కానీ 2024 ఎన్నికల్లో చంద్రబాబు, లోకేష్‌లు సహకార రంగంలో నడుస్తున్న ఏకైక గోవాడ షుగర్ ఫ్యాక్టరీని ఎలాగైనా ఆదుకుంటామని, ఆధునీకరిస్తామని, దీనికి అనుబంధంగా ఇథనాల్ ఫ్యాక్టరీని నెలకొల్పుతామని చెప్పారు. అనకాపల్లి బిజెపి ఎం.పీ సి ఎం. రమేష్ కేంద్ర ప్రభుత్వం నుండి రూ.200 కోట్లు తెస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీలన్నీ నీటిమూటలుగానే మిగిలిపోయి ఉన్న గోవాడ ఫ్యాక్టరీని నేడు మూసివేశారు.

మరోవైపు చెరుకుకు సరైన మద్దతు ధర లేకపోవడం, కొత్త వంగడాలు ఇవ్వక, ఉన్న ఫ్యాక్టరీలను ఆధునీకరించక, సకాలంలో రైతులకు చెల్లింపులు చేయకపోవడం, పాలకవర్గాల అవినీతి కార్యకలాపాలు వెరసి వీటి ఉసురు తీశారు. రాష్ట్రంలో ప్రభుత్వాలు గత 15 ఏళ్ల నుండి సహకార చక్కెర ఫ్యాక్టరీలను నిర్వీర్యం చేయడం, ఉన్న ఫ్యాక్టరీని, ఇక్కడ రైతాంగాన్ని పట్టించుకోకుండా గాలికొదిలేసింది. మరోవైపు కర్ణాటక, మహారాష్ట్ర్ర, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో చెరుకు రైతులకు ప్రోత్సాహకాలు, గిట్టుబాటుధర కల్పించి పంచదార ఉత్పత్తిలోను, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలోను మంచి ఫలితాలను సాధిస్తున్నాయి. రైతులు, కౌలు రైతుల షేర్స్ సేకరణ ద్వారా ఫ్యాక్టరీలను వాటి ఆస్థులను, భూములు కూడబెట్టడడంతో వాటిని అభివృద్ధి చేయకపోగా ఆ ఆస్తులపై ఇప్ప్పుడు ప్రభుత్వాలలోని పెద్దల కన్ను పడింది. ఈ భూములు, ఆస్తులను కొల్లగొట్టడడం ఒక్కటే వీరి ఎజెండాగా మారింది. దీనికి లిక్విడేషన్ పేరుతో ప్రభుత్వం బరితెగించింది. ఏళ్లతరబడి ఈ సహకార రంగంలో దేదీప్యమానంగా నడిచిన షుగర్ ఫ్యాక్టరీలు, వాటిపై ఆ ప్రాంతాల్లో లక్షలాది రైతులు, కౌలు రైతుల కుటుంబాల జీవన విధానం చిన్నాభిన్నమైందనే విషయాన్నే పాలకులు మరచిపోయారు. ఈ ఫ్యాక్టరీలన్నీ అత్యధికం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. అక్కడ మరో ఉపాధి లేదు. ఈ భూముల్లో అత్యధికం వ్యాపార పంటలే వచ్చాయి. చెరుకు సాగు, పాడితో కుటుంబాలను నెట్టుకొచ్చే రైత్వారీ నేడు ఉపాధి లేక వలస బాటలు పడుతున్నారు. ఇవేవీ పాలకులకు కనబడలేదు. తమ కార్పొరేట్ అనుకూల విధానాలతో ముందుకు పోతున్నారు. అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్లకు వేలకోట్ల రూపాయలను రాయితీలను ఇస్తున్న ప్రభుత్వాలు షుగర్ ఫ్యాక్టరీల ఆధునీకరణకు వందల కోట్లను కూడా కేటాయించడం లేదు. దీని ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల జీవన విధానాన్ని మెరుగుపర్చవచ్చనే కనీస బాధ్యతను కూడా విస్మరిస్తోంది.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సహకార షుగర్ ఫ్యాక్టరీలను లిక్విడేషన్ చేయాలనే ప్రతిపాదనను వెంటనే ఉపసహరించుకోవాలి. షుగర్ ఫ్యాక్టరీలను ఆధునీకరించాలి. ఇప్పటికే ఆ ఫ్యాక్టరీకి చెరుకు తోలిన రైతులకు, పనిచేసిన కార్మికులకు, కొన్ని ఫ్యాక్టరీలలో రిటైర్మెంట్ అయిన వారికి గ్రాట్యూటీ, ఇతర బకాయిలు కూడా నేటికీ చెల్లించలేదు. కొంతమంది వయసుమీరి మరణించారు. వీరి కుటుంబాలకు బకాయిలను వెంటనే చెల్లించాలి. ప్రజల ఆస్థులుగా ఉన్న ఫ్యాక్టరీ భూములు, క్వార్టర్లు, మిషనరీ వంటివి ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచాలి. ఈ ప్రత్యామ్నాయ విధానాల వల్ల ఈ ప్రాంత అభివృద్ధికి, రైతాంగానికి ఉపాధి పరిరక్షింపబడుతుందనే వాస్తవాన్ని మరవరాదు. లేదంటే రైతాంగం కష్టాలే ప్రభుత్వానికి శాపంగా మారుతాయని మరువరాదు!

V.V.Srinivasarao

- వ్యాసకర్త: సిఐటియు అనకాపల్లి జిల్లా అధ్యక్షులు,

సెల్:9490098799


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్