గురువారం, 16 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionతప్పు దాతలదే, దొంగలదేముంది!

9 గంటల క్రితం

ram_mandir_donation
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 16, 2026, 05:00 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

‘అడ్డగోలు మాటలకు అర్థాలే లేవులే’ అన్నట్టుంది సంఘపరివార్‌ ‌రామభక్తులు పరిస్థితి. అయోధ్య రామమందిరంలో అంత అవినీతి జరిగితే ఆవగింజంత పశ్చాత్తాపం లేకపోగా నోటికొచ్చినట్టు సమర్థించుకుంటూ ఎదురుదాడి చేస్తున్నారు. మొన్నటికి మొన్న అయోధ్య తీర్థ టస్టు సమావేశం జరిగితే మొక్కుబడిగా రాజీనామా చేసిన ట్రస్టు కార్యదర్శి చంపత్‌ ‌రామ్ కూడా రాజీనామా చేయడమేంటని సభ్యులు బాధపడిపోయారట. ఇప్పుడు జరగాల్సింది కేవలం ఒక సిఇవో ను తెచ్చిపెట్టడం తప్ప వేరే ఏమీ అవసరం లేదని తేల్చేశారు. అందుకోసం అడ్వర్టయిజ్‌‌మెంట్‌ ‌కూడా ఇచ్చారు. వెయ్యి దరఖాస్తులు వచ్చాయట. ఇది చాలనట్టు తాజాగా ఉత్తర ప్రదేశ్‌ ‌శాసనసభ స్పీకర్‌ ‌మరో ఆణిముత్యం సెలవిచ్చారు. రాముడి కోసం విరాళం ఇచ్చినవారు చిత్తశుద్ధితో ఇవ్వని వారి సొమ్ములే దొంగతనం అయ్యాయని ఆయన భాష్యం. సరైన మనసుతో ఇస్తే ఏమీ అయ్యేది కాదు. నేనే చూడండి.. ఎంతో మంచి మనసుతో ఇచ్చాను. మొదటి నుంచి ఈ ఉద్యమంలో వున్నాను. ఇంత గొప్ప ఆలయ నిర్మాణం జరిగింది. దొంగతనాలు ఎక్కడ జరగవు? అంతమాత్రాన నిర్వాహకులను అంటారేంటి అని కోప్పడిపోయారట. మళ్లీ కాస్త సర్దుకుని... తప్పు జరగలేదని కాదు. కాని సిసలైన భక్తులు ఇవ్వాల్సింది ఇచ్చి, దేవుడిపై భారం వేస్తారుగానీ దాని గురించే విచారిస్తూ కూర్చోరని ముక్తాయించారు. అందుకే అనడం...భక్తులందు సంఘ్‌ ‌భక్తులు వేరయా!

​ ఖుష్బూ సుందర్‌ ‌కోపం కరెక్టే

తమిళనాట ప్రముఖ నటీమణి, కాంగ్రెస్‌ ‌నుంచి బిజెపి లో చేరిన నాయకురాలు ఖుష్బూ సుందర్‌, ఇటీవలనే కుమార్తె పెళ్లి చేశారు. ఆమెకు అవంతిక, ఆనందిత ఇద్దరు కుమార్తెలు. వీరు కూడా చిన్నప్పటి నుంచి కెమెరా వెలుగుల మధ్య పెరిగినవారే. ఈ మధ్యనే ఆనందిత నౌకాదళాధికారి శ్రావణ్‌ ‌శ్రీనివాసన్‌‌ను పెళ్లి చేసుకుంది. షరామామూలుగా హంగామా వుండింది. గతవారం ఆమె ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూ లో మాట్లాడారు. ‘చిన్న నాటి నుంచే నన్ను ట్రోల్‌ చూస్తూ వచ్చారు. ఈ మధ్యనే తాజాగా మరో వింత కామెంట్‌‌లు చూశాను. నా మొహం ట్రాన్స్‌‌జెండర్‌‌లా వుంటుందట. ఏం చెబుతాం? నిజంగా వాళ్లు అందంగా వుంటారనే నేను చాలాసార్లు చెప్పాను. అయితే నన్నే అలా వున్నావని ఎగతాళి చేస్తారనుకోలేదు’ అని నిట్టూర్చారు. ఇది చూశాక ఖుష్బూలోని తల్లి మేల్కొని ఒక సుదీర్ఘ పోస్టు పెట్టారు. ‘తలిదండ్రులనూ పిల్లలనూ గేలి చేయడం ఏం పద్ధతి? మా పిల్లలకు ఇవేం కొత్త కావు. నా తలిదండ్రుల పెంపకం తీరును నేనెప్పుడూ తప్పు పట్టను. కానీ ప్రతి దానికీ పరిమితులుంటాయి. నా పిల్లలను ఊరికే అవమానకరంగా చూపిస్తే, మాట్లాడితే ఊరుకుంటానని అనుకోకండి. ఇప్పటికి జరిగిందేదో జరిగింది. ఇకనైనా ఇలాంటి చిల్లర పనులు మానుకోండి’ అని గడ్డి పెట్టారు. నటి రాధిక కూడా ఖుష్బూను సమర్థిస్తూ పోస్ట్‌‌ పెట్టారు. ఈ మధ్యనే కదా భాగ్యరాజా అంతిమ యాత్ర సమయంలో రాధిక యూట్యూబర్లకు క్లాస్‌ ‌పీకారు?

