బుధవారం, 11 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionస్థానిక సంస్థలపై పాలకవర్గాల ఆధిపత్యం

1 గంట క్రితం

sthanika ennikala picture copy(1).jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026, 05:31 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయి. బిజెపితో జట్టుకట్టిన డబుల్‌ ఇంజన్‌ సర్కారు అత్యంత అప్రజాస్వామికంగా వ్యవహరించింది. ప్రత్యర్థులను నామినేషన్‌లు వేయకుండా అడ్డుకోవడం, పత్రాలను చించివేయడం, భౌతిక దాడులు చేయడం, పోలింగ్‌, కౌంటింగ్‌ రిగ్గింగ్‌ చేయడం లాంటి ఘటనలు అనేక ప్రాంతాల్లో జరిగాయి. ఇలాంటి చర్యలను రాష్ట్ర ప్రజలు అంగీకరించని అనుభవం కళ్ళ ముందు వున్నా కూటమి పార్టీలు ఈ రకంగా తెగబడ్డాయి. గతంలో వైసిపి చేసింది కాబట్టి ఇప్పుడు మేము చేశాం అని టిడిపి నేతలు, రెండు సంవత్సరాల తర్వత వడ్డీతో సహా చెల్లిస్తామని వైసిపి నేతలు చేస్తున్న ప్రకటనలు రాష్ట్రాన్ని రావణకాష్టంగా మారుస్తున్నాయి. ఈ దాడులు, దౌర్జన్యాల లక్ష్యం రాజకీయ ఆధిపత్యం కోసం మాత్రమే కాదు, తరాలనాటి సామాజిక, ఆర్థిక ఆధిపత్యాలను కొనసాగించడంలో భాగం. అనేక దశాబ్దాల తర్వాత మహిళలకు, కింది వర్గాల వారికి రాజ్యాంగం ద్వారా అందిన స్థానిక రాజకీయ ప్రాతినిధ్య అవకాశాలను తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు గ్రామీణ పెత్తందార్లు, సంపన్న వర్గాలు, వారసత్వ రాజకీయ కుటుంబాలవారు పెద్ద ఎత్తున డబ్బు, మద్యం వెదజల్లడంతోపాటు, హింసకు పాల్పడుతున్నారు. తమకున్న అంగబలం, అర్ధబలంతో రాజ్యాంగ వ్యవస్థలను అదుపుచేస్తూ ప్రజాస్వామ్య గొంతును నొక్కేస్తున్నారు.

స్థానిక సంస్థలు- ఎన్నికలు

స్థానిక సంస్థల ఎన్నికలంటే పాలకవర్గ పార్టీలకు మొదటి నుండి ఇష్టం లేదు. గ్రామీణ పెత్తందార్లు రాజకీయ అధికారాన్ని తమ అదుపులో పెట్టుకొని, వారసత్వ హక్కుగా అనుభవించేవారు. ప్రజా ఉద్యమాల ప్రభావం, ప్రజల్లో పెరిగిన చైతన్యం వల్ల స్థానిక సంస్థల ఎన్నికల విధానంలో అనేక మార్పులు వచ్చాయి. స్వాతంత్య్రానంతరం రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో భాగంగా పంచాయతీరాజ్‌ వ్యవస్థ ద్వారా స్థానిక స్వపరిపాలనా సంస్థలను ఏర్పాటు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించారు. 1957లో బల్వంతరాయ్‌ మెహతా కమిటీ చేసిన సిఫారసు తర్వాత స్థానిక సంస్థలకు రాజ్యంగబద్ధత కల్పించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే ఆధిపత్య వర్గాల ఒత్తిళ్లతో 1987 వరకు ఈ ప్రయత్నాలు కార్యరూపం దాల్చలేదు. పశ్చిమ బెంగాల్‌ ఆ తర్వాత కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో ఏర్పడిన వామపక్ష ప్రభుత్వాలు ప్రతి ఐదు సంవత్సరాలకు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపడమే కాకుండా అట్టడుగు వర్గాలకు రాజకీయ ప్రాతిని‌ధ్యం కల్పించడం దేశాన్ని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో తుంగన్‌ నాయకత్వంలో ఏర్పడిన కమిటీ సూచనలతో 64, 65 రాజ్యాంగ సవరణల కోసం లోక్‌సభలో కాంగ్రెసు ప్రభుత్వం పెట్టిన బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందకపోవడం స్థానిక సంస్థల పట్ల పాలకుల వైఖరికి నిదర్శనం. 1990లో వామపక్షాల మద్దతుతో అధికారంలోకి వచ్చిన వి.పి. సింగ్‌ 70వ రాజ్యాంగ సవరణకు సిద్ధమైనప్పటికీ ఆ ప్రభుత్వం మధ్యలోనే అధికారాన్ని కోల్పోయింది. 1991లో పి.వి. నరసింహారావు సంకీర్ణ ప్రభుత్వం 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థలకు (గ్రామీణ, పట్టణ) రాజ్యాంగ హోదా లభించింది. స్థానిక సంస్థలకు ఎన్నికలను కేంద్ర నిధులతో ముడిపెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. మహిళా రిజర్వేషన్‌ల కోసం జరిగిన ఉద్యమాల ఒత్తిడితో స్థానిక సంస్థల్లో మూడో వంతు (33 శాతం) స్థానాలను రిజర్వ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా పలు రాష్ట్రాలలో ఇది 50 శాతంగా అమలవుతుంది. జనాభా ప్రాతిపదికన షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలకు స్థానిక ఎన్నికల్లో సీట్లను కేటాయించేలా నిబంధనలు తెచ్చారు. వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేశారు.

