ఆదివారం, 01 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionముందుగా వాళ్ళు పుస్తకాలను తగలబెట్టారు...

10 గంటల క్రితం

books buldozer.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026, 05:28 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

“ఎక్కడైతే వాళ్ళు పుస్తకాలను తగలబెడతారో, చివరికి వాళ్ళు మనుషులను కూడా తగలబెడతారు.” ​

జర్మన్ కవి, నాటకకర్త హెన్రిచ్ హైన్ 1823లో రాసిన 'అల్మాన్సోర్' నాటకంలోని ఈ ప్రముఖ వాక్యాలు సెంట్రల్ బెర్లిన్‌ లోని బెబెల్‌ప్లాట్జ్ చౌరస్తాలో ఉన్న 'బిబ్లియోథెక్ స్మారకం'పై చెక్కబడి ఉన్నాయి. 1933 మే 10న నాజీలు జరిపిన పుస్తకాల దహనకాండను ఇది గుర్తు చేస్తుంది. నాడు జర్మన్ విద్యార్థి యూనియన్ సభ్యులు, విశ్వవిద్యాలయ ఆచార్యులు తమ సిద్ధాంతాలకు "వ్యతిరేకమైనవి"గా భావించిన 25,000 కంటే ఎక్కువ పుస్తకాలను తగలబెట్టి నాశనం చేశారు. నాజీల ప్రభుత్వ మద్దతుతో చేపట్టిన ఈ సెన్సార్‌షిప్, సాంస్కృతిక విధ్వంసక ప్రచారంలో మార్క్సిస్ట్, కమ్యూనిస్ట్ సాహిత్యం ప్రధాన లక్ష్యంగా మారింది. కార్ల్ మార్క్స్ పుస్తకాలతో సహా 4000 కంటే ఎక్కువ ఇతర శీర్షికల ప్రతులతో పాటు హైన్ రచనలను కూడా నాజీలు తగలబెట్టారు. పశ్చిమ బెంగాల్‌లో పూజా ఉత్సవాల సమయంలో సిపిఎం, ఇతర వామపక్ష సంస్థలు ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనలపై దాడి చేయడానికి బుల్డోజర్లు, ఆయుధాలు ధరించిన పోలీసులు, గూండాలు, అల్లరి మూకలను పంపడం ద్వారా బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ తమ నాజీ పూర్వీకులు 1930 లలో చేసిన అవమానకరమైన చర్యను పునరావృతం చేశాయి. రాష్ట్రంలో బిజెపి పాలనలో జరిగిన మొదటి శరదోత్సవాల సమయంలో వామపక్ష, అభ్యుదయ పుస్తక ప్రదర్శనశాలలు ధ్వంసయత్నాలు, విధ్వంసాలు, రాక్షసకాండలు, బెదిరింపులను ఎదుర్కొన్నాయి. ఈ దాడులు బహిరంగ పఠనం, రాజకీయ చర్చలు, అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించే ఆలోచనలను స్వీకరించే స్వేచ్ఛ వంటి బెంగాల్ యొక్క సుదీర్ఘ సాంస్కృతిక సంప్రదాయపు మూలాలనే దెబ్బతీస్తున్నాయి.

బెంగాల్ పండుగల సమయంలో వామపక్ష పార్టీలు, ఇతర సంస్థలు నడిపే పుస్తకాల దుకాణాలు కొత్తేమీ కాదు. ఇది 1950ల నాటి సంప్రదాయం. కామ్రేడ్ ముజఫర్ అహ్మద్ మొదటి సారిగా దుర్గా పూజ పండాల్ దగ్గర పుస్తకాల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. రాజకీయ సాహిత్యం, అభ్యుదయ రచనలు, చరిత్ర, వివిధ సామాజిక అంశాలపై పుస్తకాలు, మార్క్సిస్ట్ మేధావుల రచనలతో కూడిన స్టాళ్లు ...పూజ పండుగల సంబరాలలో, సంబంధిత సాంస్కృతిక కార్యకలాపాలలో అంతర్భాగంగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వీటిని సందర్శించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ సుసంపన్నమైన సంప్రదాయాన్నే రాజకీయ జోక్యం, బెదిరింపులు, రౌడీయిజం ద్వారా దెబ్బ తీయడానికి బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ లు ప్రయత్నిస్తున్నాయి.

