శుక్రవారం, 04 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు - ప్రభుత్వ దుష్ప్రచారం​

5 గంటల క్రితం

pension.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 04, 2026, 05:36 పూర్వాహ్నం | 6 నిమిషాల చదవడం

రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో 99 శాతం ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లకే ఖర్చు చేయాల్సి వస్తుందనే దుష్ప్రచారాన్ని మంత్రుల నుండి ముఖ్యమంత్రి వరకు ఒక పథకం ప్రకారం సాగిస్తున్నారు. ఉద్యోగుల వేతన సవరణ ఎగ్గొట్టటానికే ఈ కుట్రపూరిత ప్రచారానికి వొడిగట్టారు. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లకే ఈ విష ప్రచారం పరిమితం కాదు. ప్రజల సంక్షేమ పథకాలు, రైతుల వ్యవసాయానికిచ్చే ఉచిత విద్యుత్‌ వంటి వాటికి కూడా ఈ విమర్శలను ముడిపెడుతున్నారు. వీటి వల్ల అభివృద్ధికి నిధులు లేకుండా పోతున్నాయనే వాదన చేస్తున్నారు.

ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలో వాస్తవం ఎంతో పరిశీలిద్దాం. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధానంగా మూడు విధాలుగా ఆదాయం సమకూరుతుంది. మొదటిది రాష్ట్ర ప్రభుత్వ సొంత పన్నులు, పన్నేతర ఆదాయం ద్వారా, రెండోది కేంద్ర ప్రభుత్వ పన్నుల్లో రాష్ట్ర వాటాతో పాటు కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ల ద్వారా వచ్చే ఆదాయం. మూడోది అప్పుల ద్వారా సమకూర్చుకునే ఆదాయం. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొదటి రెండు విధాలుగా సమకూరిన ఆదాయం రూ.2.03 లక్షల కోట్లు. ఇవిగాక అప్పుల ద్వారా అదనంగా మరో రూ.77392 కోట్లు సమకూర్చుకుంది. కిందటి ఏడాదిలో చేసిన మొత్తం బడ్జెట్‌ వ్యయం రూ.2.53 లక్షల కోట్లు కాగా ఇందులో రెవెన్యూ వ్యయ పద్దు కింద రూ.2.36 లక్షల కోట్లు ఖర్చు చేశారు. ఇందులో అన్ని తరగతుల ఉద్యోగుల (శాశ్వత, కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌, స్కీమ్‌, ఇతర వేతన ఉద్యోగులు కలిపి) వేతనాలకు 26.04 శాతం, రిటైర్‌ అయిన వారి పెన్షన్లకు 37.36 శాతం చెల్లించారు. రెండింటికి కలిపి 37.40 శాతం ఖర్చు చేశారు. రాష్ట్ర విభజన తరువాత 2015-16 లో చూస్తే మొత్తం రెవెన్యూ వ్యయంలో వేతనాలకు 28.6 శాతం, పెన్షన్లకు 11.7 శాతం రెండింటికి కలిపి 40.3 శాతం చెల్లించారు. పదేళ్ల కాలంలో రాష్ట్ర రెవెన్యూ వ్యయంలో వేతనాలు, పెన్షన్లకు చేసిన చెల్లింపులు 40.3 నుండి 37.40 శాతానికి తగ్గిపోయింది.