అధికార దుర్వినియోగం

స్థానిక సంస్థలకు అధికారాలు, నిధులు కేటాయించడానికి సిద్ధపడని పాలక పార్టీలు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అనేక జిమ్మిక్కులు చేస్తున్నాయి. ఈ ఎన్నికలకు కొన్ని వారాల ముందు న్యాయస్థానంలో నిలవదని తెలిసి బి.సి రిజర్వేషన్ల పెంపుపై కూటమి ప్రభుత్వం పెద్ద హడావుడి చేసింది. బి.సి ల పట్ల చిత్తశుద్ధి వుంటే పార్లమెంట్‌లో చట్ట సవరణ చేయడానికి ఎవరు అడ్డొచ్చారు? అనేక అసౌకర్యాల మధ్య జీవిస్తున్న గిరిజనులు ఎన్నికల ముందు ఉప ముఖ్యమంత్రికి గుర్తుకు వచ్చారు. ఆయన అడవిబాట పట్టారు. రాష్ట్రంలో బలపడేందుకు కాచుకు కూర్చున్న బిజెపి అందినకాడికి పదవులను దక్కించుకుంది.

రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెందు స్థానిక సంస్థల ఎన్నికలను నాడు వైసిపి, నేడు టిడిపి కూటమి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కాయి. 2021లో స్థానిక ఎన్నికల్లో 8,265 ఎంపిటీసీలు, 637 జెడ్‌పిటీసీలను వైసిపి దక్కించుకుంది (ఇందులో 2,371 ఎంపిటీసీలు, 126 జెడ్‌పిటీసీలు ఏకగ్రీవం). అన్ని కార్పొరేషన్‌లను, ఒకటి రెండు మినహా అన్ని మున్సిపాలిటీలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. అనేక ప్రాంతాల్లో టిడిపి అభ్యర్థులు నామినేషన్‌ కూడా వేయలేకపోయారు. మున్సిపల్‌ ఎన్నికలు ముగిసిన తర్వాత పరిషత్‌ ఎన్నికల మధ్యలో ఎన్నికలను బాయ్‌కాట్‌ చేస్తున్నట్లు టిడిపి ప్రకటించింది. తమ పాలనను మెచ్చి ప్రజలు బ్రహ్మరథం పట్టారని గొప్పగా చెప్పుకున్న వైసిపి రెండు సంవత్సరాల తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. ఈ అనుభవం నుండి ఏ మాత్రం పాఠం నేర్వని టిడిపి మరింత దూకుడుగా వ్యవహరించింది. అనేక ప్రాంతాల్లో నామినేషన్‌ నుండి కౌంటింగ్‌ వరకు దాడులు, దౌర్జన్యాలు, రిగ్గింగ్‌లు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులను అడ్డుకున్నారు. కూటమి పార్టీలకు వచ్చిన 7,781 ఎంపిటీసీలు, 575 జెడ్‌పిటీసీలు (ఇందులో 2,051 ఎంపిటీసీలు, 77 జెడ్‌పిటీసీలు ఏకగ్రీవం), అత్యధిక మున్సిపాలిటీలను చూసి 58.9 శాతం ఓట్లతో ఘన విజయం సాధించామని ముఖ్యమంత్రి మొదలు, కూటమి నేతలు నాటి వైసిపి లాగే సంబరపడిపోతున్నారు. ఏజెన్సీ ఏరియాలో కూటమి పార్టీల ఓటమిని మత కోణం నుండి ముఖ్యమంత్రి విశ్లేషించడం ఆందోళనకరం.