రక్తం రాక్షసులు.. రాజకీయ భాష!

బుధవారం నాడు ‘హిందూ’ విలేకరి తెలంగాణ రాజకీయాలలో కీలక నేతల తిట్లు, దూషణలు శృతి మించి పోతున్నాయని ఒక వ్యాసం రాశారు. నిజానికిది ఆంధ్రప్రదేశ్‌‌కూ వర్తిస్తుంది. రెంటినీ కలిపి చూడటం కూడా కొత్త లక్షణంగా తయారైంది. ఈ మధ్య రంగారెడ్డి జిల్లాలో రాజ్‌‌కుమార్‌ అనే సైకో హంతకుడు ఒక బాలిక కుటుంబాన్ని, తన కుటుంబాన్ని కూడా హత్యచేసి, తనూ ఆత్మహత్య చేసుకున్నాడు. తను రాజకీయ చర్చకు ఒక సాధనంగా మారతానని ఆ హంతకుడికి తెలిసి వుండదు గానీ అక్షరాలా అదే జరుగుతున్నది. ఎ.పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా చిట్‌‌చాట్‌‌లో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్‌ ఆ సైకో లాంటివాడని పోల్చి చెప్పారు. సరే వైసిపి అధినేతను సైకో అనడం నిరంతర తతంగమే గనక ఓకె అనుకుంటే...తెలంగాణ సి.ఎం ను ఆ హంతకుడితో పోల్చి మాట్లాడారు బిఆర్‌ఎస్‌ ‌మాజీ మంత్రి హరీష్‌‌రావు. రేవంత్‌ ‌తక్కువ కాదు కదా? మాజీ సిఎం కెసిఆర్‌ ‌ అరుంధతి సినిమాలో ‘వదల బొమ్మాళి పశుపతి ’ వంటి వాడనీ ఆయనను ఫాం హౌస్‌ ‌దాటి రానివ్వబోనని ప్రకటించారు. బూతుల భాష చాలనట్టు ఈ రక్త భాష లోకి రాజకీయం మారిపోతుంటే ఎవరో యూట్యూబర్లు ఏదో అన్నారని కేసులు పెట్టడం మరీ అతిగా అనిపించదూ?

అక్కడ అక్కర్లేదంటుంటే ఇక్కడ అందలమా? డేటా బేటా?

ప్రపంచ డేటా క్యాపిటల్‌ ‌మనదే అని కూటమి మురిసిపోతుంది గానీ అసలు కథ వేరే వుంది. అమెరికా మాత్రం వద్దు పొమ్మని తరిమేస్తున్నది. తాజాగా న్యూయార్కు గవర్నర్‌ క్యాథీ హోచుల్ తమ ర్రాష్టంలో డేటా సెంటర్లకు చోటు లేదని హుకుం జారీ చేశారు. ఏడాది పాటు పెద్ద డేటా సెంటర్లను అనుమతించబోమన్నారు. అవే అధిక భాగం నీరు, అత్యధిక విద్యుత్‌ ‌తీసుకుంటున్నాయని ఆందోళన ఇందుకు కారణమన్నారు.‌ వాటికి ఇచ్చిన పన్ను మినహాయింపులు కూడా వెనక్కు తీసేసుకుంటున్మామన్నారు. పర్యావరణంపై ప్రభావం కూడా లోతుగా పరిశోధన చేయాలన్నారు. అంతర్జాతీయంగా డేటా సెంటర్లపై సందేహాలు పెరుగుతున్న సందర్భంలో న్యూయార్కు తీసుకున్న ఈ నిర్ణయం సంచలనం కాబోతున్నది. గత నెలలోనే ఆ రాష్ట శాసనసభ దీనిపై ఆంక్షలతో ఒక తీర్మానమే ఆమోదించింది. ఈ మధ్యనే ప్రజాశక్తి డేటా సెంటర్లపై సిరీస్‌ ఇవ్వడం గుర్తుండే వుంటుంది కదా. అయితే అభివృద్ధికి అడ్డు పడటం అంటారు బాబు గారు!!

- పీపీ

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్