శుక్రవారం, 21 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

భూ..సంత!

1 గంట క్రితం

land
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 22, 2026, 04:15 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

దోశలేయడానికి ముందు.. ఆయిల్ రాసిన పెనంలా, పల్చగా పడిన చినుకులకు తడిసి, హైవే మీద ఆవిర్లు పుట్టుకొస్తున్నాయి. పెద్ద, పెద్ద తోటల్లో మనుషుల సందడి ..షామియానాలు.. కుర్చీలు.. టేబుళ్లు.. వేర్వేరుగా రౌండ్ టేబుల్ సమావేశాలు.. ఒక తోట దగ్గర ఆగింది నారాయణమూర్తి, నాయుడు, బుస్సీ ఉన్న కారు. వెనక కారులో పరదేశి, భోగాపురం బ్రోకర్ ఒకరున్నారు. తోటలో ఒక వంక పెద్ద, పెద్ద కార్లు.. మరో వంక ఆటోలూ, టూవీలర్లూ! భూములు కొన్నోళ్ళవి కార్లు, అమ్ముకునే రైతుల్ని తెచ్చినవి ఆటోలని బ్రోకర్ వివరించాడు. కార్లు దిగి లోపలకు వెళ్లారు అందరూ. మాసిపోయిన షామియానా! ముత్తాతల కాలం నాటి భూమి డాక్యుమెంట్ లాగా ఉంది. కుర్చీలు, టేబుళ్లు పాతబడిపోయాయి. వాతావరణం రిచ్ గా లేదని నారాయణమూర్తి మొహం చిట్లించాడు. గ్రహించాడు భో. బ్రో.

" ఎయిర్‌ ‌పోర్టు ఖాయమని ఎనౌన్స్ సేసిన మర్నాటి నుంచే ఈ సంత మొదలైపోయిందండి సార్ ! సెలవు లేకుండా సెటిల్మెంట్లు జరుగుతున్నాయి మరి! ఎండకు ఎండీ.. వానజల్లులకు తడిసీ..కవులవాడ పెద్ద ముసిలమ్మ బుర్రలాగా.. అయిపోయింది షామియానా!"

" కవులవాడ ముసలమ్మా! ఆవిడెవరు?"

" ఎయిర్ పోర్టు ఖర్చుకి జమైపోయిన పంచ గ్రామాల్లో ఆ ఊరొకటండి. పూర్వం విజయనగరం రాజులు కవులకీ .. పండితులకీ ఇచ్చారట! వాళ్ల కోసం కట్టించిన అగ్రహారమట! ఇప్పుడు కవులూ లేరూ ..కౌలుదారులూ లేరు. మమకారం సంపుకోలేని ఒక అయ్యవారిల్లుందండి.. అయ్యవారు ముత్తాతమ్మ ఒకరున్నారండి .. ఇనికిడీ ..సూపూ ఇంకా పని చేస్తున్నాయండి ..ఇలాగా, ఎయిర్‌ ‌పోర్టుకి ఊరిచ్చేశారని తెలిసిన నాటి నుంచి.. అన్నపానాలు మానేసి, అలాగే మంచమ్మీదే ! పాపం.. ఒకప్పుడు ఊరమ్మవారిలా ఉండేది.. ఇప్పుడేటి సూడగలం? ఎండిపోయిన యాపకొమ్మలాగా.. అయిపోయింది."-- కళ్ళు ఒత్తుకున్నాడు కర్చీపుతో బ్రోకర్.

"భూములు, ఇళ్లూ ఇచ్చిన వాళ్ళని విమానం ఎక్కిత్తామన్నారు గదా, మన బాబులు! ఆయమ్మని ఒకసారి ఎక్కించీలేక పోయారా! గాల్లోనే ..గాల్లోకి.. కలిసిపోయేది ప్రేణం!"--పైడితల్లి మాటల్లో వెటకారం తుళ్లేసరికి కోపమొచ్చింది నాయుడికి.

" ఏరా! రాత్రిది దిగలేదేటీ? ఒంటి మీద తెలివుందా!"-పెద్ద గొంతుతో అన్నాడు. ఆ కోపానికి పరదేశి బిక్క మొహం వేయగా, మిగిలిన వాళ్లు కూడా ఆశ్చర్యంగా చూశారు. కొన్ని నిమిషాలు నాయుడు ఏమీ మాట్లాడలేదు.