నాడు చంద్రబాబు, నేడు జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజాస్వామ్యం కోసం అంటూ ఎన్నికల కమిషన్‌ చుట్టూ పరిభ్రమించడం, న్యాయస్థానాలకు వెళ్లడం, ఆందోళనలు చేయడం చూస్తుంటే పాత్రధారులు మారారే తప్ప పాత్రలు మారలేదన్నది స్పష్టం. ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీలో చేరే స్థానిక పెత్తందార్లు, కాంట్రాక్టర్లు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, నయా ధనికవర్గం స్థానిక ఆధిపత్యం తమ చేతుల్లో నుండి జారిపోకుండా వుండేందుకు ఎంతటికైనా తెగబడి ‘కర్ర వున్న వాడిదే బర్రె’ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. పేదలకు భూమి, ఇల్లు, కార్మికులకు కనీస వేతనాలు, మురికివాడల్లో సదుపాయాలు, మహిళలకు రక్షణ, కుల, లింగ, మత వివక్షల వంటి సమస్యల నుండి ప్రజల దృష్టిని ఉద్దేశపూర్వకంగానే మళ్లిస్తున్నారు.

వామపక్షాల ప్రత్యేకత

నాడు వైసిపి దౌర్జన్యాలను, దాడులను సిపిఎం తీవ్రంగా ఖండించింది. ప్రధాన ప్రతిపక్షం పోటీ చేయలేని స్థితిలో వామపక్ష పార్టీలు పోటీ చేసి కొన్ని స్థానాలను ఆనాడు గెలుచుకున్నాయి. నేడు కూటమి చేస్తున్న అప్రజాస్వామిక విధానాలను ఎదుర్కొంటూనే ఎన్నికల బరిలో నిలిచాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు, ప్రజలపై అధికార పార్టీలు వేస్తున్న భారాలు, ప్రజా సమస్యలపై చేసిన కృషి ఫలితంగా విశాఖపట్నం, విజయవాడ నగరాలతో పాటు మరో నాలుగు మున్సిపాలిటీలలో, 15 ఎంపిటిసీలు, ఒక జెడ్‌పిటిసీ స్థానాలలో సిపిఎం గెలుచుకుంది. మరికొన్ని మున్సిపాలిటీలలో, పరిషత్‌ స్థానాల్లో గణనీయమైన ఓట్లను సాధించింది. సిపిఐ ఆరు కౌన్సిలర్లను, ఏడు ఎంపిటిసీలను గెలుచుకుంది. సంఖ్యరీత్యా ఇవి చిన్నవే అయినా పాలక, ప్రతిపక్ష పార్టీల డబ్బు, మద్యం, అక్రమాలు, అధికార దుర్వినియోగాన్ని తట్టుకుని కమ్యూనిస్టులు ఈ విజయాలను సాధించారు. విజయవాడ నగరంలో ఒక డివిజన్‌లో వరుసగా ఐదుసార్లు, విశాఖపట్నంలో రెండుసార్లు సిపిఎం కార్పొరేటర్లను గెలిపించడం విశేషం. కమ్యూనిస్టులు చేస్తున్న ఉద్యమాలను ఎన్నికల ఫలితాలతో ముడి పెట్టలేము. అనేక ప్రతికూలాల మధ్య ప్రజా ఉద్యమాలను నిర్మించడం, ఎన్నికల వ్యవస్థను సంస్కరించడం, ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవడం కోసం వామపక్షాలకు కార్మిక, కర్షకులు, ప్రజాస్వామిక శక్తులు అండగా నిలవడమే సరైన పరిష్కారం.​

వి. రాంభూపాల్‌

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్