ప్రభుత్వం ప్ర‌స్ఫుటంగా చేస్తున్న మరో వాదన ఏమిటంటే రాష్ట్రానికి వచ్చే సొంత పన్ను, పన్నేతర ఆదాయంలో 99 శాతం వేతనాలు, పెన్షన్లకు ఖర్చవుతుందనేది. 2015-16లో రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం (రాష్ట్ర జీఎస్టీ, సేల్స్‌ టాక్స్‌, స్టాంప్స్‌-రిజిస్ట్రేషన్‌ ఫీజు, ఎక్సైజ్‌ డ్యూటీ, వాహన పన్ను, మైనింగ్‌ రాయల్టీ వంటి వాటి ద్వారా)లో వేతనాలకు 61.3 శాతం, పెన్షన్లకు 25. 1 శాతం చొప్పున మొత్తం 86.4 శాతం చెల్లించారు. 2025- 26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి సొంత పన్నులు, పన్నేతర ఆదాయం మొత్తం రూ. 1,17,167 కోట్లు రాగా ఇందులో వేతనాలకు 50.14 శాతం, పెన్షన్లకు 21.99 శాతం, మొత్తం రెండింటికి కలిపి 72.13 శాతం చెల్లించారు. వాస్తవంగా గడిచిన పదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయంలో కూడా ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వాటా 86.4 శాతం నుండి 72.1 శాతానికి అంటే నికరంగా 14.3 శాతం తగ్గిపోయింది. ప్రభుత్వం ఈ కఠోర వాస్తవాలను ఉద్దేశపూర్వకంగా కప్పిపుచ్చి తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నది. ప్రజల్లో వ్యతిరేకత సృష్టిస్తున్నది. ఉద్యోగులు, పెన్షనర్లకు వ్యతిరేకంగా ఉసిగొల్పుతున్నది.

వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో, పరిశ్రమల్లో పని చేసే ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లు, ప్రజలే మూల కారణం. ఉదాహరణకు రాష్ట్ర ప్రభుత్వానికి 2025 -26లో జీఎస్టీ ద్వారా రూ.49498 కోట్లు, స్టాంప్స్‌-రిజిస్ట్రేషన్‌ ఫీజుల ద్వారా రూ.11046 కోట్లు, సేల్స్‌ టాక్స్‌ ద్వారా రూ.17811 కోట్లు, ఎక్సైజ్‌ డ్యూటీ (లిక్కర్‌ పై) ద్వారా రూ.18251 కోట్లు వచ్చింది. ఈ పన్నులు అత్యధిక భాగం ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లు, ప్రజలు వారికి వచ్చే ఆదాయాలను ఖర్చు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆయా పన్నుల ద్వారా ఆదాయం సమకూరుతున్నది. రాష్ట్ర ప్రభుత్వానికే కాదు కేంద్ర ప్రభుత్వానికి కూడా జీఎస్టీ, ఇన్‌కమ్‌ టాక్స్‌, ఎక్సైజ్‌ డ్యూటీ వంటి వాటి ద్వారా వచ్చే ఆదాయానికి వీరే ప్రధాన కారణం.

కానీ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాలకు ఇవ్వాల్సిన కేంద్ర పన్నుల్లో వాటాను ఇవ్వకుండా దిగకోస్తున్నా టిడిపి కూటమి ప్రభుత్వం నోరు మెదపకుండా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయ వనరులను దెబ్బతీస్తున్నది. కేంద్ర 14వ ఆర్థిక సంఘం కేంద్ర పన్నుల ఆదాయంలో రాష్ట్రాలకు 42 శాతం బదిలీ చేయాలని (జమ్ము కాశ్మీర్‌ను విభజించిన తరువాత 41శాతానికి తగ్గించారు) సిఫారసు చేసింది. దీని ప్రకారం మన రాష్ట్రానికి కేంద్ర పన్నుల ఆదాయాన్ని మోడీ ప్రభుత్వం బదిలీ చేయడంలేదు. గత పదేళ్లుగా 30 శాతానికి మించి ఇవ్వడం లేదు.

మరొకటి కేంద్రం ప్రభుత్వం సంక్షేమ పథకాలు, స్థానిక సంస్థలకు బదిలీ చేయాల్సిన ఆర్థిక సంఘం నిధులు, అభివృద్ధి గ్రాంట్లకు కూడా భారీ కోత పెడుతున్నది. 2021-22లో రూ.39170 కోట్లు ఈ పద్దుల కింద రాగా 2025-26కి రూ.20,322 కోట్లుకు కోత పెట్టింది. అయినా టిడిపి ప్రభుత్వం కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని నిలేయడం లేదు సరికదా పైగా కేంద్రంతో రాష్ట్ర కూటమి జత కట్టడం వల్ల రాష్ట్రానికి భారీగా నిధులొస్తున్నాయనే మాయా ప్రచారాన్ని సాగిస్తున్నది. రాష్ట్ర ఆర్థిక దుస్థితికి ఉద్యోగులు, పెన్షన్‌దారులను ప్రధాన కారకాలుగా బోనులో నిలబెడుతున్నది.