అసలు విషయంలోకి వచ్చాడు బ్రోకర్." సారూ! ఇది పోలిపల్లి సంత.. ఆ పంచ గ్రామాలకు సంబంధించింది.. పావు సెంటైనా ఇక్కడ లేదు.. కనీసం నంచుకోవడానికి ( కూర)!..పొలాలూ, ఇళ్లూ పూర్తిగా పోనాయి. ఈ ఊరి దగ్గిర అంబానీకి ఎయ్యెకరాలు ఇచ్చీసినారని టాకు!"-బ్రోకర్ ఇంకా చెప్పబోతుండగా-

" భూముల రేట్లు పెంచడానికి ఇలాంటి పుకార్లు పుట్టిస్తార్లెండి.. మాకూ అంతే .. ముందు గుంటూరన్నారు .. తర్వాత దొనకొండన్నారు..ఆ తర్వాత బెజవాడన్నారు.. చివరకు గుంటూరు, బెజవాడ మధ్య ఫైనల్ చేశారు రాజధాని. లీకైన పేపర్ తో రిజల్ట్ మూటగట్టేశారు పెద్దలు!"- ఇదో బిజినెస్ టెక్నిక్ గా నారాయణమూర్తి కొట్టి పారేశాడు.

" మాకూ అంతేగదండీ! ఎయిర్ పోర్ట్ కోసం సబ్బవరం.. అచ్యుతాపురం..

ఎస్రాయవరం.. తిరిగి, తిరిగి..సివరాఖరికి భోగాపురం బోర్డెట్టేశారు"- గుర్తు చేశాడు నాయుడు.

" ఎండిపోయిన సెరువు సుట్టూ ఒలలొట్టుకొని ఎందుకు తిరగడం? మరొక సంత సూపించూ!"- నాయుడి కోపానికి.. బ్రోకర్ మీద కోపమయ్యాడు పరదేశి.

" మన గ్రీన్ ఫీల్డ్ బుద్ధ కొండ ఏరియాలో చూద్దామా?"- బుస్సీ వైపు చూసి అడిగాడు నారాయణ మూర్తి.

" ఏమయ్యా! గుడివాడ దిబ్బల దగ్గర్లో ఏమైనా ఉంటాయా?"-బ్రోకర్ని అడిగాడు బుస్సీ. బ్రోకర్ కి అర్ధమైపోయింది.. ఇప్పటికే వాళ్ళు భోగాపురం మండలాన్ని జల్లెడ పట్టేశారనీ! కానీ, పెద్ద బేరం.. వదులుకోవడానికి మనసొప్పలేదు.

" సారూ! మండలంలోని ఇరవై గ్రేమాల భూములకీ..బయానాలు ( అడ్వాన్స్) ఇచ్చీయడమో..ఎగ్రిమెంట్లు కట్టీయడమో! జరిగిపోయింటాయి.. మీకూ ఒక ఐడియా ఉన్నట్టుంది. మేమెరగని పేర్లు..తాజూ.. ఒబరాయీ..మైకేలూ... ఇలాటోళ్లందరూ.. భీమిలి నుంచి సింతపల్లి బీచ్ వరకూ కొనేశారట! గవర్నమెంట్ కొందరికి ఇచ్చీసిందట! మీరు మరొకలాగా..బావించకపోతే.. రణస్థలం బెల్ట్ సంతలు చూద్దుమా? అణువిద్యుత్ కేంద్రం రావడం వల్ల ఆ బెల్ట్ రేట్లు కూడా పెరిగాయి. ఏకంగా.. పెద్ద పొలిటికల్ లీడర్లే మా బిజినెస్ లోకి వచ్చేశారంటే.. పరిస్థితి అర్థం చేసుకోండి. శికాకుళం జిల్లాలో మూలపేట - బొమ్మాళి - పలాస బెల్ట్ లో కూడా భూసంతలు మొదలైనట్టు భోగట్టా!"

-- సాయంత్రమవుతోంది. షామియానా లో..ఎవరిదో పెద్ద కేక! "ఒరేయ్..ఈ టేబుల్ కి ఒక జిగేల్ ఫుల్.. కూలింగ్ లేనివి.. నాలుగు వాటర్ బాటిల్స్.. నాలుగు గలాసులు.. తినడానికి ఏమైనా!"

" ఇక్కడ ఇలాంటి ఏర్పాట్లు కూడా ఉన్నాయా!?"- ఆశ్చర్యపోతూ అడిగాడు నారాయణ మూర్తి.

" బాబూ! భూములమ్ముకుంటన్న రైతులకి ఇప్పుడికే గుండెలెండిపోయాయి. మరోవైపు బేరాలాడలేక గొంతుకలెండిపోతన్నాయి.

వొర్షమొకటీ! గట్టిగా పడదూ.. పడకుండా ఉండదూ!"

అందరూ, మౌనంగా బయిటకు నడిచారు. ఎవరికీ కన్పించకుండా, దశుమంతు నాయుడు మాత్రం కండువాతో కళ్లొత్తుకున్నాడు. ఎయిర్ పోర్ట్ వస్తుందని, ఎస్రాయవరం దగ్గర అమ్మేసిన భూమి గుర్తుకొచ్చింది!

- ' నల్లి ' కుట్టు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్