సందర్శకులకు ఈ స్టాళ్లు రాజకీయ ఆలోచనలను పరస్పరం పంచుకోవడం, సంభాషించుకోవడం, కార్పొరేట్- మతతత్వ కూటమి ప్రచార బాకాగా మారిన మీడియా సృష్టించే ప్రధాన స్రవంతి కథనాలను ప్రశ్నించే ఆలోచనలకు వేదిక కావడం మూలంగా ఇవి హిందుత్వ శక్తుల ప్రధాన లక్ష్యంగా మారాయి. విశ్వవిద్యాలయాలు, తరగతి గదులు, ప్రైవేట్ లైబ్రరీలను దాటి ఈ స్టాళ్లు ఆలోచనలను ప్రజలందరూ తిరుగాడే ప్రదేశాలకు తీసుకెళ్తాయి. మున్సిపల్ నిబంధనలు, అనుమతుల పేరు చెప్పి, ప్రభుత్వం కండబలాన్ని ఉపయోగించి రాజకీయంగా బెదిరించడం ద్వారా బహిరంగ ప్రదేశాలను ఆక్రమించే, ఆలోచనలను ప్రచారం చేసే, సమాజ సాంస్కృతిక జీవితంలో పాల్గొనే హక్కును అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారు. తమకు నచ్చిన రాజకీయ, సైద్ధాంతిక వ్యవస్థను ప్రశ్నించే ఆలోచనలను మూగబోయేలా చేయడం, నిర్బంధంగా ఒకే కథనాన్ని ప్రజల ఆలోచనల మీద రుద్దడమే వీరి లక్ష్యం.​

పుస్తకాలు రేకెత్తించే ప్రశ్నలకు భయపడితే...

ఫ్రాంకోయిస్ ట్రుఫాట్ 1966లో తీసిన 'ఫారెన్‌హీట్ 451' చిత్రం (రే బ్రాడ్‌బరీ అదే పేరుతో రాసిన నవల ఆధారంగా) పుస్తకాలు రేకెత్తించే ప్రశ్నలకు భయపడి వాటిని నిర్మూలించడానికి ప్రయత్నించే ఒక నిరంకుశ సమాజాన్ని ఊహిస్తుంది. ఆ సమాజంలో పుస్తకాలు నిషేధించబడతాయి. వాటిని తగలబెట్టే బాధ్యత ఫైర్‌మెన్‌లకు అప్పగించబడుతుంది. ప్రజలు విమర్శనాత్మక ఆలోచన చెయ్యడం నుండి మినహాయించబడతారు. ఆమోదించబడిన కొన్ని ఆలోచనలకే పరిమితమై, స్వతంత్ర ఆలోచనను వినాశకరమైనదిగా భావించేలా శిక్షణ పొందుతారు. ఆ సమాజంలో పుస్తకాలు ప్రమాదకరమైనవి, ఎందుకంటే అవి ప్రపంచం గురించిన ప్రత్యామ్నాయ దృక్పథాలను పట్టిస్తాయి, పాఠకులు ప్రస్తుత వ్యవస్థకు ప్రత్యామ్నాయాలను ఊహించుకోవడానికి దోహదపడతాయి.

పుస్తకాలను తగలబెట్టడం ద్వారా నాజీలు తమ పాలనా దృక్పథానికి సరిపోని రచనలను, మేధో సంప్రదాయాలను నిర్మూలించడానికి ప్రయత్నించారు. పుస్తకాలను తగలబెట్టే సమయంలో నాజీ పార్టీ ముఖ్య ప్రచారకుడు, రీచ్ ప్రచార మంత్రి జోసెఫ్ గోబెల్స్ మాట్లాడుతూ, " జర్మనేతర స్ఫూర్తికి విరుద్ధమైన వాటికి తగిన సత్కారం జరుగుతుంది" అని ప్రశంసించారు. ఏ రచయితల పుస్తకాలను తగలబెడుతున్నారో ఆ రచయితలను "మేధో మురికి" అనీ, "యూదు సాయుధ సాహిత్యకారులు" అని తూలనాడాడు. జర్మన్ భాషా సాహిత్యాలను శుద్ధి చేయవలసిన అవసరాన్ని, సాంప్రదాయ జర్మన్ విలువలను స్పష్టం చేయవలసిన అవసరాన్ని వివరించే ప్లకార్డులు ప్రదర్శించారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి వామపక్ష పుస్తక స్టాళ్లపై దాడులను సమర్థిస్తూ మాట్లాడిన మాటలు అచ్చం నాజీల మాటలను పోలి ఉన్నాయి. " దేశ వ్యతిరేక, సనాతన ధర్మ వ్యతిరేక రచనలను" ప్రచురించడానికి ఎవరినీ అనుమతించబోమని ఆయన ప్రకటించారు. స్టాళ్లను నడుపుతున్న వాలంటీర్లను, వాటిని రక్షిస్తున్న వారిని "బొద్దింకలు, నల్లులు, దిమాగీ నక్సల్స్, టుక్డే టుక్డే గ్యాంగ్" అని సంబోధిస్తూ వారిని నిర్మూలించాలని పిలుపునిచ్చారు. సెప్టెంబరులో రాష్ట్ర అసెంబ్లీ వేదికగా పండాళ్ల వెలుపల సిపిఎం పుస్తక స్టాళ్లను అనుమతించవద్దని పూజా కమిటీలను ఆదేశించడం ద్వారా ఆయన ఘర్షణ వాతావరణం సృష్టించడానికి నాంది పలికారు.