రాష్ట్ర కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక, పారిశ్రామిక విధానాలు రాష్ట్ర ప్రభుత్వ పన్ను, పన్నేతర ఆదాయ రాబడిని దారుణంగా దెబ్బతీస్తున్నది. ఉదాహరణకు విశాఖపట్నం దగ్గరలో నక్కపల్లి దగ్గర ఏర్పాటు చేయబోతున్న ఆర్సిలాల్‌ మిట్టల్‌ స్టీల్‌ప్లాంట్‌కి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పన్ను రాయితీలు, సబ్సిడీలు వల్ల రాష్ట్ర ఖజానా రూ 28 వేల కోట్లు నష్టపోతున్నది. ఈ పరిశ్రమకు అవసరమైన నీటి సరఫరాకు ఏకంగా రూ.660 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆసియా అభివృద్ధి బ్యాంకు నుండి అప్పు తీసుకొని 50 కిలో మీటర్ల పొడవునా పైపులైన్‌ కూడా వేస్తున్నది. విశాఖ చుట్టూ గూగుల్‌, అదానీ, రిలయన్స్‌ వంటి సంస్థలు ఏర్పాటు చేయబోతున్న 6.5 గిగావాట్ల (6500 మెగావాట్ల) సామర్ధ్యం కలిగిన డేటా సెంటర్లకు సుమారు రూ.లక్షా 43 వేల కోట్ల పన్ను రాయితీలు, సబ్సిడీలు ఇస్తున్నది. ఇంత పెద్ద మొత్తంలో రాష్ట్ర ఖజానా నష్టపోతున్నది. ఇటీవల ప్రారంభించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ఆదాయం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని, పన్నులను చంద్రబాబు ప్రభుత్వం పదేళ్ల పాటు చెల్లించనవసరం లేదని ఒప్పందం చేసుకుంది.

రాష్ట్రంలో పరిశ్రమలు, పోర్టులు, ఎయిర్‌ పోర్టులు, స్టార్‌ హోటళ్లు, షాపింగ్‌ మాళ్లు... ఇలా ఏది ఏర్పాటు చేసినా 10 నుండి 15 ఏళ్ళు పాటు పన్నులు పూర్తిగా మినహాయించేశారు. అనేక సబ్సిడీలు ఇచ్చేస్తున్నారు. పైగా ఇపుడు పెట్టుబడులు పెట్టే వారికి రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో వారికి మౌలిక సదుపాయాలు కల్పించటమే కాక పెట్టుబడి వయబులిటీ గ్యాప్‌ పేర పెట్టే పెట్టుబడిలో 20 శాతం ఎదురు డబ్బు రాష్ట్ర ఖజానా నుండి ఇస్తుందని జీవోలు విడుదల చేశారు. ఒక్క డేటా సెంటర్లకే రాష్ట్ర ఖజానా నుండి సుమారు రూ.30 వేల కోట్లు చెల్లించటానికి ఒప్పందం చేశారు. ఒకవైపు పన్నుల మినహాయింపు, సబ్సిడీల వల్ల రాష్ట్ర ఖజానా రూ.వేల కోట్లు నష్టపోతుండగా... రెండో వైపు ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లు, ప్రజలు చెల్లించే పన్నుల ఆదాయాన్ని కూడా అప్పనంగా పెట్టుబడిదారులకు దోచి పెడుతూ... ఉద్యోగులు, పెన్షనర్ల పిఆర్‌సి పై దాడి చేస్తున్నది. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (ఎస్‌ జిడిపి) పెరిగినా రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం, పన్నేతర ఆదాయం పెరగటం లేదు. దీనికి ప్రధాన కారణం పెట్టుబడిదారులకు, పారిశ్రామిక అధిపతులకు ఇస్తున్న భారీ పన్నుల రాయితీలు, సబ్సిడీలే. దీనివల్ల గత పదేళ్లలో రాష్ట్ర జిడిపి లో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం బాగా తగ్గిపోయింది. రెండో పక్క రాష్ట్రంలో ఉన్న ఖనిజ సంపదను విచ్చలవిడిగా కార్పొరేట్‌ దోపిడీ‌కి అనుమతించడంతో పన్నేతర ఆదాయం కూడా రూ.వేల కోట్లు నష్టపోతున్నది. ఒక పరిశోధన ప్రకారం మైనింగ్‌ అక్రమాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి సుమారు రూ.12 నుండి రూ.15 వేల కోట్లు నష్టపోతున్నది.

