మంగళవారం, 13 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఒకరోజు పొలీసు రాజ్యంగా ఢిల్లీ

1 గంట క్రితం

cse
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 13, 2026, 04:45 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

శనివారం నాడు, భారత ప్రభుత్వం తన పాలనా యంత్రాంగ బలగాన్ని ప్రదర్శించిందిగానీ తద్వారా తన రాజకీయ బలహీనతను బయట పెట్టుకుంది. ఈ రాజకీయ బలహీనత కేవలం పార్టీ అంతర్గత కలహాలకే పరిమితమైంది కాదు. ఒక ప్రభుత్వం తన పౌరుల పట్ల ఎలా వ్యవహరిస్తుందనే విస్తృతమైన కోణంలో కూడా బయటపడిపోయింది. దేశ రాజధాని నగరంలోని వివిధ ప్రాంతాలను నిషిద్ధ ప్రాంతాలుగా మార్చడం ద్వారా విమర్శలను ఎదుర్కొనే సత్తా లేని తన అసమర్థతను బయట పెట్టుకుంది. తనకు మింగుడు పడని క్లిష్టమైన ప్రశ్నలను ఎదుర్కోవడానికి ఏ మాత్రం సిద్ధంగా లేనని ఒప్పుకున్నట్టయింది. శాంతిభద్రతలను కాపాడటం కోసం 'అవసరమైనవే చేశామన్న' వాదన నిలిచేది కాదు. పోలీసులు విపరీతమైన ముందు జాగ్రత్త కోసం కఠినతర చర్యలను సైతం ప్రయోగించి ఆపైన విచక్షణారహితంగా అరెస్టులు చేయడం సుపరిపాలనకు, సదభిప్రాయ కల్పనకూ ఎంత మాత్రం వీలుబడేది కాదు. ఈ రెండూ దుర్గంధపూరితమైన పచ్చి అవినీతి రాజ్యానికి సంకేతాలు తప్ప భారతదేశమనేదాన్ని చూపించవు. మెట్రో, రైళ్ల రాకపోకలను కట్టడి చేయవద్దని అక్టోబర్ 9న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను సర్కారు బేఖాతరు చేయడం ఆశ్చర్యకరం. ఈ నేపథ్యంలో, ఆదివారం నాడు ప్రభుత్వానికి, పోలీసు అధికారులకు కోర్టు ధిక్కార నోటీసు జారీ చేయడం ఇతోధికమైన భరోసా ఇస్తోంది. అదే రోజు రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్‌ను పోలీసులు అరెస్టు చేసి హింసాత్మకంగా వ్యవహరించడం, భిన్నాభిప్రాయాలను పరిష్కరించుకోవడంలో కేంద్ర ప్రభుత్వ కర్కశత్వాన్ని బయటపెట్టింది.​

పౌరులందరికీ శాంతియుత సమావేశ స్వాత్రంత్రాన్ని, హక్కును కల్పిస్తున్న భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(బి) అధికరణం సామాజిక చట్రానికి భంగం కలిగిస్తుందని రాజ్యం గాని, ప్రభుత్వం గానీ భావించటం లేదు. అందువల్ల నిరసనకు అనుమతి పొందలేదు గనక ఆ సమావేశం తప్పని అనడటం ఏ విధమైన తర్కానికి నిలవదు. ఈ నేపథ్యంలో చూస్తే విచిత్రంగా, శనివారం నాటి పరిణామాలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. నగరంలో ఇటువంటి సమావేశాల కోసం నిర్దేశించిన జంతర్ మంతర్‌ లోకి ప్రవేశాన్ని నిషేధించడంతో, నిరసనకారులు అనివార్యంగా, ఇంకా చెప్పాలంటే చాలా చోట్ల అక్షరాలా ఢిల్లీలోని ఇతర ప్రాంతాలకు తరిమివేయబడ్డారు. నిరసనకారులను 'నియంత్రించడానికి' సరిహద్దులు కాచే బి.ఎస్‌.ఎఫ్‌ తో పాటు, సి.ఎ.పి.ఎఫ్, ఢిల్లీ పోలీసులను ఒకటి రెండు కంపెనీల మేరకు మోహరించడం వల్ల ఒకవైపు భయం కలిగించబడినా మరోవైపు ప్రభుత్వానికి కినుక తెప్పించిన విషయమేదో మరింత తేలిగ్గా అర్థమైంది. తమ కదలికలపై ఆంక్షలు ఎలా వుంటాయనేది పోలీసు రాజ్యంలో నివసించేవారికి ఎప్పుడూ అనుభవమే. అలాగే, రాజకీయపరమైన, ఇతరమైన అభిప్రాయాలను వ్యక్తీకరించేందుకూ, ప్రచారం చేసేందుకూ వారికిగల స్వేచ్ఛ పోలీసు నిఘాకూ, నిర్బంధ ఆంక్షల అమలుకూ లోబడి వుంటుంది. శనివారం నాడు, తన పాలనాధిపత్యం, అసమర్థత ప్రదర్శించుకున్న ఢిల్లీ తనకు ఆ కొలబద్దలు వర్తిస్తాయని నిరూపించుకుంది. అత్యవసర పరిస్థితి లేని ప్రజాస్వామ్య భారత దేశంలో ఈ పరిస్థితి ఆ ఒక్క రోజుకే పరిమితమవ్వాలని ఆశిద్దాం.​

(‘ది ఎకనామిక్ టైమ్స్’*సంపాదకీయం)

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్