సంఘ్ పరివార్ చేసే పుస్తకాల విధ్వంసం, స్టాళ్లను నడుపుతున్న వారిపై దాడులు... ఆలోచనా స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛ పట్ల వాళ్లకున్న శత్రుత్వానికి కొనసాగింపు చర్యే. ఎం.ఎఫ్. హుస్సేన్ ప్రదర్శనలు, సహమత్ 'హమ్ సబ్ అయోధ్య'పైనా వారు చేసిన దాడులు గుర్తుకొస్తాయి. త్రిపురలో లెనిన్ విగ్రహం కూల్చివేత, ఇటీవల రాణిగంజ్‌లో రాహుల్ సాంకృత్యాయన్ విగ్రహం కూల్చివేత అన్నీ ఒకే ప్రణాళికలో భాగం. చోర్‌బగాన్‌లో జనాన్ని అదుపు చేయడానికి, ప్రజారోగ్య భద్రతకు సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ఒక చిన్నారితో సహా 19 మంది ప్రాణాలు కోల్పోగా, జాదవ్‌పూర్‌లో పుస్తకాలను ధ్వంసం చేయడానికి భారీ పోలీసు బలగాలను మోహరించడం బిజెపి ప్రభుత్వ ప్రాధాన్యతలను స్పష్టంగా తెలియజేస్తోంది.

బెదిరింపులకు సమాధానం - మరిన్ని పుస్తకాలు

'ఫారెన్‌హీట్ 451' నవలలో, పుస్తకాలను కాపాడుకోవడం అనేది తమ మేధో వారసత్వాన్ని తుడిచిపెట్టడానికి ప్రయత్నించే సమాజానికి వ్యతిరేకంగా చేపట్టిన ఒక నిరసన చర్యగా మారుతుంది. బెంగాల్‌లో పుస్తకాల స్టాళ్లను ధ్వంసం చేసే వారికి సమాధానం వాటిని రక్షించడం, పునర్నిర్మించడం, పుస్తకాలను నిరంతరం అందుబాటులో ఉంచడమే. మా కామ్రేడ్లు సాధించగలిగింది కూడా ఇదే.

జాదవ్‌పూర్ స్టాల్ వంటి అనేక ప్రదేశాలలో, ప్రజల వీరోచిత ప్రతిఘటన రాష్ట్ర యంత్రాంగాన్ని వెనక్కి తగ్గేలా చేసింది. దాడులు జరిగినప్పటికీ, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 100 ఎక్కువ పుస్తక స్టాళ్లు ఏర్పాటు చేయబడ్డాయి. గూండాలు ధ్వంసం చేసిన దాదాపు అన్ని పుస్తక స్టాళ్లు మరుసటి రోజు నాటికే మళ్లీ పనిచేయడం ప్రారంభించాయి. పుస్తకాల విక్రయాలు 60 శాతం పెరిగాయనే నివేదికలు వామపక్ష, అభ్యుదయ సాహిత్యంపై ఆసక్తిని తగ్గించడానికి బదులుగా, ఈ దాడులు పుస్తక స్టాళ్ల వైపు పాఠకుల దృష్టిని ఆకర్షించాయని వెల్లడవుతున్నది.

ఎంత చిన్నదైనా ఒక పుస్తక స్టాల్ బాటసారికి ఒక పుస్తకాన్ని చేతిలోకి తీసుకోవడానికి, ఒక వాదనను ప్రశ్నించడానికి, తెలియని చరిత్రను తెలుసుకోవడానికి లేదా అంతకు ముందు ఎన్నడూ ఎదుర్కొనని రాజకీయ కోణంతో మమేకమవ్వడానికి అవకాశం కల్పిస్తుంది. ఈ విధంగా వేలాది మంది ప్రజలు అభ్యుదయ రాజకీయాలతో పరిచయం పెంచుకుంటారు. అందుకే నాడు బ్రిటిష్ వారు మన పుస్తకాలను జప్తు చేసి, మన పుస్తకాల షాపులను మూసివేశారు. నేడు ఆర్‌ఎస్‌ఎస్ కూడా అదే దుర్నీతికి పాల్పడడానికి ప్రయత్నిస్తోంది.

ఫాసిస్ట్ సంఘ్ పరివార్, వారి కథనాలను బలవంతంగా రుద్దే ప్రయత్నాలపై మనం చదివే పుస్తకాలు, మన ఆలోచనలు, ప్రజల ఐక్యత గెలవాలి. ప్రజల భవిష్యత్తు దీనిపైనే ఆధారపడి ఉంది.

mababy4287-1793287601654-1416.jpg

వ్యాసకర్త : ఎం.ఎ.బేబి ​

సి.పి.యం ప్రధాన కార్యదర్శి

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్