రాష్ట్రంలో మరో తరహా ప్రమాదకర విధానాలు కూడా అమలు జరుగుతున్నాయి. గత మూడు దశాబ్దాల క్రితమే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రపంచబ్యాంకుతో ఒప్పందం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలను బలహీనం చేసి ప్రైవేట్‌ శక్తులకు వాటిని అప్పజెప్పే విధానాలకు పూనుకున్నారు. ఇందులో ముఖ్యమైనది వివిధ ప్రభుత్వ డిపార్టుమెంట్లలో ఉన్న శాశ్వత ఉద్యోగులను క్రమంగా తొలగించడం, వీళ్లపై పెట్టే వేతన ఖర్చును తగ్గించుకోవడం. వీరి స్థానంలో అతి తక్కువ వేతనాలతో, ఏ హక్కులు, ఉద్యోగ భద్రత లేని వారిని నియమించుకోవడం. కొన్ని డిపార్టుమెంట్‌ విధులను పూర్తిగా ప్రైవేటుపరం చేయడం. ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహిస్తున్న బాధ్యతల నుండి క్రమేణా వైదొలిగి వాటిని ప్రైవేట్‌ మార్కెట్‌ శక్తులకు అప్పజెప్పటం. ఇప్పుడు మనం వీటి దుష్పలితాలన్నింటి చూస్తున్నాం. ప్రస్తుతం ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో డిసెంబర్‌ 2025 నాటికి రాష్ట్ర ప్రభుత్వ అన్ని డిపార్టుమెంట్లలో (ఆర్‌టిసి తో కలిపి) 5,87,299 మంది పర్మినెంట్‌ ఉద్యోగులున్నారు. వీరుగాక కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌, అంగన్వాడీ, ఆశా వంటి స్కీమ్‌ వర్కర్లతో పాటు ఇతర పేర్లతో ఉన్న కాంట్రాక్ట్‌ వేతన ఉద్యోగులు మొత్తం 4,19,839 మంది ఉన్నారు. మొత్తం పర్మినెంట్‌, పర్మినెంటేతర కార్మికులు 10,07,138 మంది పని చేస్తున్నారు. రాష్ట్ర ఉద్యోగ వ్యవస్థలో పాలకులు ఎంత పెద్ద మార్పులు తీసుకొచ్చారో ఈ అంకెలను బట్టి అర్థమవుతున్నది.

ఇపుడు ఈ విధానాలను వేగవంతం చేశారు. ప్రతి ఏడాది 15 వేల మదికి పైగా పర్మనెంట్‌ ఉద్యోగులు రిటైర్‌ అవుతున్నారు. 2036 నాటికి 1,52,738 మంది రిటైర్‌ అవుతారు. వీరి స్థానంలో కొత్త వారిని నియమించడం లేదు. ఖాళీ పోస్టులను రద్దు చేస్తున్నారు. విద్యా రంగాన్ని క్రమేణా కుదించేస్తున్నారు. కొన్ని రంగాలకు రంగాలనే ప్రైవేట్‌ పరం చేసే చర్యలకు తలపడుతున్నారు. కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌, స్కీమ్‌ వర్కర్లను బడా ఏజెన్సీలకు అప్పజెప్పేందుకు ఆలోచనలు చేస్తున్నారు. రెండు దశాబ్దాల క్రితమే పాత పెన్షన్‌ పథకాన్ని రద్దు చేసేశారు. ఇలా మొత్తం ప్రభుత్వ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారు. అందువల్ల మొత్తం ఈ ప్రమాదకర విధ్వంసానికి వ్యతిరేకంగా రాజకీయ చైతన్యంతో ఐక్యంగా ఉద్యమించడమే నేటి తక్షణ కర్తవ్యం.

Gangarao garu

వ్యాసకర్త : డా.బి.గంగారావు

సెల్‌ : 9490098792 /

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్